దారి ఖర్చులకే సగం ఆసరా పెన్షన్!

దారి ఖర్చులకే సగం ఆసరా పెన్షన్!

తెల్లవారు జాము 4 నుంచే పోస్టాఫీసుల వద్ద పెన్షనర్ల బారులు 

శివారు మున్సిపాలిటీల్లో ఉదయం 6 గంటల తర్వాత వస్తే అందని పరిస్థితి

నెలలో 2–3 సార్లు తిరగాల్సి వస్తోందని వృద్ధులు, వితంతువుల ఆవేదన

సిటీలో మాదిరిగా బ్యాంక్ ​అకౌంట్​లో వేయాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు నెలనెలా పోస్టాఫీసుల ముందు బారులు తీరాల్సి వస్తోంది. సిటీ శివారులోని మున్సిపాలిటీల్లో తెల్లవారుజాము 5 గంటల లోపు రాకుంటే పైసలు అందని పరిస్థితి నెలకొంది. ఒక నెలలో పెన్షన్​ పైసల కోసం రెండు, మూడు సార్లు పోస్టాఫీసు చుట్టూ తిరగాల్సి వస్తోంది. 12 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు, కాలనీల నుంచి వచ్చి, పోవాలంటే పెన్షన్​లోని సగం ఆటో, క్యాబుల కిరాయికే పోతోంది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2,016 వస్తున్నాయి.

తెల్లవారక ముందే వచ్చి క్యూలో నిలబడలేనివారు ఇంటి నుంచే కుర్చీలు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్​ సిటీలో ఇస్తున్న మాదిరిగా తమకు కూడా బ్యాంకు అకౌంట్లలో పెన్షన్ ​పైసలు వేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బ్యాంక్ అకౌంట్లలో వేయాలని అప్లికేషన్లు పెట్టుకున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వచ్చే నెల నుంచి అయినా బ్యాంకుల ద్వారా అందజేయాలని కోరుతున్నారు. 

లక్షల మందికి తిప్పలు 

శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆసరా పెన్షన్ పైసలు అందరికీ బ్యాంక్ అకౌంట్లలో వేయడం లేదు. దివ్యాంగులతోపాటు కొంతమంది వృద్ధులు, వితంతువులకు మాత్రమే బ్యాంకు అకౌంట్లలో పడుతున్నాయి. నేటికీ చాలామంది పెన్షన్​ కోసం పోస్టాఫీసులు, మున్సిపల్ ఆఫీసుల పడిగాపు కాయాల్సి వస్తోంది. ఎండ, వాన తేడా లేకుండా తెల్లవారుజామునే వస్తేనే చేతికొస్తున్నాయి. తీసుకోవడం లేట్ ​చేస్తే మళ్లీ ఎప్పుడిస్తారోనని వందలాది మంది బారులు తీరుతున్నారు. వరుసగా 3 నెలలు తీసుకోకపోతే  మొత్తానికే బంద్​అవుతాయని చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రూరల్ ఏరియాల్లోని లబ్ధిదారులకు బ్యాంక్​అకౌంట్లు ఉండవని, పోస్టాఫీసుల ద్వారా ప్రభుత్వం పెన్షన్​ అందిస్తోంది. అదే విధానాన్ని అర్బన్ ప్రాంతాల్లోనూ అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లోని కొంతమందికి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ మిగిలిన వారికి పాత పద్ధతిలోనే అందిస్తోంది.

కొన్ని పోస్టాఫీసుల వద్ద పెన్షనర్లు నిలబడేందుకు చోటులేక మున్సిపల్ ఆఫీసుల వద్ద అందజేస్తున్నారు. బండ్లగూడ జాగీర్​లోని డాన్ బోస్కో పోస్టాఫీసు వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూ ఉంటోంది. బోడుప్పల్, మేడిపల్లి మున్సిపల్ ఆఫీసుల వద్ద తెల్లవారుజామున నుంచే క్యూ కడుతున్నారు.  నిజాంపేట, మేడ్చల్, జవహర్ నగర్ అన్నిచోట్ల ఇదే పరిస్థితి ఉంటోంది.

బ్యాంకులో వేస్తే ఇబ్బంది ఉండదు

పెన్షన్​ పైసలు తీసుకునేందుకు మా వదినకు తోడుగా వచ్చా. ఇక్కడి దాకా ఎలా రావాలో ఆమెకు తెలియదు. అందుకే నేను తీసుకుని వచ్చా. కానీ మేం వచ్చేసరికే వంద మందికిపైగా ఉన్నారు. ప్రతి నెలా ఇలా తోడుగా రావాల్సి వస్తోంది. అదే బ్యాంకు అకౌంట్​లో వేస్తే ఇబ్బంది ఉండదు.  

– సరిత, అత్తాపూర్


80 ఏండ్ల వయస్సులో ఎట్ల తిరగాలి

నెల నెలా తిరగలేక రెండు మూడు నెలలకోసారి బండ్లగూడ జాగీర్​కు వచ్చి పెన్షన్​ పైసలు తీసుకుంటున్నా. ఉదయం 6 గంటల లోపు వస్తేనే పైసలు అందుతున్నాయి. ఆలస్యమైతే 300 మందికిపైగా క్యూలో ఉంటున్నారు. ఒక్కోసారి లైన్​లో నిలబడినా.. డబ్బులు అందుతాయో లేదో తెలియదు. 80 ఏండ్ల వయస్సులో పోస్టాఫీసు చుట్టూ తిరగాలంటే చాలా కష్టంగా ఉంటోంది. బ్యాంక్ అకౌంట్​లో వేస్తే బాగుంటుంది.

–  చంచల బాయి, రాంబాగ్

మూడు నెలలకోసారి తీస్కుంటున్న

పెన్షన్​ కోసం శివరాంపల్లి నుంచి బండ్లగూడ జాగీర్ రావాల్సి వస్తోంది. 13 కిలోమీటర్లు వచ్చి, పోయేందుకు ప్రతిసారి ఆటో కిరాయి రూ.800 అవుతోంది. అంత భరించలేక మూడు నెలలకు ఒకసారి పెన్షన్ ​తీసుకుంటున్నా. నెలలో రెండు సార్లు తిరిగితే తప్ప అందట్లేదు. మంగళవారం పొద్దున్నే వచ్చి క్యూలో కూర్చున్నాను. మూడు గంటల తర్వాత ఈరోజు సెలవు అన్నారు. చేసేదేం లేక తిరిగి వెళ్తున్నాను. 

– అంజయ్య, శివరాంపల్లి