భార్యకు పెరాలసిస్.. చికిత్స కోసం 300 కి.మీ. రిక్షా తొక్కిన వృద్ధుడు..

భార్యకు పెరాలసిస్..  చికిత్స కోసం 300 కి.మీ. రిక్షా తొక్కిన వృద్ధుడు..
  • ఒడిశాలోని సంబల్​పూర్లో ఘటన 
  • కటక్ తీసుకెళ్లాలన్న డాక్టర్లు
  • అంబులెన్స్​కు డబ్బుల్లేక రిక్షా తొక్కిన భర్త

భువనేశ్వర్: ఒడిశాలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. పెరాలసిస్​తో బాధపడుతున్న భార్యకు చికిత్సను అందించడానికి ఓ వృద్ధుడు ఏకంగా 300 కి.మీ. రిక్షా తొక్కాడు. సంబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్ లోని మోడిపడలో నివసిస్తున్న బాబు లోహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(75) రిక్షా కార్మికుడు. గతేడాది నవంబరు లో ఆయన భార్య జ్యోతికి (70) పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. దీంతో లోహర్ స్థానిక డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం ఆమెను కటక్ లోని ప్రభుత్వ ఎస్ సీబీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. కానీ, ఆమెను అంబులెన్స్, ఇతర వెహికల్స్ ద్వారా కటక్ కు తీసుకెళ్లేందుకు లోహర్ వద్ద డబ్బుల్లేవు. ఆమెకు ఎలాగైన కటక్ తీసుకెళ్లి చికిత్సను  అందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రిక్షాపై పాత కుషన్లు అమర్చి, భార్యను కూర్చోబెట్టుకుని ప్రయాణం ప్రారంభించాడు. 

రోజుకు 30 కిలోమీటర్లు.. 

పగటిపూట సైకిల్ తొక్కుతూ.. రాత్రి సమయంలో దుకాణాల వద్ద ఆశ్రయం పొందూతూ రోజుకు 30 కి.మీ. రిక్షా తొక్కుతూ లోహర్ ప్రయాణం సాగించాడు.  చివరకు 9 రోజులకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆమెకు దవాఖానలో డాక్టర్లు రెండునెలల పాటు ఇంటెన్సివ్ చికిత్స అందించారు. అనంతరం జనవరి 19న అదే రిక్షాలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.

 మార్గమధ్యంలో ఓ వాహనం రిక్షాను ఢీకొట్టింది. ఆ సమయంలో జ్యోతికి స్వల్ప గాయమైంది. దీంతో ఆమెకు స్థానిక హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లి చికిత్సను అందించారు. ప్రమాదం తర్వాత ఆమెకు చికిత్సను అందించిన డాక్టర్  వికాస్ ఆ దంపతులు గమ్య స్థానానికి చేరుకోవడానికి ఆర్థిక సహాయం అందించారు. టాంగి పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ బికాష్ సేథి ఆ జంటకు వాహనం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాడు. కానీ, లోహర్ మాత్రం అందుకు నిరాకరించాడు. అనంతరం వారు తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టారు.