సాగర్‌లో జోరందుకున్న ప్రచారం.. ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్న పార్టీలు

సాగర్‌లో జోరందుకున్న ప్రచారం.. ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్న పార్టీలు
  • సాగర్​లో ప్రచార జోరు
  • నామినేషన్లు ముగియడంతో ఇక దూకుడుగా మలివిడత ప్రచారం
  • టీఆర్​ఎస్​ ప్రచార బాధ్యతలు మంత్రి జగదీశ్​రెడ్డికి.. సమన్వయకర్తగా పల్లా
  • వ్యూహాత్మక పోరు సాగిస్తున్న కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి
  • పక్కా ప్లాన్​తో ప్రచారానికి రెడీ అవుతున్న బీజేపీ

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్​ ఉప ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. మంగళవారం నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ పూర్తిగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఒక విడత ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మలివిడత ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు ప్లాన్​చేస్తున్నాయి. దీనిలో భాగంగా నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన లీడర్లను ఎన్నికల ప్రచారానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా యాదవ, ఎస్టీ కులాల ఓట్లను రాబట్టేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మంగళవారం టీఆర్ఎస్​అభ్యర్థి నోముల భగత్​యాదవ్​నామినేషన్​దాఖలుకు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ రావడమేగాక, నియోజకవర్గంలోని యాదవ సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. అదేవిధంగా భగత్​ నామినేషన్​ కార్యక్రమం ముగిశాక ఎన్నికల ప్రచారం మాడ్గులపల్లి మండలం అబంగాపురం గ్రామం నుంచి ప్రారంభించారు. ఆయన తండ్రి దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య కూడా ఇదే గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించారు. దీంతో సెంటిమెంట్​గా కలిసొస్తుందన్న ఉద్దేశంతో భగత్​కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి తెర లేపారు. ఎన్నికల ప్రచార బాధ్యతలు జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డికి అప్పగించారు. ఎన్నికల సమన్వయకర్తగా పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి మరోసారి బాధ్యతలు అప్పగించారు.  
 

ప్లాన్​ మార్చిన టీఆర్ఎస్
టీఆర్ఎస్​ మలివిడత ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చింది. తొలి విడతలో నాన్​లోకల్​ లీడర్లకు బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానం ప్రస్తుతం జిల్లా లీడర్లను రంగంలోకి దింపింది. పొరుగు జిల్లాల ఎమ్మెల్యేలకు తోడుగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను మండల ఇన్​చార్జిలుగా నియమించింది. భువనగిరి, హుజూర్​నగర్​ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్​రెడ్డి, శానంపూడి సైదిరెడ్డితో పాటు, జడ్పీ చైర్మన్​ బండా నరేందర్​ రెడ్డిలకు మాడ్గులపల్లి, తిరుమలగిరి సాగర్, గుర్రంపోడు మండలాల బాధ్యతలు అప్పగిం చారు. ఎన్నికల సమన్వయకర్తగా గతంలో హుజూర్​నగర్​ బైపోల్, నల్గొండ మున్సిపల్​ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరె డ్డి ఈ ఎన్నికల్లోనూ అదే కీ రోల్​ పోషించనున్నారు. మంత్రి జగదీశ్​రెడ్డి పూర్తిగా అభ్యర్థి వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే మండలానికో మంత్రిని కూడా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ పార్టీ జరిపిన సర్వేల్లో ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అప్పర్​హ్యాండ్​ సాధించామని భావించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో పోటీ అనేది టీఆర్ఎస్​, కాంగ్రెస్​ మధ్యే ఉంటుందని అధిష్ఠానం క్లారిటీతో ఉందని చెప్తున్నారు. దీంతో గ్రామాలవారీగా ఇన్​చార్జిలు, మండల ఇన్​చార్జిలతోనే ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. తాజా పరిస్థితుల్లో అనివార్యంగా ఏమైన మార్పులు జరిగితే అప్పుడు ఎన్నికల ప్రచారానికి మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్​ వస్తారని పార్టీ లీడర్లు చెప్తున్నారు. మైనార్టీలతో బుధవారం మహమూద్​అలీ సమావేశం నిర్వహించనున్నారు.

జానారెడ్డి వ్యూహాత్మక పోరు
కాంగ్రెస్​ అభ్యర్థి, సీనియర్​ నాయకుడు జానారెడ్డి వ్యూహాత్మక పోరు సాగిస్తున్నారు. ప్రచారంలో అధికార పార్టీ కంటే ముందుగానే గ్రామాలను జల్లెడ పట్టిన ఆయన మలి విడత ప్రచారాన్ని చాలా వ్యూహాత్మకంగా నడిపించాలని ప్లాన్​ చేస్తున్నారు. జనగర్జన సభతో నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకున్న ఆయన మలివిడత ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకే హైకమాండ్​ పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల ప్రచారానికి పార్టీ తరపున స్టార్​ క్యాంపెయినర్లు రానున్నారు. ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్​ రెడ్డి నియోజకవర్గంలోనే మకాం పెడ్తారని చెప్తున్నారు. పీసీసీ చీఫ్​ఉత్తమ్​ఆధ్వర్యంలోనే ఎన్నికల స్టార్​ క్యాంపెయినర్ల వివరాలు త్వరలో అధికారంగా ప్రకటిస్తారని చెప్తున్నారు. 

కమలనాథుల కసరత్తు
టీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీలకు దీటుగా బీజేపీ ఎన్నికల ప్రచారానికి పదును పెడ్తోంది. బైపోల్​లో ఎస్టీ అభ్యర్థిని పెట్టి బీజేపీ పెద్ద ప్రయోగమే చేసింది. కాబట్టి, ఆ మేరకు ఎన్నికల్లో తమ సత్తా చూపించేందుకు పక్కా ప్రచారానికి ప్లాన్​ చేస్తోంది. ఎన్నికల ఇన్​చార్జి సంకినేని వెంకటేశ్వరరావు, ఎన్నికల మేనేజ్​మెంట్​కన్వీనర్​ గంగడి మనోహర్​రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి ప్లాన్​ చేస్తున్నారు. పార్టీ స్టేట్ ​ప్రెసిడెంట్ బండి సంజయ్​ ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు మానిటర్​ చేస్తారని చెప్తున్నారు. హోం మంత్రి కిషన్​రెడ్డి సైతం ఏప్రిల్​6 తర్వాత నుంచి సాగర్ పై దృష్టి సారిస్తారని తెలిసింది. బుధవారం నుంచి అ న్ని గ్రామాలు, మండలాల్లో పార్టీ ఆఫీసులు ఓపెన్​ చేయనున్నారు. ఎన్ని కల మీటింగ్​లు నిర్వహించేందుకు ఫంక్షన్​ హాల్స్​ మాట్లాడుతున్నారు. ఎ న్నికల ప్రచార రథాలను తయారు చేయడంతో పాటు, బయటి నుంచి పార్టీ కార్యకర్తలను అన్ని మండలాల్లో దింపేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఎన్నికల స్టార్​ క్యాంపెయినర్లుగా సీనియర్​ నాయకుసెక్యులరిస్టుల గొంతులు వివేక్​ వెంకటస్వామి,  డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతి, ఎంపీ ధర్మపురి అర్వింద్, బాబు మోహన్​తో పాటు పలువురు ముఖ్య నేతలు రానున్నారు.