హాట్‌స్పాట్లుగా ఎలక్షన్‌ సిటీలు

హాట్‌స్పాట్లుగా ఎలక్షన్‌ సిటీలు
  • బైపోల్‌తో సాగర్‌లో ముసురుకున్న వైరస్‌
  • నియోజకవర్గంలో 5 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు
  • వరంగల్‌, ఖమ్మం, సిద్దిపేటలో ఇప్పటికే వైరస్‌ వేవ్
  • ఎన్నికల ప్రచారంతో మరింత ముప్పు

హైదరాబాద్‌, వెలుగు: మున్సిపల్‌ ఎన్నికలు జరిగే సిటీలు, టౌన్లు కరోనా హాట్‌ స్పాట్లుగా మారుతున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట మున్సిపాలిటీలో ఇప్పటికే భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నాగార్జునసాగర్‌ బై పోల్‌ ప్రచారంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ సహా వందల సంఖ్యలో లీడర్లు కరోనా బారిన పడ్డారు. నియోజకవర్గం మొత్తమ్మీద 5 వేల మందికి వైరస్ సోకింది. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, పట్టణాల్లోనూ ఎన్నికల ప్రచారం, మీటింగ్‌లు, దావత్‌లతో వైరస్‌ మరింత స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజుకు ఐదారు వేలకు పైగా కేసులను ప్రభుత్వం అధికారికంగానే ప్రకటిస్తోంది. ఈ సంఖ్యకు కనీసం ఐదురెట్లు అదనంగా కేసులు వస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ సర్కారు మాత్రం మొండిగా మున్సిపల్‌‌ ఎన్నికలు పెట్టితీరుతామని తేల్చిచెప్పింది. ఈ ఎన్నికలతో ఆయా పట్టణాల్లో వైరస్‌‌ తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత వరంగల్‌‌, ఖమ్మం, సిద్దిపేటల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పోలింగ్‌‌కు ఇంకో వారం రోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు, పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం చేస్తే వాళ్ల ద్వారా కరోనా ఆయా నగరాలు, పట్టణాల్లో స్ప్రెడ్ అయ్యే ప్రమాదముంది. సెకండ్‌‌ వేవ్‌‌లో కరోనా సోకిన 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండట్లేదు.

సాగర్ ఎన్నికలోనూ ఇంతే..
నాగార్జునసాగర్‌‌ ఉప ఎన్నికల నాటికి రాష్ట్రంలో వైరస్‌‌ వ్యాప్తి కాస్త తక్కువగానే ఉంది. ప్రచారానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నేతలు వెళ్లడంతో అక్కడ వైరస్‌‌ వ్యాప్తి వేగంగా జరిగింది. హాలియా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌‌కు వైరస్‌‌ సోకింది. ఎన్నికల్లో గెలిచేందుకు నిర్వహించిన ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు, పోల్‌‌ మేనేజ్మెంట్‌‌లో భాగంగా ఏర్పాటు చేసిన దావత్‌‌లు వైరస్‌‌ వ్యాప్తిని తీవ్రం చేశాయి. పోలింగ్‌‌ తర్వాత టెస్టులు నిర్వహించగా నియోజకవర్గంలో  5 వేల కేసులు నమోదయ్యాయి. వైఎస్‌‌ షర్మిల ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ కూడా వైరస్‌‌ హాట్‌‌ స్పాట్‌‌గా మారింది. ఈ రెండు అనుభవాలతో మున్సిపల్‌‌ ఎన్నికలు జరుగుతున్న టౌన్‌‌ల ప్రజలు హైరానా చెందుతున్నారు. కొందరు తమ ఇండ్లకు రావొద్దని ఏకంగా బోర్డులే ఏర్పాటు చేశారు.

ఎంజీఎంకు రోజూ వందల మంది
గ్రేటర్‌‌ వరంగల్‌‌లో ఎంజీఎం హాస్పిటల్‌‌లో రోజూ వందల సంఖ్యలో కరోనా పేషెంట్లు అడ్మిట్‌‌ అవుతున్నారు. మెడికల్‌‌ సిబ్బంది టెస్టులు, వ్యాక్సినేషన్‌‌, వైద్య సేవల్లోనే తలమునకలై ఉండగా, మున్సిపల్‌‌ సిబ్బంది ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉన్నారు. దీంతో నగరంలో శానిటేషన్‌‌ ప్రక్రియను సరిగా పట్టించుకోవడం లేదు. అన్ని మున్సిపాలిటీల్లో సోడియం హైపోక్లోరైడ్‌‌ పిచికారీ చేయాలనే ఆదేశాలు అమలు కావట్లేదు.

మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి
సిద్దిపేటలో వారంలో  వెయ్యి మంది కరోనా బారిన పడ్డారు. ముగ్గురు మృతిచెందారు. ఎన్నికల్లో పార్టీ క్యాండిడేట్లు ఖరారు కావడంతో దావత్‌‌లు షురూ చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీలో వారంలోనే 670 కేసులు నమోదయ్యాయి. అచ్చంపేట మున్సిపాలిటీలో రోజుకు 50 కేసులు వస్తున్నాయి. నకిరేకల్‌‌, కొత్తూరు మున్సిపాలిటీల్లోనూ వైరస్‌‌ ప్రభావం ఎక్కువగానే ఉంది.

ఖమ్మంలో 4 వేలకుపైగా కేసులు
కార్పొరేషన్‌‌ ఎన్నికలు జరుగుతున్న ఖమ్మంలో వారం రోజుల్లోనే 4,373 కేసులు వచ్చాయి. షర్మిల ప్రచార సభకు ముందు డబుల్‌‌ డిజిట్‌‌లోనే ఉన్న కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎన్నికల ప్రచారంతో రోజూ 500లకు పైగా కేసులు వస్తున్నాయి. ఈనెల 19న సుమారు వెయ్యి మందికి పాజిటివ్‌‌గా నిర్దారణ అయ్యింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖమ్మంలో కేసులు భారీగా పెరిగే ప్రమాదముంది.