
ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రం భీమ్ 85 వర్థంతిపై స్థానిక ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. ఏటా ఐటీడీఏ ఆధ్వర్యంలో కెరమెరి మండలం జోడేఘట్ లో నిర్వహించే దర్బార్ ఈసారి ఉంటుందా ..? లేదా..? అనే సస్పెన్స్ నెలకొంది. ఒక వేళ దర్బార్ నిర్వహిస్తే అధికారులు హాజరైయ్యే పరిస్థితి లేదు. మంగళవారం కుమ్రం భీమ్ వర్థంతి సందర్భంగా అతని వారసులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా ఆదివాసీలు తరలివస్తుంటారు.
ఐటీడీఏ అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి , ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఏఎస్పీ చిత్తరంజన్ పోలీసు అధికారులు, సిబ్బందికి బందోబస్తు బ్రీఫింగ్ నిర్వహించారు. 462 మంది పోలీస్ అధికారులు ,సిబ్బంది డ్యూటీ లోబందోబస్తు లో పాల్గొననున్నారు. ఏఎస్పీ, డీఎస్పీ లు ,8 మంది సిఐ ,25 మంది ఎస్ఐ ,ఆర్ఎస్ఐ ,51 మంది ఏఎస్ఐ,హెడ్ కానిస్టేబుల్ ,136 మంది కానిస్టేబుల్, 56 మంది మహిళ కానిస్టేబుల్, 79 మంది హోంగార్డులు బందోబస్తు లో పాల్గొననున్నారు.
రాష్ట్రస్థాయి గుర్తింపు
ఆదివాసీల ఆరాధ్య దైవమైన కుమ్రంభీమ్ వర్థంతికి ప్రభుత్వం రాష్ట్రస్థాయి గుర్తింపు ఇచ్చిందని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. ఈ నెల 7వ ఆశ్వయుజ పౌర్ణమి రోజున అధికారికంగా కెరమెరి మండలం జోడేఘాట్ లో కుమ్రంభీమ్ వర్థంతిని నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.