12 మంది ఎమ్మెల్యేలపై ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్లు

12 మంది ఎమ్మెల్యేలపై ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్లు
  •      ఆరుగురికి నోటీసులు  జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 12 మంది ఎమ్మెల్యేల ఎన్నికను సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ హైకోర్టులో ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచారని, అక్రమాలకు పాల్పడ్డారని, నామినేషన్‌‌‌‌‌‌‌‌ పత్రాల్లో తమ ఆస్తులతోపాటు కుటుంబ సభ్యుల ఆస్తులను ఇతర వివరాలను వెల్లడించలేదని పేర్కొంటూ ఓడిన అభ్యర్థులు మొత్తం 13 పిటిషన్లు దాఖలు చేశారు. 7 పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చింది. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తరఫున గెలిచిన మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌–యెన్నం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర–గవిగోళ్ల మధుసూదన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కొత్తగూడెం–కూనంనేని సాంబశివరావు (సీపీఐ), బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తరఫున గెలిచిన ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌– కోవా లక్ష్మి, జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌–మాగంటి గోపీనాథ్, ఇటీవలే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరిన ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌లకు నోటీసులిస్తూ.. విచారణను వాయిదా వేస్తూ  కోర్టు ఉత్తర్వులిచ్చింది. గద్యాల– కృష్ణమోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి (బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌), అలంపూర్‌‌‌‌‌‌‌‌–విజయుడు (బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) ఎన్నికను సవాల్‌‌‌‌‌‌‌‌ చేసిన వేర్వేరు కేసుల్లో హైకోర్టు గురువారమే నోటీసులు ఇచ్చింది.

 కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి–మాధవరం కృష్ణారావు (బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) ఎన్నికను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి రమేశ్, వరంగల్‌‌‌‌‌‌‌‌ పశ్చిమ–నాయిని రాజేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి (కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌) ఎన్నికను ఓడిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి దాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌ భాస్కర్, ఖానాపూర్‌‌‌‌‌‌‌‌–ఎ. బోజు ఎన్నికను జాన్సన్‌‌‌‌‌‌‌‌ నాయక్, ఎమ్మెల్యే రాంబాస్‌‌‌‌‌‌‌‌ మాలోత్‌‌‌‌‌‌‌‌ ఎన్నికను మదన్‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌ బానోత్‌‌‌‌‌‌‌‌ (బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌) సవాల్‌‌‌‌‌‌‌‌ చేసిన పిటిషన్లను హైకోర్టు ఇంకా విచారణ చేయాల్సి ఉంది.