ఏకే గోయల్ ఇంట్లో సోదాలు

ఏకే గోయల్ ఇంట్లో సోదాలు
  • మాజీ ఐఏఎస్ నివాసంలో రూ. కోట్ల డంప్ దొరికినట్లుగా ప్రచారం
  • కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జీ
  • గోయల్​కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలు 
  • అర్ధరాత్రి వరకూ కొనసాగిన టాస్క్​ఫోర్స్​, ఎలక్షన్​ స్క్వాడ్​ తనిఖీలు

హైదరాబాద్, వెలుగు: మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 22లోని ఆయన నివాసంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కోట్లాది రూపాయల క్యాష్ డంప్ ఉందన్న సమాచారంతో అర్ధరాత్రి వరకూ సోదాలు చేశారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఇతరులను ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. 

గేట్ వద్ద సీఏపీఎఫ్ బలగాలను మోహరించారు. సోదాల్లో భారీ ఎత్తున క్యాష్​ లభించడంతో ఎలక్షన్ స్క్వాడ్ అధికారులు ఐటీకీ సమాచారం అందించారు. దీంతో ఐటీ అధికారులు గోయల్ ఇంటికి వచ్చారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని గోయల్ ప్రశ్నించడంతో ఐటీ అధికారులు బయటకు తిరిగొచ్చారు. అయితే, గోయల్ ఇంట్లో రూ. కోట్లు ఉన్న భారీ డంప్ దొరికిందని ప్రచారం జరుగడంతో కాంగ్రెస్ నేతలు మల్లు రవి సహా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, స్థానిక కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గోయల్ కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం వచ్చి నినాదాలు చేశారు. 

పోలీసులు లాఠీ చార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు డబ్బుతో ఓటర్లను కొనే ప్రయత్నాలు చేస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. ఈ సోదాల్లో రూ. 20 లక్షల వరకూ క్యాష్ పట్టుబడిందన్న ప్రచారం జరిగింది. అయితే, ఎంత డబ్బు పట్టుబడిందన్న వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. కాగా, ఏకే గోయల్ 2010లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన్ను కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ప్రస్తుతం ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సలహాలు ఇచ్చే బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు తెలిసింది.