ఓటర్ల నాడి తెలుసుకునేందుకు నేతల పాట్లు

ఓటర్ల నాడి తెలుసుకునేందుకు నేతల పాట్లు
  • గ్రామాల్లో సర్వే బృందాల హల్ చల్
  •  ఒక పక్క ఫోన్లలో మరో పక్క సోషల్ మీడియాలో ..

వనపర్తి, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్య నేతలు గ్రామాల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు రోజుకు రూ.500  చెల్లించి ఉదయం నుంచి సాయంత్రం దాకా గ్రామాల్లో సర్వే చేయించేందుకు ఇంటింటికి పంపిస్తున్నారు. మళ్లీ సీఎం ఎవరు కావాలి, ఏ పార్టీ కి ఓటు వేస్తారు. మీ సామాజిక వర్గం ఏంటీ.. ప్రభుత్వ పథకాలు అందాయా...ప్రస్తుతం పనిచేస్తున్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటూ రకరకాల ప్రశ్నలు వేసి ఓటరు నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 30 ప్రశ్నలతో వనపర్తి నియోజక వర్గంలోని కొన్ని గ్రామాల్లో సర్వే జరుగుతోంది. వివిధ పార్టీల నేతలు వెనక ఉండి ఎజేన్సీల పేరుతో తతంగం నడిపిస్తున్నారు. యువకులకు సరైన సమాచారం ఇస్తారో ఇవ్వరోనని సర్వే కోసం యువతులను ఎంచుకుంటున్నారు. ఆయా గ్రామాల్లోని ఓటర్ల సంఖ్య, కులాల వారీగా  మెజార్టీ కులం ఓట్లు, మహిళా సంఘాలు, మైనార్టీల వివరాలు తీసుకుని అందుకు తగ్గట్టుగా శాంపిల్స్ సేకరిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటరు ఎటువైపు ఉన్నారన్న దానిపై ప్రత్యేకంగా సర్వేలో తెలుసుకునేందుకు ఆయా పార్టీల నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.  

ప్రధాన ప్రతిపక్షం ఏదని భావిస్తున్నారు.

త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ పార్టీకి ఓటు వేస్తారన్న ప్రశ్నవేసి ఆన్సర్​ రాబడుతున్నట్లు తెలిసింది. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు ఆప్షన్లుగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఇస్తున్నారు. కొంతమంది బీఎస్పీకి ఓట్లు వేస్తామని సర్వే బృందాలకు చెబుతున్నట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీకు తెలుసా ఆయనకు సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తూనే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లో ఎవరు బెటర్ అంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పడే ఓటు ఎటు వైపు పోతుందో తెలుసుకునేందుకు వీరు నానా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.  

ఫోన్లలోనూ ప్రశ్నలే...

జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో అత్యధికంగా ఫోన్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి చెందిన వాయిస్ మెసేజ్ లు హల్ చల్ చేస్తున్నాయి. మరో సారి తనకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ఓటర్లను కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే దంపతులైన కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతమ్మ  తిరిగి రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ లోకి వస్తే బాగుంటుందంటూ ఫోన్లలో సర్వే చేపట్టారు. రోజుకు ఒకరు ఇంటికి రావడం, ఫోన్లలో వాయిస్ మెసెజ్ లతో సతాయించడం పట్ల జనం వేసారిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 6 నెలల గడువు ఉన్నా తమ పరిస్థితి ఏందో అని నేతలు ఇప్పటినుంచే అంచనా వేసుకుంటున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలకు రావాలని మండల స్థాయి లీడర్లే గ్రామాల్లో ఇల్లిల్లు తిరుగుతూ ఆహ్వనం పలుకుతున్నారు. సమావేశాలకు వస్తే మంచి భోజనం రాత్రి మందు దావత్ ఉందంటూ ఆశ చూపుతున్నారు. అసంతృప్తులు ఎవరో తెలుసుకునేందుకు అధికార పార్టీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ లు సైతం వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందన్న దానిపై సర్వేలు మొదలు పెట్టాయి. ఆయా పార్టీలు పలువురు నేతలు ఉన్నా టికెట్ ఎవరికి ఇస్తామన్న విషయం ముందు చెప్పడం లేదు. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవేం సర్వేలు బాబోయ్ అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే ఇంత హడావిడి చేస్తున్నారని ఎన్నికల సమయంలో ఇంకా ఎంత గోల చేస్తారోననివాపోతున్నారు. 

యువత మదిలో ఏముంది...

కొత్త ఓటరు లిస్ట్​ ప్రకారం.. యువత ఓట్లు 50 శాతం దాకా ఉండడంతో ఈ సారి గెలుపోటములను నిర్ధారించేది 40 ఏళ్లలోపు వారే. ఈ విషయం తెలుసుకొని యువత నాడిని పట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని ఈ పరిస్థితుల్లో మరో సారి బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా అని సర్వే బృందాలు ప్రశ్నిస్తున్నాయి.  కాంగ్రెస్, బీజేపీ ల్లో ఏదీ బెటర్ ఎటు వైపు మొగ్గు చూపుతారని ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత బీజేపీ వైపు మొగ్గేందుకు కారణాలు ఏంటో తెలుసుకుంటున్నారు. మరో పక్క పెన్షనర్లు,  ప్రభుత్వ ఉద్యోగులు,  ఎస్సీ, ఎస్టీలు , మైనార్టీల పై ప్రత్యేకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.