అధికారులకు ఎన్నికల టెన్షన్

అధికారులకు ఎన్నికల టెన్షన్
  • తాము చెప్పినోళ్లకే లబ్ధి చేకూర్చాలని ఎమ్మెల్యేల పట్టు
  • ఫైనల్​ ఓటరు జాబితా కోసం ఎలక్షన్​ కమిషన్​ గడువు 
  • మూడు వైపులా ఒత్తిళ్లతో ఆగమవుతున్న ఆఫీసర్లు

నల్గొండ, వెలుగు : ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జిల్లాల్లో అధికారులపై పనిభారం పెరిగిపోతోంది. ఎలక్షన్ కమిషన్​ ఆదేశాలతో   పోలింగ్​ కేంద్రాల గుర్తింపు, ఓటరు జాబితాల సవరణ, ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్​ లాంటి కార్యక్రమాలతో అధికారులు ఇప్పటికే  బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతోంది. ఎన్నికలకు మూడు నెలల టైమ్​ మాత్రమే ఉండడంతో  పాత, కొత్త స్కీమ్​లను  త్వరగా కంప్లీట్​ చేయాలని తొందరపెడ్తోంది. 

ఓ వైపు ఫండ్స్​ లేకపోవడం, తాము చెప్పిన పనులే చేపట్టాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తుండడం ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. ఇది చాలదన్నట్లు సంక్షేమ పథకాల లబ్ధిదారుల లిస్టులను ఎమ్మెల్యేలు, అధికారపార్టీ లీడర్లే తయారు చేసుకొని వచ్చి సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేయడం చికాకు పెట్టిస్తోంది. ఇది ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందోననే ఆందోళన చాలా మంది ఆఫీసర్లలో కనిపిస్తోంది.

పంచాయతీ రాజ్​లో స్కీమ్​ల టెన్షన్​

ఎన్నికల షెడ్యూల్​వచ్చేలోపే  ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన స్కీమ్​లను లబ్ధిదారులకు చేర్చాలని ప్రభుత్వం టార్గెట్​ పెట్టింది.  దీంతో ఆఫీసర్లు ఉరుకులుపరుగులు పెడ్తున్నారు. ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలంతా కొత్త ఆసరా పింఛన్లు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ తదితర స్కీమ్​ల అమలులో తలమునకలయ్యారు. ఆన్​లైన్​లో పెండింగ్​లో ఉన్న  పింఛన్​ దరఖాస్తులను పరిశీలిస్తూ, ఫీల్డ్​ ఎంక్వైరీ చేస్తూ అర్హుల లిస్టులను ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేస్తున్నారు. ఎన్నికల టైంలో కొత్త పింఛన్లు సాంక్షన్​ చేస్తారని భావిస్తున్నారు. ఇక బీసీల్లో రూ.లక్ష సాయం కోసం వచ్చిన అప్లికేషన్లపై  ఎంపీడీఓలు ఫీల్డ్​ లెవల్​లో ఎంక్వైరీ చేస్తున్నారు. అర్హుల లిస్ట్​ను  ఆర్డీఓల ద్వారా కలెక్టర్లకు అందిస్తున్నారు. 

ఈ లిస్టుల్లో ఎమ్మెల్యేలు, రూలింగ్​పార్టీ లీడర్లు జోక్యం చేసుకుంటున్నారు. తాము సిఫార్స్​ చేసిన వాళ్లకే ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. కొన్నిచోట్ల వారే లిస్టులు తయారు చేసి సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తుండడంతో ఆఫీసర్లు తల పట్టుకుంటున్నారు. నిజానికి గతంలో లబ్ధిదారులను గ్రామసభల్లో ఎంపిక చేసేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలే ఎంపిక చేస్తుండడంపట్ల విమర్శలు వస్తున్నాయి.  తమ వాటా చెల్లించినా ప్రభుత్వం గొర్ల కొనుగోలుకు ఫండ్స్​ ఇస్తుందన్న నమ్మకం లేదని అంటున్న లబ్ధిదారులు గొర్రెల పంపిణీ స్కీమ్​కు వాటాధనం చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు.  కానీ ప్రభుత్వం మాత్రం  ఎట్టి పరిస్థితుల్లో వాటాధనం కట్టేలా చూడాలని ఒత్తిడి తెస్తుండడంపై  ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు పరేషాన్​ అవుతున్నారు.

ALSO READ :22న కల్లుగీత కార్మికుల ధర్నా

ఎన్నికల డ్యూటీలో రెవెన్యూఆఫీసర్లు బిజీ 

ఎన్నికల నిర్వహణ పనుల్లో  రెవెన్యూ అధికారులు బిజీ అయ్యారు. అక్టోబర్​4న ఫైనల్​ ఓటరు జాబితా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్​ ఆదేశించింది.  దీంతో ఓటర్ల మార్పుచేర్పులపై దృష్టి పెట్టారు. దీనికి తోడు తహసీల్దార్లకు ప్రభుత్వం  58,59  జీవో అమలు, గృహలక్ష్మి పనులు కూడా అప్పగించడంతో  అసలే  వీఆర్​ఓ, వీఆర్ఏ లు లేక అవస్థలు  పడుతున్న  తహసీల్దార్ల పై పనిభారం పెరిగిపోతోంది. దీంతో  చాలా జిల్లాల్లో గృహలక్ష్మి వెరిఫికేషన్​ బాధ్యతలను కలెక్టర్లు  ఎంపీడీఓలకు బదలాయించారు. గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీలతో విచారణ  చేయిస్తున్నారు.   జీవో 59  కింద   భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి డబ్బులు వసూలు కాకపోవడంతో చీఫ్​సెక్రటరీ నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో తహసీల్దార్లు, ఆర్డీఓలు ఫీల్డ్​కు వెళ్లి ఎంక్వైరీ చేయాల్సి వస్తోంది. నల్గొండ, మెదక్ ​జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలన్నీ 59 జీవో అమలులో వెనకబడ్డాయి.   

ఎమ్మెల్యేల నుంచి ఒత్తిళ్లు

సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇవ్వడం అధికారులకు తలనొప్పిగా మారింది. పార్టీ కార్యకర్తలకే స్కీంలు ఇవ్వాలంటూ  అధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు.  59 జీవో లబ్ధిదారులు  గృహలక్ష్మి స్కీ మ్ ​కింద లబ్ధి పొందేందుకు అర్హులు కాదు.  ఇతర స్కీముల్లో బెనిఫిట్​ అయిన వారికి లక్ష సాయం, గొర్రెల పంపిణీ స్కీమ్​లో ఇవ్వడానికి లేదు.  కానీ, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని అలాంటి వారికి కూడా స్కీమ్​లు ఇవ్వాలని అంటున్నారు. ఇతర పార్టీలకు చెందిన  కుటుంబాల్లో అర్హులున్నప్పటికీ  స్కీమ్​లు ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు కచ్చితంగా చెప్తున్నారు. అసలే పనిభారానికి తోడు రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో అధికారులు సతమతమవుతున్నారు. 

ఈనెలాఖరు డెడ్​లైన్​...

స్కీంలను వంద శాతం గ్రౌండింగ్​ చేసేందుకు ప్రభుత్వం ఈనెలాఖరు వరకు డెడ్​ లైన్​ పెట్టింది. అక్టోబర్​ 4న ఫైనల్​ ఓటరు జాబితా ప్రకటించాల్సి ఉంది.  దాంతో పాటు   స్టాఫ్​కు ఎన్నికల శిక్షణ  నిర్వహించనున్నారు.  అటు పోలీసుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎమ్మెల్యేల పర్యటనలు పెరిగిపోయాయి.  ప్రజల  నిరసనల నేపథ్యంతో ఎమ్మెల్యేల పర్యటనలకు పోలీసులు బందోబస్తు ఇవ్వాల్సి వస్తోంది.  అటు సరిపడా సిబ్బంది లేక స్టేషన్లలో కేసులు పెరిగిపోతున్నాయి. 

దీంతో పాటు ఎన్నికల డ్యూటీలకు సన్నద్ధం కావాల్సి ఉంది.  దీంతో పోలీసులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఎమ్మెల్యేలు, రూలింగ్​పార్టీ లీడర్లు.. తమ డ్యూటీలను తాము సక్రమంగా చేసుకోనివ్వకపోవడం సమస్యగా మారిందని, దీని వల్లే ప్రెజర్​ పెరిగిపోతోందని అటు అధికారులు, ఇటు పోలీసులు వాపోతున్నారు.