
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ర్ట వైద్య మండలికి తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయని, రాష్ర్టంలోని 48,405 వైద్య ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 13 మంది మండలి సభ్యులను ఎన్నుకోనున్నారని రాష్ర్ట ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్(రిటైర్డ్) డాక్టర్ జి. హనుమాండ్లు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ర్ట వైద్య మండలి ఎన్నికలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సోమవారంతో నామినేషన్ ప్రక్రియ ముగియనుందని, ఈ నెల 30 నుంచి ఓటర్లందరికీ పోస్ట్ ద్వారా బ్యాలెట్ పేపర్లు పంపే ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.
ఓటు వేసిన బ్యాలెట్ పేపర్లను తిరిగి నవంబర్30 వ తేదీలోపు వైద్య మండలికి చేరుకునేలా పంపాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్ ఒకటిన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందన్నారు. రాష్ర్ట విభజన అనంతరం నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్ట వైద్య మండలిలో వైద్యుల నమోదు ఐదేండ్లకు ఒకసారి పునరుద్ధరణకు, దేశంలోనే అత్యధిక ఫీజులు ఉండేవన్నారు. ఎంబీబీఎస్కు రూ . 4 వేలు, పీజీకి రూ. 6 వేలు, సూపర్ స్పెషాలిటీకి రూ.9 వేలు ఫీజు ఉండేదన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నమోదు రుసుంను 50 శాతం తగ్గించిందన్నారు. 65 ఏండ్లు దాటిన వైద్యులకు పూర్తిగా మినహాయించారని తెలిపారు. వైద్యులు విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన కోరారు.