మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా నీడన ఎన్నికలు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా నీడన ఎన్నికలు
  • డ్రోన్లు, మానవరహిత విమానాలతో డేగకన్ను
  • అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్​ బలగాల కూంబింగ్​
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్​
  • పోలింగ్​ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

భద్రాచలం/భద్రాద్రి కొత్తగూడెం/మణుగూరు/భూపాలపల్లి, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం, ఛత్తీస్​గఢ్​ నుంచి ఆరుగురితో కూడిన యాక్షన్​టీం రాష్ట్రంలోకి ప్రవేశించిందనే సమాచారంతో భూపాలపల్లి,  ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పోలీసులు అలర్ట్​ అయ్యారు. సరిహద్దు వెంట అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్​ బలగాలతో కూంబింగ్  ముమ్మరం చేశారు. పోలింగ్​ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేయడంతోపాటు సమస్యాత్మక కేంద్రాలపై డ్రోన్లు, మానవరహిత విమానాలతో నిఘా పెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని పోలింగ్​ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల కల్లా పోలింగ్  ముగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

డోన్లు, మానవరహిత విమానాలతో నిఘా

సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచేందుకు డ్రోన్లు, మానవరహిత విమానాలను వినియోగిస్తున్నారు. ఆకాశంలో  డ్రోన్లు, మానవరహిత విమానాలు 17 కి.మీల దూరం వరకు ఫొటోలు, వీడియోలు తీసి సమాచారం ఇస్తుంటాయి. అడవుల్లో ఉండే పోలింగ్​ స్టేషన్ల వద్ద భద్రతలో వీటి పాత్ర కీలకం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, ఇల్లెందు, ఆళ్లపల్లి, కరకగూడెం, టేకులపల్లి, ములకలపల్లి తదితర ప్రాంతాలకు వీటిని తరలించారు. ఇక అడవులను గ్రేహౌండ్స్, యాంటీ నక్సల్  స్క్వాడ్స్  జల్లెడపడుతున్నారు. అలాగే పినపాక నియోజకవర్గంలో 17 కిలోమీటర్ల పరిధిలో ఎన్నికల నిర్వహణ తీరును అన్ మ్యాన్డ్  ఏరియల్  వెహికల్  (యూఏవీ) సిస్టం సాయంతో పరిశీలించనున్నారు. ఇప్పటికే మణుగూరుకు చేరుకున్న యూఏవీకి శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేశారు. ఈ వ్యవస్థ ద్వారా సమస్యాత్మక ప్రాంతాల్లో లోపాలను గుర్తించడంతో పాటు తక్షణం పరిష్కారం చూపనున్నారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో 244 పోలింగ్ కేంద్రాలపై యూఏవీ నిఘా వేసి సమాచారం అందిస్తుంది. మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టేందుకు గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు అటవీ ప్రాంతంలో మానవరహిత విమానం ద్వారా నిఘా పెట్టనున్నారు.

పోలింగ్  కేంద్రాల వద్ద మూడంచెల భద్రత

మావోయిస్టు ప్రభావిత జిల్లాగా కేంద్ర స్థాయిలో పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్​ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ ఎత్తున చర్యలు చేపట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పినపాక, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్​ జరగనుంది. జిల్లాలో మొత్తం 1,098 పోలింగ్​ కేంద్రాలకు 320 పోలింగ్​ స్టేషన్లు క్రిటికల్​ సెంటర్లుగా ఆఫీసర్లు గుర్తించారు. దాదాపు 512 కేంద్రాల్లో పోలింగ్​ను వెబ్​కాస్టింగ్​ ద్వారా  పర్యవేక్షించనున్నారు. 720 పోలింగ్​ కేంద్రాల్లో సీసీటీవీ, వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు జరిగే రెండు రోజుల ముందు మావోయిస్టులు భద్రాచలం నియోజకవర్గం చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ధాన్యం లారీలను దహనం చేసి పోలీసులకు సవాల్  విసిరారు. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు ప్రకటనలు రిలీజ్​ చేసిన నేపథ్యంలో పోలీసులు.. తెలంగాణ–ఛత్తీస్​గఢ్  రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్​ బలగాలతో కూంబింగ్​ నిర్వహిస్తున్నారు. సీఆర్​పీఎఫ్​ బలగాలతో పాటు స్టేట్​ స్పెషల్​ పోలీస్, సివిల్​ పోలీసులతో పోలింగ్​ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో దాదాపు 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోకి మావోయిస్టుల యాక్షన్‌‌ టీమ్‌‌

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు మావోయిస్టులు ఆటంకం కలిగించవచ్చన్న సమాచారంతో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఛత్తీస్‌‌ గఢ్‌‌  నుంచి ఆరుగురు సభ్యులతో కూడిన మావోయిస్టు‌ యాక్షన్‌‌  టీం సరిహద్దు జిల్లాల్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసులు.. మావోయిస్టుల యాక్షన్‌‌   టీమ్‌‌  సభ్యులైన ఆరుగురి ఫొటోలను విడుదల చేశారు. వారు కనిపిస్తే తమకు సమచారం ఇవ్వాలని, పట్టించిన వారికి రూ.లక్ష నుంచి 8 లక్షల వరకు రివార్డు‌ అందజేస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. కుంజం ఇడుమల్  అలియాస్  మహేందర్, కొవ్వాసి గంగ అలియాస్  మహేశ్, ముస్సకి దేవల్  అలియాస్ కరుణాకర్, వెట్టి దేవ అలియాస్ బాలు, పొట్టం అడుమ అలియాస్  సంజు అలియాస్ సంజీవ్, వెట్టి లక్మ  అలియాస్  కల్లుతో కూడిన ప్రత్యేక యాక్షన్ టీమ్ ను మావోయిస్టు కేంద్ర కమిటీ ఏర్పాటు చేసిందని ములుగు ఎస్పీ గాష్‌‌  ఆలం తెలిపారు. ఈ యాక్షన్ టీమ్  రాష్ట్ర సరిహద్దులను దాటి ములుగు జిల్లాలోకి ప్రవేశించిందని ఆయన వెల్లడించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు మావోయిస్టులు కుట్రలు పన్నారని ఎస్పీ చెప్పారు. మావోయిస్టుల నుంచి ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నామని, ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి  టెన్షన్​  లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.