విద్యుత్ స్థాపిత సామర్థ్యం

విద్యుత్ స్థాపిత సామర్థ్యం

తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర విద్యుత్ స్థాపిత సామర్ధ్యం 7,778 మెగావాట్లు. 2023 డిసెంబరు నాటికి ఈ స్థాపిత సామర్థ్యం 19,475 మెగావాట్లకు చేరింది. అంటే తొమ్మిదేండ్లలో 11,697 మెగావాట్ల అదనపు సామర్థ్యం ఏర్పడింది. అరవై ఏండ్లలో సాధించలేని సామర్థ్యం తాము సాధించగలిగామని, ఇదంతా తమ గొప్పతనమేనని బీఆర్‌‌ఎస్ నాయకులు ప్రచారం చేశారు. ఇందులో వాస్తవాలేంటో చూద్దాం.

రాష్ట్రం ఏర్పడ్డ తరువాత అదనంగా వచ్చిన 11,697 మెగా వాట్ల సామర్థ్యంలో ఎవరి పాత్ర ఎంత?

కేంద్ర రంగం 

2014 తరువాత కేంద్రం ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నెలకొల్పబడిన విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు కేటాయించిన విద్యుత్ సామర్థ్యం 1,873 మెగావాట్ల నుంచి 3,187 మెగావాట్లకు పెరిగింది. అంటే 1,314 మెగావాట్లు పెరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు.

ప్రైవేటు రంగం సెంబ్ కార్ప్

సెంబ్ కార్ప్ అనే ప్రైవేటు సంస్థతో తెలంగాణ ప్రభుత్వం 570 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఒప్పందం చేసుకుంది. ఇది ప్రైవేటు సంస్థ. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదు. ఇదే సంస్థతో ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పంద ధర కన్నా చాలా అధికంగా ధర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. 

చత్తీస్​గఢ్​

 చత్తీస్​గఢ్​తో 1000 మెగావాట్ల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అధిక ధరతో కూడుకున్న వ్యవహారమని నిపుణులు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. చివరకు అనేక వివాదాలతో చత్తీస్​గఢ్​నుంచి ఈ విద్యుత్ సరఫరా 2022 ఏప్రిల్ నుంచి నిలిచిపోయింది. ఈ మధ్య కాలంలో విద్యుత్ సంస్థలు వందల కోట్ల రూపాయలు వృథాగా కట్టవలసి వచ్చింది. ఇంకా వేలకోట్ల రూపాయలు మనం చత్తీస్​గఢ్​ కు బకాయి పడ్డాం. 

సౌరశక్తి

సౌరశక్తి సామర్థ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత సుమారు 5,526 మెగా వాట్లు స్థాపించబడింది. ఈ మొత్తం కూడా ప్రైవేటు రంగంలో వచ్చిందే. ఎవరు టెండర్లు పిలిచినా ప్రాజెక్టులు పెట్టడానికి ప్రైవేటు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారు. అనేక రాష్ట్రాల్లో సిద్ధంగా ఉన్నారు. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 9000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న  సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులను ప్రైవేటు రంగంలో స్థాపించారు. కాబట్టి ఇక్కడ కూడా బీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వ ఘనత ఏమీలేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలోని ధర అప్పటి మార్కెట్ ధర కన్నా చాలా ఎక్కువగా ఉండడంతో, సుమారు 25 సంవత్సరాల పాటు ఈ అనవసర భారాలు తెలంగాణ ప్రజలపై పడనున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వ రంగం 

సింగరేణి సంస్థ : రాష్ట్ర ఏర్పాటు నాటికే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన 1200 మెగావాట్ల ప్రాజెక్టు పనులు అధిక భాగం పూర్తయ్యాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్: భూపాలపల్లిలో నిర్మితమైన ఈ 600 మెగావాట్ల ప్రాజెక్టు కూడా అంతకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టి సింహభాగం పూర్తయ్యింది. దీనిని తెలంగాణ  ప్రభుత్వం పూర్తి చేసింది. 

కే‌‌టి‌‌పి‌‌ఎస్-7వ దశ

800 మెగావాట్ల ఈ ప్రాజెక్టు ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణం బీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వ అధ్వర్యంలో జరిగింది.

భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు

1080 మెగావాట్ల సామర్థ్యంతో (27 0మెగావాట్లు, నాలుగు యూనిట్లు) ఈ ప్రాజెక్టు మణుగూరులో నిర్మితమైంది. ఇది కాలం చెల్లిన సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో కట్టిన ప్రాజెక్టు. తెలంగాణకు విద్యుత్ కోతలు నివారించాలంటే యుద్ధప్రాతిపదికన ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేయాలనే సాకు చూపించి, ఇండియా బుల్స్ అనే ప్రైవేటు సంస్థ వదులుకున్నయంత్ర సామగ్రితో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. రెండేండ్లలో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. దేశంలో అత్యధిక ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులలో ఇది ఒకటి. రెండేండ్లలో ఎక్కడ చూసినా నాణ్యతా లోపాలే.

ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయిలో రిపేర్లు వచ్చిన థర్మల్ ప్రాజెక్టు దేశంలో మరో ప్రాజెక్టు లేదంటే అతిశయోక్తి లేదు. మరోవైపు గోదావరికి వరదలొచ్చినప్పుడల్లా ఈ ప్రాజెక్టు మునకకు గురవుతున్నది. పోలవరం పూర్తయితే గోదావరిలో సాధారణ వరదలకే ఈ ప్రాజెక్టు పూర్తి మునకకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించినా బీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇప్పుడు తెలంగాణకు ఈ ప్రాజెక్టు గుదిబండగా మారింది.  

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)

ఇది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు. బీ‌‌ఆర్‌‌ఎస్ పాలకులు ఘనంగా చెప్పుకుంటున్న మరో ప్రాజెక్టు 4,000 మెగావాట్ల (5x800) వై‌‌టి‌‌పి‌‌ఎస్. నల్లగొండ జిల్లా,  దామెరచెర్ల వద్ద చే పట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 2015లో మొదలైంది. అయిదేండ్లలోపు పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎనిమిదేండ్లయినా ఇంకా పూర్తికాలేదు. ఇంకా పర్యావరణ అనుమతులు రాలేదు. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు అంచనా వ్యయం రూ.25,099 కోట్ల నుంచి రూ.34,543 కోట్లకు చేరింది. దేశంలోని అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో ఇదీ ఒకటి.  ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ప్రస్తావించాలి.

తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఉమ్మడి పాలకులు విద్యుత్ రంగంలో చేసిన అన్యాయాల్లో ప్రముఖంగా ప్రస్తావించినది పవర్ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో నిర్మించకపోవడం. బొగ్గు ఈ ప్రాంతంలో లభ్యమౌతున్నప్పుడు ప్రాజెక్టులు ఎందుకు ఇతర ప్రాంతాలకు తరలించుకు పోయారని తెలంగాణ యావత్తూ ఘోషించింది. బొగ్గు లభ్యమయ్యే ప్రదేశంలో కట్టే ప్రాజెక్టులను పిట్-హెడ్ (Pithead) ప్రాజెక్టులని పిలుస్తారు. పిట్ హెడ్ ప్రాజెక్టులలో బొగ్గు సరఫరా వ్యయం తక్కువగా ఉండడంతో విద్యుదుత్పత్తి ఖర్చు తగ్గుతుంది.

ప్రజలపై భారాలు కూడా తగ్గుతాయి.  కానీ ఇప్పుడు జరిగిందేమిటి? బొగ్గు గనులకు 270 కిలోమీటర్ల దూరంలో వై‌‌టి‌‌పి‌‌ఎస్ ప్లాంటును నిర్మిస్తున్నారు. దీంతో బొగ్గు సరఫరా ధర విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పటికే నిర్మాణ ఖర్చు కూడా భారీగా పెరగడం, అలాగే బొగ్గు సరఫరాకు కేవలం సింగిల్ ట్రాక్ రైలు మార్గం ఉండడంతో వచ్చే సమస్యలతో ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ ధర తెలంగాణ ప్రజలకు తీవ్ర భారంగా మారనుంది.

-కె రఘు, విద్యుత్ రంగ నిపుణుడు