ఉమ్మడి వరంగల్ జిల్లాపై మొంథా బీభత్సం సృష్టించింది. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. అర్థరాత్రి కురిసిన వర్షానికి జనజీవనం స్థంభించిపోయింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వరంగల్ జిల్లా కల్లెడలో 38.2, వరంగల్ ఉర్సులో 33.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో 45 కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై వరద ప్రవాహంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.వడ్డేపల్లి చెరువు, ఊర చెరువు కట్టతెగడంతో గోపాల్ పూర్ ప్రాంతంలోని ప్రగతి నగర్, వివేక్ నగర్ కాలనీలు నీట మునిగాయి.ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు స్థానికులు.
వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో వరద బాధితుల కోసం 12 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు కాలనీల్లోని 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్ ప్రాంతంలో బీరన్న కుంట పాఠశాల, కాశీకుంట చర్చి, పోతనరోడ్ మార్వాడీ భవన్, ఎనుమా ముల శుభం గార్డెన్, కొత్తవాడ లక్ష్మీ గార్డెన్, లెనిన నగర్ సామాజిక భవనం, నందీశ్వర గార్డెన్ లో పునరావాసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హనుమకొండలో సుబేదారి ఎస్ఎస్ గార్డెన్, సాయిబాబా గుడి, పోచమ్మకుంటలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నీటి ప్రవాహంలోనే డోర్నకల్ రైల్వే స్టేషన్.. రైల్వే ట్రాక్పైకి భారీగా వరదనీరు చేరటంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. మరో వైపు
విద్యా సంస్థలకు ఇవ్వాళ సెలవు ప్రకటించారు అధికారులు. వరంగల్ GWMC ఆఫీస్ తో పాటు.. జిల్లా కలెక్టరేట్ల లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్ల నుంచి జనం బయటకు రావద్దని అధికారుల సూచించారు.
