
మొగుళ్లపల్లి, వెలుగు: విద్యుత్ షాక్ కు గురై చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లికి చెందిన జన్నే అనిల్(28) , విద్యుత్ శాఖలో గ్రామ సబ్ స్టేషన్ లో కాంట్రాక్టు కార్మికుడిగా చేస్తున్నాడు. గత జూన్ 3న విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంటు స్తంభం మీద నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
నాలుగు నెలలుగా హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున చనిపోయాడు. విద్యుత్ శాఖ మండల ఆఫీసర్లు, యూనియన్ లీడర్లు డెడ్ బాడీని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు. మృతుడికి భార్య శృతి ఉన్నారు. అనిల్ మృతితో మొట్లపల్లిలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.