
- గత బీఆర్‌ఎస్ సర్కారు నిర్వాకంతో వెనుకబడ్డ డిస్కంలు
- సదరన్ డిస్కంకు 44వ ర్యాంక్.. నార్తర్న్ డిస్కంకు 46వ ర్యాంక్
- ‘సీ’ గ్రేడ్‌కు పడిపోయిన విద్యుత్ సంస్థలు
- బీఆర్‌ఎస్ పాలనలో అప్పుల్లో కూరుకుపోయినయ్
- ఒక్కయూనిట్ సరఫరాకు రూపాయికి పైగా నష్టం
- 12వ వార్షిక నివేదిక ప్రకటించిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్‌ఎస్ సర్కారు పాలనలో విద్యుత్ రంగం ఎంత విధ్వంసానికి గురైందో తాజాగా మరోసారి బట్టబయలైంది. విద్యుత్ రంగంలో దేశంలో మేమే నంబర్ వన్ అంటూ గత ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు సోమవారం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన 12వ వార్షిక నివేదిక స్పష్టం చేస్తున్నది. ఈ ర్యాంకింగ్‌లో తెలంగాణ విద్యుత్ సంస్థలు అత్యంత వెనకబడ్డాయి.
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు మొత్తం కలిపి 53 ఉండగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) 44వ స్థానంలో నిలిచింది. అదే విధంగా వరంగల్ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్) 46వ స్థానంలో ఉంది. గత పాలకుల నిర్లక్ష్యమే విద్యుత్ సంస్థల విధ్వంసానికి కారణమని తాజా ర్యాంకింగ్‌తో స్పష్టమవుతున్నది. నార్తర్న్ డిస్కం ఒక్క యూనిట్ సరఫరాకు రూ.1.19 నష్టపోతుండగా మరో సదరన్ డిస్కం రూ.1.08 నష్టపోతున్నట్లు రిపోర్టులో వెల్లడైంది.
అప్పు పుట్టే పరిస్థితి లేదు
తెలంగాణ విద్యుత్ సంస్థలు గత పదేండ్లలో రూ.82వేల కోట్లకుపైగా అప్పుల ఊబిలో కూరకుపోయాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకున్న లాంగ్ టర్మ్ లోన్ లు రూ.78,553 కోట్లు కాగా, వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బాకీలు రూ. 85,030 కోట్లు ఉన్నాయి. విద్యుత్ సంస్థల మొత్తం అప్పులు రూ.1,63,583 కోట్లకు చేరాయి. కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో విద్యుత్ సంస్థలు గత పదేండ్లలో అప్పుల పాలైన విషయాన్ని శ్వేతపత్రంలో వెల్లడించింది.
తాజాగా కేంద్రం విడుదల చేసిన వార్షిక నివేదికలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు 44వ స్థానం, 46వ స్థానంలో నిలిచాయి. ‘సీ’ కేటగిరీకి పడిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో డిస్కంలకు అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. పవర్ పర్చేజ్ కాస్ట్ కూడా బాగా పెంచి మరి కరెంటు కొన్నారు. దీంతో సదరన్ డిస్కం రూ.29,399కోట్లు, నార్తర్న్ డిస్కం రూ.11,637కోట్లు ఇలా రెండు కలిపి కొనుగోళ్లకు సంబంధించి రూ.41,036కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
నష్టాల ఊబిలో నార్తర్న్ డిస్కం
నార్తర్న్ డిస్కం పరిధిలో ఒక్క యూనిట్ కరెంటు సరఫరా చేస్తే రూ. 1.19 నష్టం వస్తున్నది. కరెంటు సరఫరా నష్టాలు 22.2 శాతం నమోదవుతున్నది. బిల్లుల వసూళ్లలో గత 2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.2,460 కోట్లు లోటు ఉంది. గత 326 రోజుల్లో అత్యధికంగా రూ.8,255కోట్లు మైనస్‌లో ఉంది. ట్రాన్స్‌కో, జెన్‌లకు రూ.11,649కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ సంస్థలకు సంబంధించి రూ.10వేల కోట్లు బకాయిలు ఉన్నట్లు వార్షిక నివేదిక చెప్తున్నది. గత ఫైనాన్షియల్ ఇయర్ 2023లో రూ.14976కోట్లతో విద్యుత్ సరఫరా చేయగా రూ.12556కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది.
సమస్యల సుడిలో సదరన్ డిస్కం
సదరన్ డిస్కంలో కరెంటు సరఫరా నష్టాలు 17.2శాతం ఉన్నాయి. బిల్లుల వసూళ్లలో గత 2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.4,199కోట్లు లోటు ఉంది. గత 138 రోజుల్లో అత్యధికంగా రూ.16,044కోట్లు మైనస్‌లో ఉంది. ట్రాన్స్‌కో, జెన్‌లకు రూ.29398 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ సంస్థలకు సంబంధించి రూ.16వేల కోట్లు బాకీలు చెల్లించాల్సి ఉన్నట్లు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. గత ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.30, 501కోట్ల విలువైన కరెంటు సరఫరా చేయగా.. ఆదాయం మాత్రం రూ.27,600కోట్లు వచ్చింది.
కొత్త సర్కారు దిద్దుబాటు చర్యలు...
కొత్త సర్కారు విద్యుత్ రంగంలో దిద్దు బాటు చర్యలు చేపట్టింది. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో కంటే ఎక్కువ కరెంటు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది వరకు ర్యాంకింగ్ మెరుగురు పరుచుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.