కరెంటు సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: డిస్కంల హెచ్చరిక

కరెంటు సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: డిస్కంల హెచ్చరిక
  • అధికారులకు డిస్కంల హెచ్చరిక
  • ఇప్పటికే ఇద్దరు డీఈలపై వేటు 

హైదరాబాద్‌, వెలుగు: కరెంట్‌ సరఫరాలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని అధికారులను డిస్కంలు హెచ్చరించాయి. రైతులు, వినియోగ దారులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేదని స్పష్టం చేశాయి. ‘కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంట్‌ పోయింది”అని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవడంతో ప్రభుత్వం సీరియస్‌ అయింది. కరెంట్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు షురూ చేసింది.

ఈ క్రమంలో ఇప్పటికే సదరన్‌ డిస్కంలో ఓ డైరెక్టర్‌‌పై వేటు వేసిన సర్కార్‌‌.. తాజాగా కరెంట్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు డీఈ స్థాయి అధికారులపై పాలనపరమైన చర్యలు తీసుకుంది. వ్యవసాయానికి కరెంటు సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లకు చార్జ్‌ మెమో ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి డీఈగా దీర్ఘకాలంగా కొనసాగుతున్న గోపాలకృష్ణపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆయనను హెడ్‌ ఆఫీస్‌కు సరెండర్‌ చేశారు. కాగా, కరెంటు విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని అధికారులను డిస్కంల యాజమాన్యం హెచ్చరించింది.