
- దెబ్బతిన్న 168 ట్రాన్స్ఫార్మర్లు
- తొమ్మిది జిల్లాల్లో భారీ విధ్వంసం
- రాత్రంతా అంధకారంలోనే పలు ప్రాంతాలు
- యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
హైదరాబాద్, వెలుగు : గాలివానల బీభత్సంతో పలు జిల్లాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చెట్లు కూకటివేళ్లతో నేలకూలాయి. కొన్ని చెట్ల కొమ్మలు కరెంటు తీగలపై పడడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మొత్తం 5,120 కరెంటు స్తంభాలు నేలకూలాయి. పలుచోట్ల 168 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో పెద్దపెద్ద చెట్లు, చెట్ల కొమ్మలు..
విద్యుత్ తీగలపై, స్తంభాలపై పడడంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో కూడా కరెంటు స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు జిల్లాల్లో ప్రజలు రాత్రంతా అంధకారంలోని గడపాల్సి వచ్చింది. కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారుఖీ.. వర్ష ప్రభావిత జిల్లాల ఎస్ఈలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరెంటు సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
దీంతో అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది రంగంలోకి దిగి పునరుద్దరణ చర్యలు చేపట్టారు. సదరన్ డిస్కం సిబ్బంది హైటెన్షన్ 33 కేవీ పోల్స్‌ను పునరుద్ధరించగా, మరో 11కేవీ పోల్స్ 1,479 తిరిగి ఏర్పాటు చేశారు. దెబ్బతిన్న లోటెన్షన్ పోల్స్‌లో 2,561 స్తంభాలను బాగుచేశారు. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లలో 133ను రిస్టోర్ చేశారు.
ఇంకా పలు ప్రాంతాల్లో అంధకారమే
విద్యుత్ సిబ్బంది వేగవంతంగా చర్యలు చేపట్టినా ఇంకా పలు జిల్లాల్లోని గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. 386 హైటెన్షన్ 11 కేవీ కరెంటు స్తంభాలను పునరుద్దించాల్సి ఉంది. మరో 35 ట్రాన్స్ ఫార్మర్లు, 634 లోటెన్షన్ కరెంటు స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పటి వరకు గ్రామాల్లో అంధకారం కొనసాగనుంది. కరెంటు సరఫరాను వేగంగా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.