వ్యవసాయ బోర్లకు కరెంట్​ సరఫరా బంద్

వ్యవసాయ బోర్లకు కరెంట్​ సరఫరా బంద్

కౌడిపల్లి, వెలుగు : ఐదు రోజులుగా వ్యవసాయ బోరు బావులకు కరెంట్​సరఫరా నిలిచిపోయింది. గత ఆదివారం గాలివాన బీభత్సానికి కౌడిపల్లి మండలం తునికి శివారులోని ఐదు ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో 11 కేవీ కరెంట్​తీగలు తెగిపోయాయి. పలు స్తంభాలు విరిగి నేలకొరిగాయి. అయితే వాటికి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో తెగిన వైర్లు, విరిగిన స్తంభాలు పొలాల్లో అలాగే ఉన్నాయి.

ఈ విషయమై సంబంధిత విద్యుత్ అధికారులకు చెప్పినప్పటికీ రిపేర్లు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా ఐదు ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్​ సరఫరా బంద్​చేయడంతో ఆయా ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో ఉన్న 70 వ్యవసాయ బోరుబావులు నడవని పరిస్థితి నెలకొంది. వానాకాలం సీజన్ రావడంతో పొలాలకు నీళ్లు పార బెట్టి దుక్కులు దున్నుకుందామంటే కరెంట్​సరఫరా లేక ఇబ్బంది కరంగా ఉందని రైతులు వాపోతున్నారు. 

రెండు రోజుల్లో  రిపేర్లు పూర్తి చేస్తాం.. 

ఐదు రోజుల క్రితం గాలివాన బీభత్సానికి వైర్లు, స్తంభాలు తెగిపడ్డాయి.  సంబధిత లైన్​మన్​ వెళ్లి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఆ ఏరియాలోని ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్​ సరఫరా నిలిపి వేశారు. మరమ్మతులు చేయడానికి మెటీరియల్ లేకపోవడంతో కొద్దిగా ఆలస్యం జరిగింది.  సంగారెడ్డి నుంచి కావలసిన మెటీరియల్ తీసుకువచ్చి రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేసి రైతులకు యథావిధిగా విద్యుత్ సరఫరా చేస్తాం.

కోటేశ్వరరావు, ఏఈ