ఇసుక జారడం వల్లే బ్లాక్ కుంగింది

ఇసుక జారడం వల్లే బ్లాక్ కుంగింది

హైదరాబాద్, వెలుగు: ఇసుక జారడం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టులోని ఏడో బ్లాక్ కుంగిందని ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్ (ఈఆర్​టీ) రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ కోసం ప్రభుత్వం పలు దఫాలుగా నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీని కోరుతూ వస్తున్నది. చాలా కాలంగా దీన్ని అందజేయడానికి విముఖత వ్యక్తం చేసిన సంస్థ ఎట్టకేలకు నీటి పారుదల శాఖకు దాన్ని అందజేసింది. పోయినేడాది జనవరి 4 నుంచి 9వ తేదీ నడుమ ఎలక్ట్రో రెసిస్టివిటీ టెస్ట్ జరిగింది. అప్పటి నుంచి ఈ రిపోర్ట్ గోప్యంగానే ఉంది. రిపోర్ట్​లోని అంశాలను పరిశీలిస్తే బ్యారేజీలో ఎక్కువ రోజులు భారీగా నీటిని నిల్వ చేయడంతో ఒత్తిడి పెరిగిందనీ, రాఫ్ట్ సీకెంట్ పైల్స్ మధ్య ఉన్న ఇసుకపై ఆ ఒత్తిడి పడి అది జారిందని తేలింది. 

ఇలా ఇసుకంతా జారడంతో బ్యారేజీలోని ఏడో బ్లాక్​ కుంగిందని రిపోర్టులో పేర్కొంది. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు. అయితే ఏడో బ్లాక్​లోని 19, 20, 21 పిల్లర్లు కుంగిపోయే సమయంలో అందులో 10.33 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పెద్ద ఎత్తున నీరు ఉండడంతో ఒత్తిడి పెరిగి పిల్లర్లు కుంగిపోయాయని గుర్తించారు. 2019 జూన్​లో బ్యారేజీని ప్రారంభించిన తర్వాత నవంబరులో వరదలు వచ్చాయి. అపుడు గేట్లు దించారు. నాటి వరద ప్రవాహంతో ప్రాజెక్టులోని సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు చెల్లా చెదురయ్యాయి. ఆప్రాన్లు దెబ్బతిన్నట్లు కూడా గుర్తించారు. ఒకవేళ అదే ఏడాది నవంబర్​లో రిపేర్లు చేపట్టి ఉంటే తాజా నష్టం సంభవించేది కాదని తేలింది.