మూడేళ్ల కింద పెద్దపులి..ఇపుడు ఏనుగు

మూడేళ్ల కింద పెద్దపులి..ఇపుడు ఏనుగు

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో రైతుపై ఏనుగు దాడిలో చనిపోయాడు. 12 గంటల వ్యవధిలో ఇద్దరు రైతులు మృతి చెందారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాగజ్​నగర్ ఫారెస్ట్ డివిజన్​లో ఈ ఘటన జరిగిందని చెప్పారు. గురువారం తెల్లవారుజామున పెంచికల్​పేట్ మండలం కొండపల్లి గ్రామంలో కారు పోశన్న (55)పై ఏనుగు దాడి చేసిందని, దీంతో అతను స్పాట్​లోనే చనిపోయాడని తెలిపారు. 

మోటార్ వేయడానికి ఇంటి నుంచి పోశన్న తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు పొలానికి బయలుదేరాడు. గ్రామ పంచాయతీ దగ్గర్లో ఉన్న చేను వద్దకు చేరుకున్నాడు. అప్పుడే ఘీంకరించిన ఏనుగు.. పోశన్నపై దాడి చేసింది. దీంతో అతను స్పాట్​లోనే చనిపోయాడు. ఘీంకారం విన్న గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికొచ్చేసరికి ఏనుగు అక్కడి నుంచి పారిపోయింది. అయితే, గ్రామస్తులు పోశన్న వద్దకెళ్లి చూడగా.. అప్పటికే అతను చనిపోయాడని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.

ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు చనిపోవడంతో గ్రామస్తులు భయాందోళకు గురవుతున్నారు. మూడేండ్ల కింద ఇదే గ్రామ శివారులో పత్తి ఏరుతున్న పసుల నిర్మల అనే యువతిపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. అడవికి దగ్గరగా ఉన్న గ్రామం కావడంతో ఇప్పటి దాకా పులి భయం ఉండేదని, ఇప్పుడు ఏనుగు ఇద్దరిని చంపేసిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇదే ఏనుగు చింతలమానేపల్లి మండలం బూరేపల్లి శివారులో మిర్చి ఏరుతున్న అల్లూరి శంకర్ (58)పై ఏనుగు దాడి చేసి చంపేసింది. ఫారెస్ట్ అధికారులు సరిగ్గా స్పందించడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఏనుగును ట్రాక్ చేసి దారి మళ్లించి ఉంటే పోశన్న చనిపోయేవాడు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.