బావిలో పడ్డ ఏనుగు.. జేసీబీతో రక్షించిన అధికారులు

బావిలో పడ్డ ఏనుగు.. జేసీబీతో రక్షించిన అధికారులు

చిత్తూరు జిల్లా: బావిలో పడిపోయిన ఏనుగును పోలీసులు, అటవీ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో రక్షించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా  పలమనేరు రేంజ్ పరిధిలోని మొగిలి పంచాయతీ గాండ్లపల్లి గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. 

గుండ్లపల్లె గ్రామ శివార్లలోని పొలాల్లో ఉన్న ఓ వ్యవసాయ బావిలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ ఏనుగు పడిపోయింది. ఉదయం ఈ విషయం గుర్తించిన రైతులు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు అటవీశాఖ అధికారులు కలసి  ఏనుగును రక్షించేందుకు జేసీబీ సాయంతో రంగంలోకి దిగారు. బావి గట్టును తవ్వి ఏనుగు బయటపడేందుకు దారి ఏర్పాటు చేయడంతో అది బయటకు వచ్చింది. బావిలో పడ్డ ఏనుగును కాపాడేందుకు సహకరించిన ప్రజలకు.. బావిని కొద్దిగా తొలగించి క్యాంపు ఏర్పాటు చేసేందుకు సహకరించిన రైతులకు డీఎఫ్ఓ చైతన్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏనుగుల వల్ల వంట నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లిస్తామని, ధ్వంసమైన బావికి మరమ్మతు చేస్తామని హామీ ఇచ్చారు.రైతులు పొలాల్లోని తమ బావుల చుట్టూ పిట్టగోడ లాంటి రక్షణ గోడలు నిర్మించుకోవాలని, దీని కోసం వీలైతే ప్రభుత్వం నుండి కూడా సహాయం కోసం ఏర్పాట్లు చేస్తామని డీఎఫ్ఓ చైతన్ కుమార్ రెడ్డి చెప్పారు.