బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ పార్టీ : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ పార్టీ : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రతిరోజు మదనపడుతూ ఉండేవాళ్లమని, కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ పై పోరాటం చేశామా..? స్నేహం చేశామా అర్థం కాలేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ బీ -పార్టీ అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసే పోటీ చేస్తాయన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో తనతో పాటు కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయ్యిందని చెప్పారు. కాంగ్రెస్ కు మనుగడ లేకున్నా... కాపాడుకునే ప్రయత్నం చేస్తూ.. నిబద్ధత గల కార్యకర్తగా పనిచేశానని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ ను ఎదురించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కు లేదని, అది కేవలం బీజేపీకే ఉందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించడం బీజేపీ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. అధికారం, పదవుల కోసం తాను ఏనాడు పాకులాడలేదన్నారు. అధికారంలో లేకున్నా.. కాంగ్రెస్ జెండా మోశానని చెప్పారు. ఎంతో నిబద్దతో ఉన్న తనకు కాంగ్రెస్ షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నిర్మల్ లో కాషాయం జెండా ఎగురవేసి తీరుతామన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి నిర్మల్ నియోజకవర్గానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, ఆల్జాపూర్ శ్రీనివాస్ లకు బీజేపీ నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సెంట్ థమన్ స్కూల్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వివేక్ వెంకట స్వామి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాళులర్పించారు.