కొట్టుకుపోయిన ‘కేజ్​ కల్చర్ల’కు..పరిహారం ఇవ్వలె

కొట్టుకుపోయిన ‘కేజ్​ కల్చర్ల’కు..పరిహారం ఇవ్వలె
  • ఏడాదిగా మంత్రులు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు
  • ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో వరదలకు కొట్టుకపోయిన యూనిట్లు 
  •  రూ.4.30కోట్ల ఆస్తి నష్టం.. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు

కోల్​బెల్ట్​, వెలుగు:  ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో నిరుడు కొట్టుకపోయిన  కేజ్​ కల్చర్( పంజరాల ద్వారా చేపల పెంపకం) ​ యూనిట్ల నిర్వాహకులకు  ఇప్పటివరకూ పరిహారం అందలేదు. మంత్రులు, సర్కార్​ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కనికరించడంలేదని వారు ఆవేదన చెందుతున్నారు.కేజ్​ కల్చర్​ యూనిట్లతో చేపల వేట సాగించి కుటుంబాన్ని పోషించుకునే మత్స్యకారులకు  ఉపాధి దొరకడం లేదు.  రోజువారీ కూలి పనికి వెళ్తూ ఇబ్బందులు పడ్తున్నారు.  సంబంధిత ఫిషరీస్​ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు  నష్టాన్ని అంచనా వేసి సర్కార్​కు రిపోర్టు చేశామని చెప్పి చేతులు దులుపుకున్నారు.

చేసిందంతా వరద పాలు..

ఎల్లంపల్లి రిజర్వాయర్​లో  చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 2018లో  ఫిషరీ డిపార్ట్​మెంట్​ 8 మంది మత్స్యకారులతో  పది  కేజ్​ కల్చర్​ యూనిట్లు  ఏర్పాటు చేయించింది.  దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం అందించింది.  కేజ్ కల్చర్​ నిర్వాహకులు,  మత్స్యకారులకు ఆఫీసర్లు సలహాలు అందించడమే కాకుండా ట్రైనింగ్​ కూడా ఇప్పించారు.   మొదటి, రెండో విడతల్లో  రిజర్వాయర్​లో  ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా.. తర్వాత  నెమ్మదిగా  లాభాలు రావడం,  వందలాది మత్స్యకారులకు ఉపాధి దొరకడంతో మరికొన్ని యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆఫీసర్లు భావించారు.   గతేడాది జులై  నాటికి   చేపలు పూర్తిస్థాయిలో మంచి సైజుకు వచ్చాయి.  మరో  నెల రోజుల్లో  వాటిని అమ్ముకుని నష్టాలు పూడ్చుకుందామనుకునే లోగా మత్స్యకారుల ఆశలకు గోదావరి వరదలు గండికొట్టాయి.  భారీగా వర్షాలు  రావడం పైభాగంలోని కడెం రిజర్వాయర్​గేట్లు ఎత్తివేయడంతో ఎల్లంపల్లిలోకి వరద భారీగా పెరిగింది.  దీంతో ఆఫీసర్లు జులై13న రిజర్వాయర్​ గేట్లను ఎత్తివేయగా గోదావరిలో వరద  పెరిగి కేజ్​ కల్చర్​కు చెందిన 8 యూనిట్లు కొట్టుకుపోయాయి.  కేజ్ కల్చర్ యూనిట్లతో పాటు సుమారు రూ. కోటి విలువైన వంద టన్నుల చేపలు, నాలుగు మోటారు బోట్లు,  పది టన్నుల నిల్వ  చేసిన దాణా, ఫ్లోటింగ్ హౌజ్ (నీటిపై తేలియాడే ఇల్లు), వలలు, లైవ్​ జాకెట్లు ఇతర సామాను పూర్తిగా వరదలో  కొట్టుకుపోయాయి. సుమారు రూ.4 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కడెం ప్రాజెక్టులో మూడు కేజ్​ కల్చర్​ యూనిట్లు, 30టన్నుల చేపలు వరద పాలవ్వడంతో దాదాపు రూ.30లక్షల వరకు నష్టపోయారు. 

మంత్రులు, ఆఫీసర్లను కలిసి..

కేజ్​ కల్చర్ తో తీవ్రంగా నష్టపోయామని తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని నష్ట పరిహారం ఇవ్వాలని మంత్రులు, ఆఫీసర్ల చుట్టూ  నిర్వాహకులు  తిరుగుతున్నారు.  మంత్రులు హరీశ్​​రావు, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​కుమార్​, ఎమ్మెల్యే బండా ప్రకాశ్,  మత్స్యశాఖ కార్యదర్శి అనిల్ సిన్హా,  మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ పిట్టల రవీందర్ ను కలిసి నష్టపరిహారం ఇప్పించాలని వేడుకున్నారు.  అయినా ఇప్పటివరకు  ఫలితం దక్కలేదని  నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. కేజ్ కల్చర్ యూనిట్ల కోసం చేసిన అప్పులు కూడా ఇంకా తీరలేదని, తమను వరదలు నిండా ముంచాయని  వాపోతున్నారు. తమను ఆదుకుని మత్స్యకారుల ఉపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నారు.

పరిహారం కోసం చూస్తున్నం..

అప్పులు చేసి ఎల్లంపల్లి రిజర్వాయర్​ ప్రాజెక్టులో  కేజ్​ కల్చర్​ యూనిట్లు పెట్టుకున్నం. కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న టైంలో వరద నోటికాడి బుక్క ఎత్తుకెళ్లింది.  రూ.4 కోట్ల నష్టం జరిగింది. సర్కార్​ నుంచి పరిహారం కోసం ఏడాదిగా తిరుగుతున్నం.

- నూనె రవీందర్​, కేజ్​ కల్చర్​ యూనిట్​ నిర్వాహకుడు

తెప్పలపై వేట తప్పట్లే..

నాలుగేండ్లుగా కేజ్​ కల్చర్​ యూనిట్ల ద్వారా ఉపాధి పొందినం.  వరదతో యూనిట్లన్నీ  కొట్టుకపోయినయ్​. ఏడాదిగా ఉపాధి కరువై ఇబ్బంది పడ్తున్నం. డేంజరని తెల్సిన తెప్పలపైనే వేటకు వెళ్తున్నం.

- రాములు,  మత్య్సకారుడు