నిరసనకారులపై చేయి చేసుకున్న ఇల్లంతకుంట ఎస్ఐ

నిరసనకారులపై చేయి చేసుకున్న ఇల్లంతకుంట ఎస్ఐ

ప్రజా స్వామ్యంలో నిరసనలు, ఆందోళనలు ప్రాథమిక హక్కు. శాంతియుతంగా నిరసనలు చేపట్టే.. వారిపై పోలీసులు పలు సందర్భాల్లో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. నిరసనకారులను చితకబాదుతుంటారు. దీంతో పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు చెలరేగుతుంటాయి. తాజాగా... ఇల్లంతకుంట ఎస్ఐ మహేందర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. దొరికిన వారు దొరికినట్టు చితకబాదారు. వ్యాన్ లో కూర్చొన్న వ్యక్తిని కొట్టిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్ఐ కొట్టడంపై బీజేవైఎం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. 

మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రానికి 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యాన్ లోకి ఎక్కిస్తున్నారు. ఒక్కసారిగా ఇల్లంతకుంట ఎస్ఐ మహేందర్ దూసుకొచ్చి వ్యాన్ లో ఎక్కడానికి వెళుతున్న వ్యక్తులను నూకేశారు. కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్నారు. వ్యాన్ లో ఎక్కిన వ్యక్తిని సైతం పడాపడా అంటూ బాదారు. ఒక్క వీడియో బయటకు రావొద్దని ఎస్ఐ హుకుం జారీ చేశారు. ఆలస్యంగా ఈ విజువల్స్ బయటకు వచ్చాయి. ఎస్ఐ అవలంబించిన దురుసు ప్రవర్తనపై బాధితులు మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించారు. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు.