ట్విట్టర్ కొనుగోలు.. బాంబు పేల్చిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ కొనుగోలు.. బాంబు పేల్చిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ల మధ్య వివాదం ముదురుతోంది. ముందు నుంచి ట్విటర్ మేనేజ్ మెంట్ పై విమర్శలు, విసుర్లతో ఎలాన్ మస్క్ విరుచుక పడుతున్న సంగతి తెలిసిందే. అలా వ్యవహరిస్తూనే పూర్తి స్థాయిలో ట్విట్టర్ ను కొనుగోలుకు ముందుకు వచ్చాడు. కొన్నిరోజుల్లో ట్విట్టర్ ఎలాన్ మస్క్ సొంతమవుతుందని తెలిసినా ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్  వెనక్కి తగ్గట్లేదు. ట్విటర్ లో ఫేక్ అకౌంట్లు 5 శాతం మించి ఉండవంటూ ఆ సంస్థ మేనేజ్ మెంట్ చెప్పిన వివరాలపై ఎలాన్ మస్క్ అసంతృప్తిగా ఉన్నాడు. ఫేక్ అకౌంట్ల వివరాల్లో స్పష్టత రాకపోతే ట్విట్టర్ టేకోవర్ విషయం ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశాడు.

ట్విట్టర్ కొనుగోలు డీల్ ను హోల్డ్ లో పెడుతున్నట్టు ఎలాన్ మస్క్ బాంబు పేల్చాడు. తమ టీమ్ ఫేక్, స్పామ్ అకౌంట్లను పట్టుకోవడంలో నిరంతం శ్రమిస్తోందని, అధునాతన పద్ధతుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తులు వేస్తూ ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారన్నారు సీఈవో పరాగ్ అగర్వాల్. శాయశక్తుల శ్రమించి ఫేక్ అకౌంట్లను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే ఈ విషయంలో ఎవరికో సందేహాలు ఉన్నాయని... ఫేక్ అకౌంట్లు తేల్చేందుకు బయటి వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సాధ్యం కాని పని అంటూ తేల్చి చెప్పాడు. ట్విట్టర్ లో స్పామ్ అకౌంట్ల ఎన్ని ఉన్నాయనేది నిర్థారించేందుకు బయటి వాళ్లకు అవకాశం ఎందుకు ఇవ్వడం వీలు పడదో వివరిస్తూ అనేక ట్వీట్ లు చేశాడు పరాగ్ అగర్వాల్. అయితే వాటన్నింటికి వ్యంగ్యంగా కామెడీ చేసే ఓ ఎమోజీని రిప్లైగా ఇస్తూ మరింత వెటకారం చేశారు ఎలాన్ మస్క్. పరాగ్, మస్క్ వివాదంపై నెటిజన్లు కూడా భారీగానే స్పందిస్తున్నారు. ట్విట్టర్ కనుక పారదర్శకంగా ఉండాలనుకుంటే స్పామ్  అకౌంట్ల విషయంలో బయటి వాళ్ల చేత వెరిఫై చేయించాలంటున్నారు చాలామంది. మరికొందరు ట్విటర్ సీఈవోను మస్క్ దారుణంగా అవమానిస్తున్నాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.  

ట్విటర్ కొనుగోలు ఒప్పందం ఖరారు తర్వాత రోజుకో అప్ డేట్ తో మస్క్  వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని ఒప్పందంలో పేర్కొన్న ఆయన.. తాజాగా దాన్ని తగ్గించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఒప్పుకున్న డాలర్ల కంటే తక్కువ చెల్లించి ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చారు. మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు బిజినెస్ అనలిస్టులు. లేదా ఇటీవల ట్విటర్ షేరు భారీగా పడిపోవడంతో తక్కువ ధరకైనా కొనుగోలు చేయాలని భావిస్తూ ఉండాలని విశ్లేషిస్తున్నారు. ట్విటర్ కొనుగోలుకు కావాల్సిన 44 బిలియన్ డాలర్లలో కొంత మొత్తాన్ని ఆయన సొంతంగా భరిస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా భారాన్ని తగ్గించుకునే యోచనలో ఉండొచ్చని చెబుతున్నారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించి మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 14న ఒప్పందం ఖరారు చేసుకున్నారు. కానీ, నకిలీ ఖాతాల సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అప్పటి నుంచి షేరు ధర పడిపోతూ వస్తోంది. సోమవారం 8 శాతం నష్టంతో 37.39 డాలర్ల వద్ద స్థిరపడింది.

మరిన్ని వార్తల కోసం : -

జమైకాలో కొనసాగుతున్న రాష్ట్రపతి పర్యటన


కరోనాతో నార్త్ కొరియా కకావికలం