అప్పుల వసూల్‌కు ఇండియా వస్తున్న అరబ్ బ్యాంకులు

అప్పుల వసూల్‌కు ఇండియా వస్తున్న అరబ్ బ్యాంకులు

మన దేశానికి ఎమిరేట్స్​ బ్యాంకులు

రూ.50 వేల కోట్ల రికవరీ కోసం ప్రయత్నాలు

వచ్చే వారం నోటీసుల జారీ

ఎన్సీఎల్టీలోనూ కేసులు వేసే అవకాశం

బ్యారోవర్లలో కార్పొరేట్‌ కంపెనీలే ఎక్కువ

ముంబై:  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాంకులు ఇండియా రావడానికి రెడీ అవుతున్నాయి. ఇక్కడ తమ బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయడానికి ఇవి రావడం లేదు. భారీగా బకాయిపడ్డ ఇండియన్‌‌ కంపెనీల నుంచి అప్పులను వసూలు చేయడానికి ప్రయత్నాలను మొదలుపెట్టాయి. యూఏఈకి చెందిన తొమ్మిది బ్యాంకులు రూ.50 వేల కోట్లు రికవరీ చేయడానికి త్వరలోనే నోటీసులు పంపే అవకాశాలు ఉన్నాయి. ఎమిరాటీ కోర్టుల ఆదేశాలు ఇండియాలో చెల్లుబాటు అవుతాయని మోడీ ప్రభుత్వం స్పష్టీకరించడం వీటికి పెద్ద ఊరట. కార్పొరేట్‌‌ అప్పులు తీసుకున్న వాటిలో ఎక్కువ సంస్థలు ఇండియా కంపెనీలకు చెందిన దుబాయ్‌‌, అబూదాబీలోని సబ్సిడరీలే! కొందరు వ్యక్తులు కూడా అప్పులు తీసుకున్న వారి లిస్టులో ఉన్నారు. కొన్ని బ్యాంకులు రిటైల్‌‌ లోన్లు  ఇచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. కొన్నింటిని 15 ఏళ్ల క్రితమే మంజూరు చేసినా, ఇప్పటికీ వసూలు కాకపోవడంతో న్యాయపరమైన చర్యలకు యూఏఈ బ్యాంకులు రెడీ అవుతున్నాయి. అక్కడి కోర్టుల డిక్రీలు ఇండియాలో చెల్లుబాటు అవుతాయని గత నెల 17న నోటిఫికేషన్‌‌ కూడా ఇచ్చింది. అంటే అక్కడి కోర్టు ఇండియన్‌‌ డిఫాల్టర్‌‌కు వ్యతిరేకంగా లేదా అనుకూలంగా తీర్పు చెబితే.. దానిని అమలు చేయాల్సిందిగా ఆ దేశం ఇండియాను కోరవచ్చు. స్థానిక బ్యాంకులు రికవరీకి ఎటువంటి చర్యలు తీసుకుంటాయో.. అలాంటి చర్యలే యూఏఈ బ్యాంకుల కేసుల్లోనూ అమలవుతాయి. -ఒక్కొక్కరు దాదాపు రూ.రెండు కోట్ల వరకు అప్పు తీసుకున్నారని, వీటిని చెల్లించే ఉద్దేశం చాలా మందికి లేదని తెలియడం వల్లే బ్యాంకులు యాక్షన్‌‌ తీసుకుంటున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఏం జరుగుతోందంటే ?

ఇండియన్ డిఫాల్టర్ల నుంచి బకాయిల వసూలుకు డిక్రీలు ఇవ్వాలని యూఏఈ బ్యాంకులు కోర్టులో పిటిషన్లు వేయడం మొదలుపెట్టాయి.

రాబోయే కొన్ని వారాల్లో కార్పొరేట్‌‌ డిఫాల్టర్లకు నోటీసులు అందుతాయని యూఏఈ బ్యాంకింగ్​ వర్గాలు తెలిపాయి.

కార్పొరేట్‌‌ బకాయిల వసూలు కోసం ఇవి నేషనల్‌‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌‌ (ఎన్సీఎల్టీ)లో కేసులు వేసి, రిటైల్‌‌ లోన్ల వసూలుకు పర్సనల్ గ్యారంటీలను విడిపించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఎమిరేట్స్‌‌ ఎన్‌‌బీడీ, మష్రెక్‌‌ బ్యాంక్‌‌, అబూదాబీ కమర్షియల్‌‌ బ్యాంక్‌‌, దోహా బ్యాంక్‌‌, నేషనల్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఒమన్‌‌, నేషనల్ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ బహ్రెయిన్‌‌ నోటీసులు పంపడానికి రెడీ అవుతున్నాయి.

ఎమిరాటీ కోర్టులు జారీ చేసే డిక్రీలు కొన్ని సివిల్‌‌ కేసుల్లో చెల్లుబాటు అవుతాయని పేర్కొంటూ ఇండియా ప్రభుత్వం గత నెల 17న నోటిఫికేషన్‌‌ ఇచ్చింది.