- ఎక్కువ వడ్డీ రేటు ఉన్న లోన్లను ముందుగా తీర్చాలి
- అనవసర ఖర్చులు తగ్గిస్తే, ఈఎంఐ అమౌంట్ పెంచొచ్చు.. లోన్ కాలపరిమితి దిగొస్తుంది
- జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకోవాలి
- వీటితో అత్యవసర సమయాల్లో లోన్లు తీసుకునే అవసరం తగ్గుతుంది
న్యూఢిల్లీ:చాలా మంది ఉద్యోగుల జీతాల్లో సగానికి పైగా ఈఎంఐలకు పోతోంది.జీతం పడిన కొన్ని గంటల్లోనే జేబు ఖాళీ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈఎంఐ భారం కొద్దిగా తగ్గినా, భారీ ఊరట దొరుకుతుంది. కొన్ని అంశాలను ఫాలో అయితే లోన్లపై ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు. అవి..
లోన్ల జాబితా తయారు చేసుకోవాలి..
ప్రతి లోన్‌కి ఔట్‌స్టాండింగ్ మొత్తం, ఈఎంఐ, వడ్డీ రేటు, మిగిలిన కాలం వంటి వివరాలు లిస్టు చేసుకోవాలి. దీంతో లోన్‌పై పూర్తి క్లారిటీ వస్తుంది.
అధిక వడ్డీ లోన్లపై మొదట దృష్టి పెట్టాలి
వడ్డీ రేటు ఎక్కువగా ఉన్న లోన్లను ముందుగా తీర్చడం వల్ల వడ్డీ భారం తగ్గించుకోవచ్చు.
పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు సాధారణంగా అధిక వడ్డీ కలిగి ఉంటాయి.
ప్రీపేమెంట్ లేదా ఈఎంఐ పెంపు
మీ దగ్గర లంప్‌సమ్ (పెద్ద మొత్తంలో) డబ్బు ఉంటే, కొంత భాగాన్ని ఉపయోగించి అధిక వడ్డీ రుణాన్ని ముందుగా క్లోజ్ చేసుకోవాలి. లేదా ఈఎంఐని కొద్దిగా పెంచి లోన్ కాల పరిమితిని తగ్గించుకోవాలి. దీంతో వడ్డీ భారం దిగొస్తుంది.
ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు
కనీసం 3-–6 నెలల అవసరాలకు సరిపడే డబ్బును సేఫ్‌గా ఉంచుకోవాలి. ఇది అనుకోని పరిస్థితుల్లో కొత్త అప్పు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.
ఆరోగ్య, జీవిత బీమా
ఆర్థిక భద్రత కోసం బీమా తీసుకోవడం వల్ల సడెన్‌గా వచ్చే ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన అవసరం ఉండదు.
దశలవారీగా..
ఈఎంఐ భారం తగ్గించుకోవడం ఒక్కరోజులో జరిగే పని కాదు పై దశలను అమలు చేస్తే, డబ్బులను జాగ్రత్తగా మేనేజ్ చేయొచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. ‘‘లోన్‌ను మేనేజ్ చేయడం కూడా ఆర్థిక ప్రణాళికలో కీలక భాగం. చాలా మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈఎంఐలు, రెంటు, కిరాణా, బీమా ప్రీమియం అవసరాలను కూడా కలుపుకొని 3–6 నెలల అవసరాలకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేసుకోవాలి.
ఇది అనుకోని పరిస్థితుల్లో రక్షణగా పనిచేస్తుంది. బీమా తీసుకోవడం తప్పనిసరి. లోన్‌కు సంబంధించి వడ్డీ ఇప్పటికే ఎక్కువగా చెల్లించి ఉంటే, ప్రీపేమెంట్ చేయకూడదు. దీని వలన ప్రయోజనం తక్కువగా ఉంటుంది. అందుకే, వడ్డీ రేటు ఎక్కువగా ఉండి, మొత్తం వడ్డీ భారం ఎక్కువగా పడే లోన్లకే ప్రీపేమెంట్ చెయడానికి మొగ్గు చూపాలి” అని 1 ఫైనాన్స్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న అఖిల్ రాఠి సలహా ఇచ్చారు.
ఈఎంఐ మెర్జ్ చేయడం లేదా రీ-ఫైనాన్స్
ఒకటి కంటే ఎక్కువ లోన్లు ఉంటే, వాటిని ఒకే లోన్‌గా మెర్జ్ చేయడం (అప్పులన్నింటిని కలపడం) ద్వారా ఈఎంఐలు తగ్గించుకోవచ్చు. లేదా తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేసే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని తీర్చేయాలి.
అవసరం లేని ఖర్చులు ఆపాలి
నెలవారీ ఖర్చుల్లో వినోదం, షాపింగ్ వంటి వాటికి చేసే ఖర్చులను తగ్గించుకోవాలి. దాంతో ఈఎంఐలు చెల్లించడానికి ఎక్కువ డబ్బు మిగులుతుంది. ఈఎంఐ పెరిగితే లోన్ కాలపరిమితి తగ్గించుకోవచ్చు.
