
హనోయ్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అతని భార్య బ్రిజిట్ మాక్రాన్ మధ్య వియత్నాంలోని హనోయ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆసియా పర్యటన నిమిత్తం ఆదివారం సాయంత్రం మాక్రాన్ దంపతులు వియత్నాంకు చేరుకున్నారు. విమానం నుంచి దిగే సమయంలో మాక్రాన్ భార్య బ్రిజిట్ మాక్రాన్ ఆయన ముఖంపై చేతులు వేసి నెట్టినట్టు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ సంఘటన ఫ్రాన్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమానం డోర్తెరిచినప్పుడు మాక్రాన్ ఒంటరిగా నిలబడి ఉన్నారు. బ్రిజిట్ మాక్రాన్ పక్కనుంచి రెండు చేతులతో ఆయన ముఖంపై ఉంచి నెట్టినట్టు కనిపిస్తుంది. మాక్రాన్ కొద్దిగా ఆశ్చర్యపోయినట్లు కనిపించినా.. వెంటనే తేరుకుని విమానం బయట ఉన్న రిపోర్టర్లకు చేయి ఊపి, తల వంచి నవ్వారు. ఈ సంఘటనపై మాక్రాన్ స్పందిస్తూ.. ‘‘మేము ఆ టైంలో సరదాగా ఉన్నాము. దీనిని వివాదంగా చిత్రీకరించడం సరికాదు" అని ఆయన మీడియాతో అన్నారు.