‘సింధు’ నాగరికత కాలంలోనే ఎమోజీలు

‘సింధు’ నాగరికత కాలంలోనే ఎమోజీలు

సింధు నాగరికత లిపిపై సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ సోలో రీసెర్చ్​
సౌండ్​ ఆధారంగా  పుట్టిన లిపి కాదని వెల్లడి
ఒక్కో పనికి, వస్తువుకు గుర్తులవి.. ఇప్పటి ఎమోజీలకు డిఫరెంట్​
వ్యాపారం కోసం కామన్​ కమర్షియల్​ భాషగా వాడకం
ఇప్పటితో పోలిస్తే అప్పుడే భాషల్లో వైవిధ్యం ఎక్కువ

ఎమోజీ.. మన ఎమోషన్​ను మాటల్లో కాకుండా ఒక్క బొమ్మ రూపంలో చెప్పేది. వాట్సాప్​ వచ్చాక ఈ ఎమోజీల భాషే ఎక్కువైపోయింది. బాధ, దు:ఖం, సంతోషం ప్రతిదానికీ ఓ గుర్తు. అయితే, సింధు నాగరికత కాలంలోనే ఈ ఎమోజీ భాష వచ్చిందని అంటున్నారు రీసెర్చర్లు. ఇప్పటి ఎమోజీల్లా కాకుండా వాటికంటూ ఓ ప్రత్యేకత ఉందని చెబుతున్నారు. సింధునాగరికత లిపిపై కోల్​కతాకు చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​ బహత అన్షుమాలి ముఖోపాధ్యాయ అనే రీసెర్చర్​ ఇండిపెండెంట్​ రీసెర్చ్​ చేస్తున్నారు. ఆ రీసెర్చ్​లో భాగంగానే ఆమె ఈ విషయాలు వెల్లడించారు.

ఆధారాలు కొన్నే..

ప్రతి భాషకు లిపి అనేది కామన్​. అక్షరమక్షరం కలిస్తే మనం మాట్లాడే ప్రతి మాట పుడుతుంది. ఆ అక్షరమూ మన నోటి నుంచి వచ్చే సౌండ్​ ఆధారంగానే పుట్టిందన్నది రీసెర్చర్ల వాదన. అలాగే సింధునాగరికత లిపి కూడా సౌండ్​ ఆధారంగానే పుట్టిందని చెబుతున్నా, అది ఎంతవరకు నిజమన్నదానిపైనే బహత రీసెర్చ్​ చేశారు. సింధులోయ ప్రజలకు అసలు చదువే రాదని వాదించే రీసెర్చర్లూ ఉన్నారు. అది నిజం కాదని నిరూపిస్తే 10 వేల డాలర్లు ఇస్తామనీ సవాల్​ విసిరారు. అయితే, వాళ్ల మాటలను బహత తోసిపుచ్చారు. సింధులోయ ప్రజలు చాలా తెలివైనోళ్లని చెప్పారు. అందుకు వాళ్ల లిపే ఉదాహరణ అంటున్నారు. దానిపై రీసెర్చ్​ చేసేందుకు ఆమె చాలానే కష్టపడ్డారు. దానికీ కారణం లేకపోలేదు. ఆమె రీసెర్చ్​ చేసేందుకు కొన్ని సింబల్స్​, కొన్ని శిలాశాసనాలే ఉండడమూ అందులో ఒక కారణం. ఇప్పటిదాకా కనుగొన్న శాసనాల్లో 26 అక్షరాలు కలిగిన శాసనమే పెద్దదని ఆమె చెప్పారు. ఆ శాసనాలపై చెక్కిన గుర్తులు, అక్షరాలు ఏ భాష అన్నది తేల్చడమూ మరో సవాల్​. దొరికిన శాసనాల్లో అప్పుడు పాలించిన రాజులుగానీ, ఆ కాలం నాటి గొప్పోళ్ల పేర్లు గానీ లేవు. ఇవన్నీ కలిపి ఆమె రీసెర్చ్​ను కష్టం చేశాయి.

అదే హెల్ప్​ చేసింది

అది సౌండ్​ ఆధారంగా పుట్టిన లిపి కాదని చెప్పేందుకు ఆమెకు కనిపించిన ఆధారాలు, ఆ లిపి రాసిన తీరు, ఆ గుర్తులే బహతకు హెల్ప్​ చేశాయి. వాటి ఆధారంగానే ఇతర భాషలతో సింధు లిపిని పోల్చి చూశారు. పలికే శబ్దం ఆధారంగా పుట్టిన ఇంగ్లీష్​లా కాకుండా సింధు లిపికి ప్రత్యేకత ఉందని గుర్తించారు. అవి మాట్లాడే భాషను చెప్పే బొమ్మలని నిర్ధారించారు. అందుకు ఆమె శాసనాలపై ఉన్న ఒక్కో సింబల్​ను ఒక్కో పనిగా వేరు చేశారు. ఏయే గుర్తులు వేరుగా ఉన్నాయో వాటిని ఇంకో గ్రూప్​ చేశారు. దీంతో అవి సౌండ్​ ఆధారంగా పుట్టిన అక్షరాలు కాదని, కేవలం అర్థాన్ని వివరించే బొమ్మలు మాత్రమేనని తేల్చారు. ఆమె మాటల్లో చెప్పాలంటే మనం మాట్లాడే భాష, సౌండ్​కు మధ్య అంతరాలను, అర్థం ఇచ్చే బొమ్మల అంతరాలను పోల్చి చూసి ఈ నిర్ధారణకు వచ్చారు.

‘ఎమోజీ’ లోగోలేనా

అక్కడే బహతకు మరో కొత్త డౌట్​ వచ్చింది. అవి అక్షరాలు కానప్పుడు, ఆ గుర్తులేంటి? దాదాపు చాలా రోజులు ఆ ప్రశ్న ఆమెను వేధించింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మనం వాడుతున్న ఎమోజీ కాన్సెప్ట్​ గుర్తొచ్చింది. శాసనాలపై ఉన్న సింబల్స్​ అన్నీ ఏదో ఒక పని లేదా వస్తువుకు సంబంధించిన ‘లోగో’లుగా గుర్తించారు. అవి ఇప్పటి ఎమోజీల్లాంటివేనన్న నిర్ధారణకు వచ్చారు. అయితే, వాటికి ఇప్పుడున్న ఎమోజీలకు చాలా తేడాలున్నాయన్నారు. అయితే, వీటితో పాటే సింధు ప్రజలు సౌండ్​ ఆధారంగా పుట్టిన లిపిని కచ్చితంగా వాడి ఉంటారని ఆమె అంటున్నారు. ‘‘అయితే, అవి మన చేతికి వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే నాటి కాలంలో త్వరగా పాడైపోయే ఆకుల వంటి వాటిపై ప్రజలు రాయడం అందుకు కారణం కావొచ్చు’’ అని బహత చెప్పారు.

పద్ధతిగా పేర్చినట్టు

ఇప్పుడున్న నాణేలు, స్టాంపుల్లా కాకుండా నాటి కాలంలో శాసనాలను పద్ధతిగా, ఒకేలా ఉండేటట్టు చెక్కారని బహత చెప్పారు. వాటి పొజిషన్లు, సైజులు అంతా సమానంగా ఉన్నాయన్నారు. వాటినే ‘ఫార్మలైజ్డ్​ డేటా క్యారియర్స్​’ అని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాటి కాలంలోనే జనం సివిలైజ్డ్​గా ఉన్నారని అర్థమవుతోందన్నారు. ఇప్పటికే దొరికిన చారిత్రక ఆధారాలూ ఆ మాటకు బలం చేకూరుస్తోందన్నారు. ఎన్నో భాషలున్న నాగరిక సమాజంలో సింధు లిపిని వ్యాపారాల కోసం కామన్​ ‘కమర్షియల్​ సబ్​ లాంగ్వేజ్​’గా వాడుకున్నారని చెప్పారు. ఇప్పటితో పోలిస్తే అప్పుడే భాషా పరంగా అక్కడి జనం వైవిధ్యంగా ఉండేవారని ఆమె భావిస్తున్నారు. ఇప్పుడు దానిపైనే ఆమె మరో రీసెర్చ్​ చేయబోతున్నట్టు చెప్పారు.

ఆమెకు అంత ఈజీ ఏం కాలేదు?

ప్రస్తుతం బహత ముఖోపాధ్యాయ్​ బెంగళూరులో సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​గా పనిచేస్తున్నారు. జాబ్​ చేస్తూనే 2014లో హరప్పా (సింధూ) నాగరికతపై పరిశోధన మొదలుపెట్టారు. కేంబ్రిడ్జి అకడమిక్​ రోనోజాయ్​ అధికారితో కలిసి రీసెర్చ్​లో భాగమయ్యారు. జాబ్​ చేస్తూ, ఇంట్లో పిల్లలను చూసుకుంటూ రీసెర్చ్​ చేయడం ఆమెకు కష్టమైంది. దీంతో ఆమె రీసెర్చ్​ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రీసెర్చ్​పై ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక 2015లో జాబ్​కు 10 నెలల పాటు దూరంగా ఉన్నారు. తన ఫుల్​టైంను రీసెర్చ్​కు కేటాయించారు. సొంతంగా పరిశోధన చేశారు. దాని కోసం చాలా రోజుల పాటు కంటినిండా నిద్ర కూడా పోలేదని చెప్పారు. అన్నింటికీ దూరంగా ఉన్నానన్నారు. ఆమె చేసిన రీసెర్చ్​ గత ఏడాది జులైలో పాల్​గ్రేవ్​ కమ్యూనికేషన్​ అనే నేచర్​ జర్నల్​లో పబ్లిష్​ అయింది. మరో రెండు పేపర్లూ పబ్లికేషన్​కు సిద్ధంగా ఉన్నాయి.