అక్కరకు చేతికందని జీపీఎఫ్​..! ఏడాదిన్నరగా పార్ట్ ఫైనల్ పైసలు, జీపీఎఫ్​ లోన్లు వస్తలే

అక్కరకు చేతికందని జీపీఎఫ్​..! ఏడాదిన్నరగా పార్ట్  ఫైనల్ పైసలు, జీపీఎఫ్​ లోన్లు వస్తలే
  • ప్రభుత్వ ఆంక్షలతో ట్రెజరీల్లో బ్రేక్​
  • రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా పెండింగ్​
  • వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎదురుచూపు
  • నేడు జడ్పీ ఆఫీసుల వద్ద టీపీటీఎఫ్​ నిరసనలు

మెదక్, వెలుగు:  జీపీఎఫ్(జనరల్​ ప్రావిడెంట్​ఫండ్​)  పైసలు అక్కరకు  చేతికందక వేలాది మంది జిల్లా పరిషత్ పరిధిలోని ఉద్యోగులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు.  పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, మెడికల్​ ఖర్చులు, ఇండ్ల నిర్మాణం తదితరాల కోసం  పైసలు అవసరమై  జీపీఎఫ్​ లోన్​,  పార్ట్​ ఫైనల్​ కోసం అప్లై చేసుకుంటే నిరాశ ఎదురవుతోంది.  డబ్బులు చేతికందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జడ్పీ ఆఫీస్​ నుంచి శాంక్షన్​ ప్రొసిడింగ్​లు వెళ్లినప్పటికీ  ట్రెజరీ నుంచి సంబంధిత ఉద్యోగి, టీచర్ల ​ పర్సనల్​ అకౌంట్లలో అమౌంట్​ జమ కావడం లేదు.  తాము జీతంలో నుంచి జమ చేసుకున్న పైసలను తమ అక్కరకు ఇవ్వక ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.   

జీపీఎఫ్​ఇలా..

జిల్లా పరిషత్​ పరిధిలోని ఉద్యోగులు, టీచర్లకు జీపీఎఫ్​అకౌంట్​ ఉంటుంది.  ప్రతీ నెల వారి బేసిక్​ శాలరీ నుంచి 6 శాతం ప్రీమియం కట్​ అయి వారి జీపీఎఫ్​ అకౌంట్​లో జమవుతుంది.  జీపీఎఫ్​ అకౌంట్​లో  జమైన మొత్తం నుంచి ఉద్యోగులు,  టీచర్లు లోన్  తీసుకునే వీలుంది.  లోన్​ తీసుకుంటే ప్రతీ నెల ఇన్​స్టాల్​మెంట్​ చెల్లించాలి. అలాగే 20 ఏండ్ల సర్వీస్​ ఉన్నవారు ఇల్లు కట్టుకునేందుకు,  ప్లాట్​కొనుక్కునేందుకు, పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, హాస్పిటల్​ ఖర్చులకు వారి జీపీఎఫ్​ ఖాతాలో జమైన దాంట్లో నుంచి 75 శాతం వరకు పార్ట్​ ఫైనల్​గా తీసుకునే  చాన్స్​ ఉంది. దీనిని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే రిటైర్​ అయిన ఉద్యోగులు, టీచర్లకు వారి జీపీఎఫ్​ ఖాతాలో జమైన  మొత్తాన్ని  ఫైనల్​ పేమెంట్​గా చెల్లిస్తారు. 

కోట్లలో పెండింగ్​..

జడ్పీ పరిధిలో పనిచేసే చాలా మంది ఉద్యోగులు,  టీచర్లు ఆయా అవసరాల కోసం పార్ట్  ఫైనల్,  జీపీఎఫ్​ లోన్ల కోసం అప్లై  చేసుకుంటున్నారు. అలాగే రిటైర్డ్​ ఉద్యోగులు, టీచర్లు సైతం ఫైనల్ పేమెంట్​ కోసం అప్లై చేసుకొంటున్నారు.  పార్ట్​ఫైనల్,  జీపీఎఫ్​ లోన్,  ఫైనల్​మేమెంట్ ​కోసం  వచ్చిన అప్లికేషన్లను సంబంధిత సెక్షన్​ ఆఫీసర్లు పరిశీలించి వారి అర్హతలను బట్టి  శాంక్షన్​ ప్రొసిడింగ్ లు తయారుచేసి చెక్​ రాసి  ట్రెజరీకి పంపుతారు. అక్కడ వాటిని అప్రూవ్​ చేసి శాంక్షన్​ అయిన అమౌంట్​ను సంబంధిత ఉద్యోగి, టీచర్​ పర్సనల్​ బ్యాంక్​ అకౌంట్​లో జమ చేస్తారు. అయితే కొన్ని నెలలుగా ఉద్యోగులు, టీచర్లకు సంబంధించిన పార్ట్​ ఫైనల్​,  జీపీఎఫ్ లోన్​,  ఫైనల్​ పేమెంట్​ పెండింగ్​లో ఉన్నాయి.  జడ్పీ ఆఫీసుల నుంచి శాంక్షన్​ ప్రొసిడింగ్​లు వెళ్లినప్పటికీ ప్రభుత్వ ఆంక్షల కారణంగా ట్రెజరీల్లో పెండింగ్ ఉన్నాయి.  కొందరివి ఆరు నెలలు, మరి కొందరివి ఏడాది నుంచి పెండింగ్​ ఉండగా, ఇంకొందరివి ఏడాదిన్నరగా పెండింగ్​ ఉన్నాయి.  ఉదాహరణకు ఉమ్మడి మెదక్  జిల్లాలో  వందలాది మంది ఉద్యోగులు, టీచర్లకు సంబంధించి దాదాపు రూ.40 కోట్లు పెండింగ్​ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్నిజిల్లాల్లో కలిపి రూ.300 కోట్లకు పైగానే  పెండింగ్​ ఉన్నట్టు తెలిసింది.  జీపీఎఫ్​ లోన్లు,  పార్ట్​ఫైనల్​ అమౌంటే  కాకుండా,  జీపీఎఫ్​ ఖాతాదారులు మరణిస్తే  కుటుంబ సభ్యులకు బూస్టర్​ స్కీం పేరుతో రూ.20 వేలు చెల్లించాల్సి ఉండగా అవి కూడా ఇవ్వడం లేదంటున్నారు. 

డిమాండ్లు ఇవీ..

జీపీఎఫ్​పై ఉన్న  ఆర్థిక ఆంక్షలు తొలగించి పెండింగ్​లో  ఉన్న  జీపీఎఫ్​లోన్లు, పార్ట్​ ఫైనల్​ క్లియర్​ చేయాలని, 2006 –- 07 నుంచి 2021– 22 వరకు జడ్పీ జీపీఎఫ్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.2,741 కోట్ల వడ్డీ బకాయిలు వెంటనే రిలీజ్​ చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీ జీపీఎఫ్ ఖాతాల్లో మిస్సింగ్ క్రెడిట్ గా ఉన్న దాదాపు రూ.1,000 కోట్లను సరిచేసి ఉద్యోగ, టీచర్ల ఖాతాల్లో జమ చేయాలని, 2006 నుంచి 2013 వరకు ఉద్యోగ,  టీచర్లకు బూస్టర్ స్కీం బకాయిలు రిలీజ్​ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవే డిమాండ్లతో తెలంగాణ ప్రోగ్రెసివ్​ టీచర్స్​ ఫెడరేషన్​ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీ ఆఫీసుల ముందు ఆందోళన నిర్వహించనున్నారు.

ఏడాదిన్నరగా పెండింగ్​

నేను అత్యవసరమై 2022 ఫిబ్రవరిలో జీపీఎఫ్​ లోన్​ కోసం అప్లై చేశా. రూ.2 లక్షలు శాంక్షన్​ అయ్యాయి.  కానీ ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు డబ్బులు చేతికందలేదు. నా చెక్​ ట్రెజరీలోనే  పెండింగ్​ ఉంది.  ఎప్పుడు క్లియర్​ అవుతుందో అర్థం కావడం లేదు. 
- వెంకటస్వామి, టీచర్​, యూపీఎస్​ జీడిపల్లి, మెదక్​

జమ చేసుకున్న పైసలు ఇయ్యరా?

ఎమర్జెన్సీ టైంలో అక్కరకు వస్తాయని ఉద్యోగులు, టీచర్లు నెల నెలా వారి జీతంలో నుంచి జీపీఎఫ్​లో జమ చేసుకున్న పైసలు ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణం. అవసరమైనపుడు జీపీఎఫ్​లోన్​, పార్ట్​ ఫైనల్​ తీసుకునే అవకాశం ఉన్నా,  ప్రభుత్వం ఆంక్షలు పెట్టి అందకుండా చేస్తోంది. దీనివల్ల ఉద్యోగులు, టీచర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
- వెంకట్రామ్​ రెడ్డి, టీపీటీఎఫ్​, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి