శిథిలావస్థలో కార్యాలయం.. హెల్మెట్ ధరించి పనిచేస్తున్న ఉద్యోగులు

శిథిలావస్థలో కార్యాలయం.. హెల్మెట్ ధరించి పనిచేస్తున్న ఉద్యోగులు

ఉత్తర ప్రదేశ్‌: ఉద్యోగ భద్రత కోసం జనం సర్కార్ నౌకరీ ని ఎంచుకున్నా.. వారు పని చేసే కార్యాలయాల్లో మాత్రం ఎలాంటి భద్రత లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పై అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని వినూత్నంగా నిరసన తెలిపారు   బండాలోని విద్యుత్ శాఖ అధికారులు.

ఉత్తర ప్రదేశ్‌ లోని బండా ప్రాంతంలో ఉన్న విద్యుత్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. ప్రమాదకరంగా మారిన ఆ బిల్డింగ్ గురించి అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  తాము శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నామని.. ఏదైనా జరగరానిది జరుగుతుందోమోనన్న భయంతో ఇలా హెల్మెట్లు ధరించామని వారు చెబుతున్నారు. ఏ సమయంలో పైకప్పు కూలి మీద పడుతుందోనని, తమను తాము రక్షించుకోవడానికి ముందు జాగ్రత్తగా హెల్మెట్ ధరించామని వారు అంటున్నారు.

ప్రస్తుతం అక్కడి పని పరిస్థితుల గురించి ఒక ఉద్యోగి మాట్లాడుతూ.. తాను రెండు సంవత్సరాల క్రితం ఈ ఆఫీస్ లో ఉద్యోగంలో చేరానని, అప్పటి నుండి బిల్డింగ్ అదే పరిస్థితిలో ఉందని చెప్పారు. బిల్డింగ్ కూలిపోయే దశ గురించి అధికారులకు సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.