కొలువులకు సర్కారు బ్యాంకులే ఇష్టం

కొలువులకు సర్కారు బ్యాంకులే ఇష్టం

వెలుగు బిజినెస్​ డెస్క్​: ఓవైపు ఉద్యోగుల వలసలతో ప్రైవేటు బ్యాంకులు సతమతమవుతుంటే, మరో వైపు కొత్తగా కొలువులలో చేరాలనుకునే వారు సర్కారీ బ్యాంకులనే ఇష్టపడుతున్నారు. పనిచేసే చోట వత్తిడి తక్కువగా ఉండాలని, జీతం మాత్రం ఒకింత ఎక్కువగా ఉండాలని జాబ్స్​లో చేరాలనుకునే కేండిడేట్లు ఆలోచిస్తున్నారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, కొటక్​ మహీంద్రా బ్యాంక్​ వంటి ప్రైవేటు రంగ బ్యాంకులలో 34 నుంచి 50 శాతం మంది ఉద్యోగులు వలసపోతున్నారు.  మరోవైపు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, బ్యాంక్​ ఆఫ్​ బరోడా, పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, కెనరా బ్యాంక్​ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఉద్యోగుల వలస 5 శాతం మాత్రమే.

ఎస్​బీఐలో వలస 3 శాతమే...

దేశంలోనే అతి పెద్ద బ్యాంకయిన స్టేట్ బ్యాంక్​లో ఉద్యోగుల వలస (రిజిగ్నేషన్లు, రిటైర్​మెంట్లు, వీఆర్​ఎస్​) కలిపి కేవలం మూడు శాతమే. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాకు మొత్తం 2.50 లక్షల మంది ఉద్యోగులున్నారు. రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ మెరుగ్గా ఉండటంతోపాటు, రెగ్యులర్​ ట్రెయినింగ్​ అండ్​ డెవలప్​మెంట్​ చొరవ వల్లే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉద్యోగుల వలసను అడ్డుకోగలుగుతున్నాయని ఎస్​బీఐ చైర్మన్​ దినేష్​ ఖారా చెప్పారు. ప్రభుత్వ బ్యాంకులలో చేరే ఉద్యోగులు అప్పటికే తమ జాబ్​ విషయంలో ఒక క్లారిటీతో ఉంటారని,  రిక్రూట్​మెంట్​ ప్రాసెసే దానికి కారణమని పేర్కొన్నారు. 

ప్రైవేటు రంగ బ్యాంకులలో పద్ధతులు ఇలా ఉండవని చెప్పారు. అంతేకాదని, తమ బ్యాంకులోని ఉద్యోగులకు ఎప్పటికప్పుడు స్కిల్స్​ అప్​గ్రెడేషన్​కోసం ట్రెయినింగ్​ అండ్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తామని, ప్రైవేటు బ్యాంకులు ఈ విషయంలో వెనకబడ్డాయని వివరించారు. గత ఫైనాన్షియల్​ ఇయర్లో కెనరా బ్యాంకులో ఉద్యోగుల వలస 4.26 శాతమైతే, బ్యాంక్​ ఆఫ్​ బరోడా, పంజాబ్​ నేషనల్​ బ్యాంకులలో అది 1 శాతం లోపే. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే ఎంట్రీ, మిడ్​లెవల్​ జాబ్స్​లో  జీతాలు ప్రభుత్వ రంగ బ్యాంకులలోనే మెరుగ్గా ఉంటున్నాయి.

కొత్త ఆఫీసర్​ జీతం 60-80 వేలు...

ప్రభుత్వ రంగ బ్యాంకులలో కొత్తగా జాయినయే ఆఫీసర్​కు నెలకు రూ. 60 నుంచి 80 వేల దాకా జీతం వస్తుందని, ప్రైవేటు సెక్టార్​ బ్యాంకులలోనైతే ఇందులో 30 –40 శాతమే జీతంగా ఉంటుందని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు సీఈఓ వెల్లడించారు. మిడ్​లెవెల్​దాకా జీతాలు ఇలాగే కొనసాగుతాయని, కానీ ఆ తర్వాత లెవెల్స్​లో మాత్రం ప్రైవేటు రంగ ఉద్యోగులకే ఎక్కువ జీతాలు ఉంటాయని పేర్కొన్నారు. హౌసింగ్​, పెన్షన్​, ఈజీ వర్క్​ హవర్స్​..జీతాలు మాత్రమే కాకుండా, హౌసింగ్​, పెన్షన్​, ఈజీ వర్క్​ హవర్స్​ వంటి సదుపాయాలు కూడా ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకులను అట్టేపెట్టుకుని ఉండటానికి మరో  ప్రధాన కారణం.

పెరుగుతున్న  ప్రైవేటు బ్యాంకు బ్రాంచీలు..

గత రెండేళ్లలో చూస్తే దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకులు తమ బ్రాంచీలను పెంచుతున్నాయి. దీంతో ఉద్యోగులకు డిమాండ్​ పెరిగిందని, ఉద్యోగుల వలస బెడద ఎక్కువడానికి ఇదే ప్రధానమైన కారణమని యాక్సిస్​ బ్యాంక్​ హెచ్​ ఆర్​ హెడ్​ రాజ్​కమల్​ వెంపటి చెప్పారు. ప్రైవేటు బ్యాంకులలోని 70 శాతం మంది ఫ్రంట్​లైన్​ ఉద్యోగులు ఒక బ్యాంకు నుంచి మరో దానికి మారుతున్నారని అన్నారు. సేల్స్​, సర్వీస్​, కాల్​ సెంటర్​, కలెక్షన్స్​ వంటి ఉద్యోగాలలో వలస ఎక్కువగా ఉందని, మిడ్​లెవెల్​, సీనియర్​ లెవెల్​లో వలసలు తక్కువేనని కొటక్​ మహీంద్రా బ్యాంక్​ స్పోక్స్​పర్సన్​ వెల్లడించారు. ప్రైవేటు బ్యాంకులలోని వర్క్​కల్చర్​ కొంత కఠినంగా ఉండటం వల్లే ఉద్యోగుల వలసలు ఎక్కువవుతున్నాయని హెచ్​ఆర్​ కన్సల్టెంట్లు అభిప్రాయపడుతున్నారు.