పోచారంలో లేఅవుట్ వేసినోళ్లే కబ్జా చేసిన్రు

పోచారంలో  లేఅవుట్  వేసినోళ్లే కబ్జా చేసిన్రు
  • విలువ రూ.30 కోట్ల పైమాటే

ఘట్​కేసర్, వెలుగు: మేడ్చల్ మల్కాజిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని చౌదరిగూడ డాక్టర్స్ కాలనీలో 4 వేల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ.30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 1985లో 26.9 ఎకరాల్లో 500 ప్లాట్లతో లేఅవుట్ వేసిన భూ యజమానులే ఇక్కడే కబ్జాలకు పాల్పడడం గమనార్హం. దీనిపై వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

లేఅవుట్ వేసినప్పుడు 4 వేల గజాల స్థలాన్ని పార్కుగా చూపించారు. అయితే భూ యజమానుల కుటుంబ సభ్యుల్లోని ఆముదాల నరసింహ కొడుకు ఆముదాల రమేశ్ తప్పుడు డాక్యుమెంట్స్ తో 4 వేల గజాలను 800 గజాల చొప్పున 5 ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మాడు. కులకర్ణి వాటిని 200 గజాల చొప్పున 20 ప్లాట్లుగా చేసి రాజేశ్, సోమాని తోపాటు పలువురికి అమ్మేశారు.

 ఈ విషయమై కాలనీ వాసులు మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినా, హైకోర్టుకు వెళ్లిన దశాబ్దాలుగా సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో సెప్టెంబరులో హైడ్రాను ప్రతినిధులు ఆశ్రయించారు. దీంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. పార్కు స్థలంగా నిర్ధారించుకున్న తర్వాత శుక్రవారం ఆక్రమణలు తొలగించారు. 4 వేల గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.

శంషాబాద్: శంషాబాద్ మండలం సంఘీగూడ వద్ద ఓఆర్ఆర్ అండర్ పాస్​ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం పరిశీలించారు. ఇటీవల ఈ అండర్​పాస్ ​వద్ద భారీగా వరద నీరు నిలిచి, కార్లు, బస్సులు చిక్కుకున్నాయి. దీనిపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేయగా,  చిన్న గోల్కొండ చెరువు, అండర్ పాస్ ప్రాంతాలను సందర్శించారు. అతి త్వరలో సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.