రోడ్లేసేందుకు ఫండ్స్​ ఉన్నా..కాంట్రాక్టర్లు ముందుకొస్తలేరు.!

రోడ్లేసేందుకు ఫండ్స్​ ఉన్నా..కాంట్రాక్టర్లు ముందుకొస్తలేరు.!
  • బిల్లుల్లో డిలే వల్ల.. లాస్​ అవుతున్నామంటూ మెనుకడుగు
  •  ఏడేనిమిదిసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలే.. 
  •  మెదక్​ జిల్లాలో నిధులు మంజూరైనా జరగని పనులు
  •   స్థానికులకు తప్పని తిప్పలు 

మెదక్ (నిజాంపేట, శివ్వంపేట), వెలుగు : మెదక్​ జిల్లాలో అధ్వానంగా మారిన పలు రోడ్ల  రిపేర్లకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసింది. ఈ పనులు చేపట్టేందుకు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు రావడం లేదు. రోడ్లు వేసిన తర్వాత ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుండటంతో కొత్తగా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. కొన్ని రోడ్ల పనులకైతే ఏడేనిమిది సార్లు టెండర్లు పిలిచినా  ఒక్కరు కూడా టెండర్​ దాఖలు చేయలేదు. దీంతో స్థానిక ప్రజలకు, వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.

ఇదీ.. రోడ్ల పరిస్థితి

 శివ్వంపేట మండలం అనంతారం చౌరస్తా నుంచి చంది వరకు 10 కిలో మీటర్లు, ఏదులాపూర్ చౌరస్తా నుంచి పోతులగూడ వరకు 8 కిలోమీటర్లు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ రెండు రూట్లలో ఉన్న ఎనిమిది గ్రామాల ప్రజలు రోడ్డు చెడిపోయి  ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ రూట్​లో వెల్దుర్తి నుంచి బాలానగర్ వరకు ఆర్టీసీ బస్సు నడిచేది. రోడ్డు పూర్తిగా డామేజీ కావడంతో బస్సు రద్దయింది. దీంతో ఆయా గ్రామాల నుంచి రోజూ కూరగాయలు, పాలు నర్సాపూర్, తూప్రాన్, హైదరాబాద్ తీసుకెళ్లే రైతులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎట్టకేలకు ఈ రోడ్డు అభివృద్ధికి ఏడాది కింద రూ.37 కోట్లు మంజూరయ్యాయి. కానీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. 

 నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్, నగరం, నందగోకుల్, రాంపూర్ గ్రామాలకు వెళ్లే రోడ్డుపై గుంతలు పడి అధ్వానంగా తయారైంది. నిజాంపేట నుంచి రాంపూర్ వరకు ఉన్న ఏడు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా డామేజీ అయ్యింది. గతేడాది జూలై 23న కామారెడ్డి జిల్లా చందాపేట గ్రామానికి చెందిన చాకలి శ్రీహరి (24) నస్కల్ గ్రామానికి వచ్చి బైక్ మీద తిరిగి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంత కారణంగా ఎదురుగా వస్తున్న కారుని ఢీకొని మృతి చెందాడు. నందగోకుల్, నగరం, నస్కల్, రాంపూర్ గ్రామాల వారు చీకట్లో ఈ రూట్ లో వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ రోడ్డు  రిపేరు కోసం ఏడాది కిందట రూ.1.40 కోట్లు మంజూరయ్యాయి. ఇంజనీరింగ్ డిపార్ట్​మెంట్​ టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు మొదలు కాలేదు. 

 కౌడిపల్లి మండలంలో రెండు రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. మెదక్– హైదరాబాద్​ నేషనల్​ హైవే నుంచి తిమ్మాపూర్, కుషన్​గడ్డ తండా, జాజి తండా, రాజిపేట  వరకు ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ రూట్లో ఎనిమిది కిలోమీటర్ల దూరం రీ బీటీ చేసేందుకు రూ.3.15 కోట్లు మంజూరయ్యాయి. కౌడిపల్లి నుంచి దేవులపల్లి వరకు ఉన్న రోడ్డు డామేజీ కావడంతో రీ బీటీ కోసం రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. అయితే నిధులు మంజూరై ఏడాది కావస్తున్నా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రోడ్ల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్టుగా ఉంది. ఈ రోడ్ల పనులకు గాను పంచాయతీరాజ్​ శాఖ అధికారులు మూడు సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. 

ఎనిమిదిసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ రాలే  

అనంతారం , నవాపేట రోడ్డు రిపేర్ల కోసం ఎస్టిమేషన్​ వేసి ప్రభుత్వానికి ప్రపోజల్ ​పంపాం. రూ.37 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. భాస్కర్​, పీఆర్​ ఏఈ, శివ్వంపేట

కాంట్రాక్టర్లు ముందుకొస్తే రోడ్లేస్తాం.. 

నిజాంపేట–నస్కల్​ రోడ్డు కోసం రూ.1.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు టెండర్​ పిలిచాం. కానీ కాంట్రాక్టర్లు రెస్పాండ్ కావడం లేదు. రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తే వెంటనే పనులు ప్రారంభిస్తాం. – విజయ్​ కుమార్​, పీఆర్​ ఏఈ, నిజాంపేట