ఇంజినీరింగ్​ ఫీజులపెంపు సరి కాదు

ఇంజినీరింగ్​ ఫీజులపెంపు సరి కాదు

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి ఫీజు పెంపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జవహర్‌‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంకి అనుబంధంగా ఉన్న అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ట్యూషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలు దాఖలు చేసిన నేపథ్యంలో, ప్రస్తుతం ఈ వ్యవహారం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు కారణమవుతోంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీ అయిన TAFRC కి కొన్ని కళాశాలలు సమర్పించిన డేటా ప్రకారం, ఫీజుల పెంపు శాతం గణనీయంగా ఉంది. కొన్ని ముఖ్యమైన కళాశాలల్లో చూస్తే రూ. 50,000 వరకూ పెంపు ప్రతిపాదనలు ఉన్నాయి. 

ఈ పెంపు విద్యార్థులపై మోపే భారం గణనీయమైనది. మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు ఇది అసహనంగా మారుతుంది. ఇంజినీరింగ్ చదువు కోసం విద్యార్థులు అప్పుల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. ఇదే కొనసాగితే, చదువు మానేయాల్సిన దాకా దిగజారవచ్చు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, కొన్ని కళాశాలలు ఫీజుల పెంపును సమర్థించేందుకు TAFRCకి తప్పుడు ఆడిట్ నివేదికలు సమర్పిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆట ఆడటమే కాకుండా, నైతికతకు విరుద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న  ఫీ రీయింబర్సుమెంట్ గతంలో ఉండే ఫీజులకు అనుగుణంగా రూ. 35,000గా ఉంది. ప్రస్తుతం ఫీజులు రెట్టింపు అయ్యే అవకాశమున్న నేపథ్యంలో, అదే మొత్తం కొనసాగితే విద్యార్థులపై మిగిలే భారం తీవ్రంగా ఉంటుంది. . ఫీజుల పెంపు జరిగితే, రీయింబర్సుమెంట్ మొత్తాన్ని సవరించాల్సిన అవసరం ఉంటది. ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వం పారదర్శకంగా  సమతుల్యమైన నిర్ణయం తీసుకోవాలి. విద్య అనేది సమాజ భవిష్యత్తుకు దోహదపడే అంశం.

- రిషి మలిశెట్టి,
జేఎన్టీయూ విద్యార్థి