ఎక్కడ నుంచైనా ఎగ్జామ్స్ రాయొచ్చు.. దిక్కులు చూస్తే వార్నింగ్..

ఎక్కడ నుంచైనా ఎగ్జామ్స్ రాయొచ్చు.. దిక్కులు చూస్తే వార్నింగ్..
  • వచ్చే నెల 14 నుంచి ఇంజినీరింగ్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు
  • తొలిసారి ఏఐ టెక్నాలజీ​ వాడకం.. జేఎన్టీయూ ఏర్పాట్లు
  • ల్యాప్​టాప్ లేదా సెల్​ఫోన్ కెమెరా ద్వారా మానిటరింగ్
  • అటూ ఇటు చూస్తే వార్నింగ్.. ఎక్కువ సార్లయితే సాఫ్ట్ వేర్ ఆఫ్

హైదరాబాద్, వెలుగు: కరోనా కాలంలో పరీక్షల నిర్వహణపై జేఎన్టీయూహెచ్ ​కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల14 నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈసారి స్టూడెంట్లు ఎక్కడి నుంచైనా పరీక్షలు రాసే వెలుసుబాటు కల్పించింది. తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి, పరీక్షలను మానిటరింగ్ చేయనుంది. దీనికి సంబంధించి వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నెలన్నర ముందే ఎగ్జామ్స్..
కరోనా సెకండ్​వేవ్​తో 2020–21 అకడమిక్ ఇయర్ అస్తవ్యస్థమైంది. జేఎన్టీయూ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో ఇంజినీరింగ్, ఫార్మసీ ఫైనలియర్ ఫైనల్ సెమిస్టర్​పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఫారిన్ వర్సిటీల్లో అడ్మిషన్లు, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో వివిధ కంపెనీల్లో జాబ్స్​కు సెలెక్ట్ అయిన వారికి ఇబ్బందులు ఉంటాయని స్టూడెంట్స్ షెడ్యూల్ మార్చాలని వర్సిటీ అధికారులను కోరారు. దీంతో సర్కారు అనుమతితో పరీక్షలను నెలన్నర ముందుకు మార్చారు. జూన్14 నుంచి పది రోజుల పాటు బీటెక్, బీఫార్మసీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించారు.ఈ ఎగ్జామ్​టైమ్ కూడా 3 గంటల నుంచి 2 గంటలకు కుదించడంతో పాటు క్వశ్చన్ల వాల్యూమ్​ను తగ్గించారు. అయితే కరోనా కేసులు ఇంకా పెరుగుతుండటం, లాక్​డౌన్ తో పరీక్షల నిర్వహణపై స్టూడెంట్లలో ఆందోళన పెరిగింది. దీంతో జేఎన్టీయూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టింది.

పేపర్,​పెన్నుతోటే..
జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో బీటెక్, బీఫార్మసీ ఫైనలియర్ స్టూడెంట్లు సుమారు 40 వేల మంది వరకు ఉంటారు. వీరికి ఒకేసారి పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో స్టూడెంట్లు కాలేజీలకు వచ్చి పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో, ఎక్కడి నుంచైనా ఎగ్జామ్ రాసుకునే అవకాశమివ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. అయితే ఆన్​లైన్​లో కాకుండా, పేపర్,పెన్ను ద్వారానే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసే రెండు గంటల పాటు ల్యాప్​టాప్ లేదా సెల్​ఫోన్ కెమెరాలో పరీక్ష రాసే స్టూడెంట్ కనిపించేలా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసే వారిని వర్సిటీ తయారు చేయించిన సాఫ్ట్​వేర్​ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. ఏఐతో అనుసంధానమైన ఆ సాఫ్ట్ వేర్ స్టూడెంట్లు పరీక్ష రాసే సమయంలో అటూ ఇటు చూస్తే పలుమార్లు హెచ్చరికలు చేయనుంది. స్టూడెంట్లు ఎక్కువ సార్లు ఈ తప్పిదం చేస్తే సాఫ్ట్ వేర్ ఆఫ్ అయిపోతుంది. దీంతో అతని పరీక్ష టైమ్ పూర్తయినట్టు లెక్క.. అయితే ప్రతి 20 మంది స్టూడెంట్లకు ఓ ఇన్విజిలేటర్ మానిటరింగ్ చేస్తారు. పరీక్ష రాసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఒక కాలేజీ  లెక్చరర్​ను, మరో కాలేజీ స్టూడెంట్లకు ఇన్విజిలేషన్ చేసేలా పరీక్షల విభాగం అధికారులు డ్యూటీలు వేయనున్నారు. పరీక్ష టైమ్ పూర్తయిన పది నిమిషాల్లో ఆ పేపర్లను ఫొటో తీసి, పీడీఎఫ్ రూపంలో పంపించాల్సి ఉంటుంది. ఆన్ లైన్​లో ఏమైనా సమస్యలుంటే, మళ్లీ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే దీనిపై పలుమార్లు డెమో కూడా చేసి, పరీక్షించారు. సక్సెస్ కావడంతో ఫైనలియర్ వారికి దీన్ని అమలు చేయనున్నారు.