ఆఖరి ఫైట్‌‌కు.. ఇంగ్లండ్, పాకిస్తాన్‌‌ రెడీ

ఆఖరి ఫైట్‌‌కు..  ఇంగ్లండ్, పాకిస్తాన్‌‌ రెడీ

కోల్‌‌కతా: వరల్డ్‌‌ కప్‌‌లో ఇంగ్లండ్, పాకిస్తాన్‌‌ ఆఖరి ఫైట్‌‌కు రెడీ అయ్యాయి. అద్భుతం జరిగితే తప్ప సెమీస్‌‌కు చేరే చాన్స్‌‌ లేని పాక్‌‌.. ఇంగ్లండ్‌‌ చాంపియన్స్‌‌ ట్రోఫీ ఆశలను వమ్ము చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య శనివారం కీలక పోరు జరగనుంది. న్యూజిలాండ్‌‌తో పోలిస్తే నెట్‌‌ రన్‌‌రేట్‌‌లో భారీగా వెనకబడి ఉన్న పాక్‌‌.. సెమీస్‌‌ చేరాలంటే దాదాపుగా 287 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌పై గెలవాలి. 

ఒకవేళ ఛేజింగ్‌‌కు దిగితే 284 బాల్స్‌‌ మిగిలి ఉండగానే విజయం సాధించాలి. ఈ రెండు సమీకరణాల్లో ఏదో ఒకదాన్ని పాక్‌‌ అధిగమిస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించడం లేదు. అయితే స్వదేశంలో వచ్చే విమర్శలకు అడ్డుకట్ట వేయాలంటే కనీసం ఈ మ్యాచ్‌‌లో గెలిచి కాస్త ఊరట చెందాలని బాబర్‌‌ బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఆఖరి చాన్స్‌‌ కావడంతో పాక్‌‌ బ్యాటర్లు, బౌలర్లు సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. 

ఇక డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ హోదాలో టోర్నీ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌‌ పేలవ ఆటతీరుతో బొక్కబోర్లా పడింది. కనీసం పాయింట్ల పట్టికలో టాప్‌‌–8లో చోటు సంపాదించి చాంపియన్స్‌‌ ట్రోఫీకి అర్హత సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నది. శ్రీలంక, బంగ్లాదేశ్‌‌ నుంచి పోటీ ఉండటంతో ఈ మ్యాచ్‌‌లో గెలిచి బెర్త్‌‌ను కన్ఫామ్‌‌ చేసుకోవాలని భావిస్తోంది. మరి నిఖార్సైన ఆల్‌‌రౌండర్లతో కూడిన టీమ్‌‌ ఆఖరి మ్యాచ్‌‌లో ఎలా ఆడుతుందో చూడాలి.