భీకర ఫాంలో ఉన్న ఇంగ్లాండ్ను పాక్ ఓడిస్తుందా?.

భీకర ఫాంలో ఉన్న ఇంగ్లాండ్ను పాక్ ఓడిస్తుందా?.

నెలరోజుల పాటు అలరించిన టీ-20 వరల్డ్ కప్ తుది సమరానికి చేరుకుంది. ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరిగే ఫైనల్లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా.... టీ-20 వరల్డ్ కప్ రెండోసారి నెగ్గిన జట్టుగా నిలుస్తోంది. అంతిమ సమరంలో గెలుపు కోసం ఇరుజట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. హోరాహోరిగా సాగుతుందని భావిస్తున్న ఫైనల్లో పాకిస్థాన్ జట్టు సెంటిమెంట్లను నమ్ముకుంటే.. ఇంగ్లండ్ జట్టు ప్రతిభపైనే ఆధారపడింది. ప్రస్తుతం ప్రపంచ కప్లో అదృష్టంకొద్ది ఫైనల్ వరకు వచ్చిన పాకిస్థాన్.. 1992 వన్డే వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవుతుందని భావిస్తోంది. పాక్ అంచనాలను తలకిందులు చేసేందుకు ఇంగ్లండ్ సమాయత్తం అవుతుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో నాసిరకమైన ప్రదర్శనతో నెట్టుకొచ్చిన పాకిస్థాన్.. ఫైనల్లో సూపర్ పర్ఫార్మెన్స్ చేసి కప్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.


 
భీకర ఫాంలో ఇంగ్లాండ్..
ఇంగ్లండ్ను ఓడించడం పాకిస్థాన్ కు అంత ఈజీ కాదని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఆ జట్టు ఈ టోర్నీలో సూపర్ ఫాంలో ఉంది. ఒక్క ఐర్లాండ్ చేతిలో పరాభవం తప్ప.... దాదాపు అన్ని మ్యాచులలో స్థాయికి దగ్గ ఆటను ఇంగ్లండ్ ప్రదర్శించింది. అదే ఫామ్ను బట్లర్ సేన కొనసాగిస్తే.... టైటిల్ దక్కించుకోవడం తేలికే అని చెప్తున్నారు. ఇంగ్లాండ్ జట్టులో అలెక్స్ హేల్స్, హ్యారీ బ్రూక్ కీలక ఇన్నింగ్స్ ఆడుతుండగా.... కెప్టెన్ జోస్ బట్లర్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు ప్రధాన బలంగా మారారు. భీకర ఫామ్లో ఉన్న ఓపెనర్ అలెక్స్ హేల్స్ మరోసారి చెలరేగితే పాక్ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరంటున్నారు. ఇటు బౌలర్లు కూడా రాణిస్తుండటం ఇంగ్లండ్కు కలిసొచ్చే అంశం. 

పాక్ విజృంభించేనా..?
ఈ టోర్నీలో పడుతూ లేస్తూ వచ్చిన పాకిస్థాన్....అనూహ్యంగా ఫైనల్కి చేరింది. గ్రూప్ దశలో భారత్, జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలవడంతో పాకిస్థాన్ నాకౌట్కు చేరుకుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్పై పాకిస్థాన్ ఘనవిజయం సాధించి ఫైనల్కి దూసుకెళ్లింది. టోర్నీ మొత్తం విఫలమైన పాక్ ఓపెనర్లు... న్యూజిలాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో ఫామ్లోకి వచ్చారు. బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్లు ఫైనల్లో రాణిస్తే.... ఇంగ్లండ్కు టఫ్ ఫైట్ తప్పదని అంటున్నారు. బౌలింగ్లోనూ పాక్ బలంగా కనిపిస్తోంది. షాహీన్ అఫ్రీదీ, నసీం షా నిలకడగా రాణిస్తుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఆల్ రౌండర్ నవాజ్, షాదాబ్ ఖాన్లతో పాటు....యువసంచలనం హరీస్ అహ్మద్ భారీ షాట్లు ఆడితే ఇంగ్లండ్కు తిప్పలు తప్పవంటున్నారు.