
క్రైస్ట్‌చర్చ్: ఐదుసార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న డానియెల్ వ్యాట్ (129) సూపర్ సెంచరీకి తోడు సోఫీ ఎకిల్‌స్టోన్ (6/36) ఆరు వికెట్లతో విజృంభించడంతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ విమెన్స్ టీమ్ వన్డే వరల్డ్ కప్‌లో మరోసారి ఫైనల్ చేరుకుంది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లిష్ టీమ్ 137 రన్స్ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 293/8 స్కోరు చేసింది. వ్యాట్‌తో పాటు సోఫియా డంక్లే (60) రాణించింది. వ్యాట్ ఇచ్చిన ఐదు క్యాచ్‌లను వదిలేసిన సఫారీ టీమ్ మూల్యం చెల్లించుకుంది. అనంతరం ఎకిల్‌స్టోన్ దెబ్బకు ఛేజింగ్‌లో సౌతాఫ్రికా.. 38 ఓవర్లలో 156 రన్స్‌కే ఆలౌటై ఓడిపోయింది. డుప్రెజ్ (30) టాప్ స్కోరర్. వ్యాట్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తొలి సెమీస్‌లో నెగ్గిన ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆదివారం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది.