ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలే.. తీరా చూస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్

ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలే.. తీరా చూస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్

ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సాల్ట్ ఏకంగా రెండు సెంచరీలు బాదాడు. 185.96 స్ట్రైక్ రేట్‌తో 331 పరుగులు చేశాడు. దీంతో ఏకంగా 18 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. పది రోజుల క్రితం దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఈ బ్యాటర్ అమ్ముడుపోకపోవడం గమనార్హం. 

సూరీడిదే అగ్రస్థానం

ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్(887 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మహమ్మద్ రిజ్వాన్, ఐడెన్ మార్క్రామ్, బాబర్ ఆజం వరుసగా మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నారు. భారత క్రికెటర్లలో రుతురాజ్ గైక్వాడ్(8వ స్థానం) ఒక్కడే టాప్ 10లో చోటు సంపాదించాడు.

రవి బిష్ణోయ్

ఇక టీ20 బౌలర్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్(726 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, భారత యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాడు రీస్ టాప్లీ ఒక్కడే టాప్ 10లో ఉన్న ఫాస్ట్ బౌలర్.