ఇద్దరూ కలిసి వెయ్యి వికెట్లు తీశారు

ఇద్దరూ కలిసి వెయ్యి వికెట్లు తీశారు

ఇంగ్లాండ్ పేసర్లు స్టువర్ట్  బ్రాడ్, జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించారు. ఉమ్మడిగా 133 టెస్టులాడి..వెయ్యి వికెట్లు పడగొట్టిన జంటగా చరిత్ర సృష్టించారు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో వీరిద్దరు కలిసి వెయ్యి వికెట్లు తీసిన బౌలర్లుగా రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో జంటగా వెయ్యి వికెట్లు తీసిన పేస్ ద్వయం వీరిద్దరే కావడం విశేషం. కివీస్ తో జరిగిన ఫస్ట్ టెస్టులో బ్రాడ్, అండర్సన్ కలిసి 12 వికెట్లు పడగొట్టారు. దీంతో ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 133 టెస్టుల్లో 1009 వికెట్లు దక్కించుకోవడం విశేషం. 

ఫస్ట్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ద్వయం 

అండర్సన్, బ్రాడ్ కంటే ముందు టెస్టుల్లో ఉమ్మడిగా వెయ్యి వికెట్లు సాధించిన జంటగా ఆస్ట్రేలియాకు చెందిన మెక్‌గ్రాత్‌, షేన్‌వార్న్‌ ద్వయం నిలిచింది.  వీరిద్దరు కలిసి టెస్టుల్లో 1001 వికెట్లు దక్కించుకున్నారు. అయితే వీరిలో మెక్ గ్రాత్ పేసర్ కాగా... వార్నర్  స్పిన్నర్. వీరి తర్వాత టెస్టుల్లో శ్రీలంక పేస్ బౌలర్ చమిందా వాస్, దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉమ్మడిగా 95 టెస్టుల్లో 895 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత వెస్టిండీస్ పేస్ ద్వయం అంబ్రోస్, వాల్ష్ 95 టెస్టుల్లో 762 వికెట్లు తీశారు. ప్రస్తుతం ఆడుతున్నవారిలో ఆసీస్ పేసర్ స్టార్క్, స్పిన్నర్ లయన్ 73 టెస్టుల్లో 580 వికెట్లు దక్కించుకున్నారు. ఇందులో వెస్టిండీస్ పేస్ ద్వయం అంబ్రోస్, వాల్ష్ మాత్రమే ఫాస్ట్ బౌలర్లు కాగా వీరు ఎప్పుడో రిటైర్ అయ్యారు. కానీ జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ పేస్ ద్వయం ఇంకా ఆడుతూనే ఉండటం గమనార్హం.

338 టెస్టుల్లో 1,253 వికెట్లు..

2004లో జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ 2007లో  ఎంట్రీ ఇచ్చాడు. అండర్సన్ ఇప్పటివరకు 178 టెస్టులు ఆడి 682 వికెట్లు దక్కించుకున్నాడు. బ్రాడ్ 160 మ్యాచ్ ల్లో 571 వికెట్లు తీశాడు. మొత్తం కలిపి 1,253 వికెట్లు సొంతం చేసుకున్నారు.  


సచిన్ రికార్డు బద్దలవుతుందా..?

టెస్టుల్లో ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌లు ఆడింది కేవలం సచిన్ టెండూల్కర్ మాత్రమే. సచిన్ తన కెరీర్ లో 200 టెస్టులు ఆడాడు. అయితే ఈ రికార్డును అండర్సన్ బద్దలు కొట్టే ఛాన్సుంది.  ప్రస్తుతం అండర్సన్ 178 టెస్టులాడాడు. 200వ టెస్టుకు ఇంకో 22 టెస్టుల దూరంలో ఉన్నాడు.  అతను కనీసం ఇంకో రెండు మూడేళ్లు ఆడే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన అండర్సన్200 టెస్టులు దాటేలా ఉన్నాడు.