గువాహటి: ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో నాకౌట్ వార్‌కు సర్వం సిద్ధమైంది. అంచనాలు అందుకుంటూ ముందుకొచ్చిన ఇంగ్లండ్, సౌతాఫ్రికా బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇంగ్లండ్ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచి ఐదో ట్రోఫీపై గురి పెట్టగా.. తొలిసారి సెమీస్ చేరిన సఫారీ టీమ్ ఫైనల్ చేరాలని భావిస్తోంది. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తమ బలహీనతను సరిదిద్దుకొని ఇంగ్లిష్ టీమ్ పని పట్టాలని ఆశిస్తోంది.
నాకౌట్ దశకు చేరుకునే క్రమంలో సౌతాఫ్రికా రెండు భారీ ఓటములను చవిచూసింది. ఈ రెండు సందర్భాల్లోనూ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆ టీమ్ బ్యాటింగ్ తడబడింది. తమ తొలి మ్యాచ్‌లో 69 రన్స్‌కే ఆలౌటైన సఫారీలు.. ఆ తర్వాత న్యూజిలాండ్, ఇండియాపై గెలిచినా, లీగ్ దశలో ఆస్ట్రేలియాపై 97 రన్స్ కే కుప్పకూలడం ఆ టీమ్ స్పిన్ వీక్‌నెస్‌ను మరోసారి స్పష్టం చేసింది.
ఈ బలహీనతను మరోసారి సొమ్ము చేసుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఆ జట్టు స్పిన్ త్రయం సోఫీ ఎకిల్‌స్టోన్, లిన్సీ స్మిత్, చార్లీ డీన్ సఫారీ బ్యాటర్లను కట్టడి చేయాలని చూస్తున్నారు. అయితే, తమ చివరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయమైన ఎకిల్‌స్టోన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు, సౌతాఫ్రికా తరఫున కెప్టెన్ లారా వోల్‌వార్ట్ ఏడు మ్యాచ్‌ల్లో 50.16 సగటుతో 301 రన్స్ చేసి టీమ్‌ను ముందుండి నడిపించింది. అయితే, ఆమె మినహా తజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మరిజేన్ కాప్ వంటి కీలక బ్యాటర్లు నిలకడగా రాణించకపోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
ఇంగ్లండ్‌లోనూ సమస్యలు
టోర్నీ ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా వెంటనే పుంజుకున్న ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసంతో సెమీస్‌కు చేరుకుంది. ఇదే గ్రౌండ్‌లో లీగ్ దశలో సఫారీలపై 10 వికెట్లపై నెగ్గడం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలాంశం. అయినప్పటికీ ఆ టీమ్‌లో పలు సమస్యలు ఉన్నాయి. ఒక్కోసారి బ్యాటింగ్‌లో కుప్పకూలడం, ఒత్తిడిలో తడబడటం వంటి లోపాలను బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లతో జరిగిన మ్యాచ్‌లు బయటపెట్టాయి.
ఇంగ్లండ్ తరఫున మాజీ కెప్టెన్ హీదర్ నైట్ (288 రన్స్), ఎమీ జోన్స్ (220 రన్స్) మిడిలార్డర్‌లో నిలకడగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్, ఆల్‌రౌండర్ సివర్-బ్రంట్‌తో పాటు మిడిలార్డర్‌లో ఎమ్మా లంబ్, సోఫీ డంక్లీ రాణించడం జట్టుకు కీలకం కానుంది. కాగా, బుధవారం గువాహతిలో వర్షం పడే అవకాశం ఉంది. ఈ కారణంగా మ్యాచ్ రద్దు అయితే, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
