తొలి ప్రపంచకప్ ను ముద్దాడిన ఇంగ్లండ్ !

తొలి ప్రపంచకప్ ను ముద్దాడిన ఇంగ్లండ్ !
  • క్రికెట్‌‌ పుట్టింటికి వరల్డ్‌‌కప్‌‌
  • ఫైనల్లో బౌండ్రీ కౌంట్‌‌తో ఇంగ్లండ్‌‌ను వరించిన విజయం
  • కివీస్‌‌ను వెంటాడిన దురదృష్టం
  • 50 ఓవర్లు, సూపర్‌‌ ఓవర్లో  స్కోర్లు సమం

క్రికెట్‌ పుట్టింది ఆ దేశంలోనే..!  ఆట కొత్త పుంతలు తొక్కింది అక్కడే..!  వరల్డ్‌ కప్‌ మొదలైంది.. అత్యధికంగా నాలుగు మెగా టోర్నీలు జరిగిందీ ఆ గడ్డపైనే..!  కానీ,  ప్రపంచకప్‌ మాత్రం వారికి అందని ద్రాక్షే అయింది..!  మూడుసార్లు ఫైనల్‌కు వచ్చినా ఓటమే వెక్కిరించింది..!  లెజెండ్స్‌ ఎందరో ప్రయత్నించినా.. కప్పు అందకుండా పోయింది..!  విశ్వకప్‌ కల తీరకుండానే రెండు తరాల ఆటగాళ్ల  పోరాటం ముగిసింది..!  వరుసగా ఆరు ఎడిషన్లలో కనీసం సెమీస్‌కు కూడా చేరుకోలేకపోయిన తరుణంలో..  ఇక కప్పు కలే అనుకుంటున్న సమయంలో మోర్గాన్‌సేన అద్భుతాన్ని ఆవిష్కరించింది..!  నాలుగేళ్లుగా మెరుపులు మెరిపిస్తూ..  ఎదురైన జట్టునల్లా మట్టికరిపిస్తూ.. అనేక రికార్డు బద్దలు కొట్టేస్తూ .. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్‌ సొంతగడ్డపై  ఎట్టకేలకు విశ్వకిరీటాన్ని ఒడిసిపట్టుకుంది..!  యాభై ఓవర్ల ఆటలో, సూపర్‌ ఓవర్‌లోనూ ఆట సమమైనా బౌండ్రీ కౌంట్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది.

వారెవా  ఏమి ఫైనల్‌ అది..!  వన్డే క్రికెట్‌లో మేటి జట్టును తేల్చే వరల్డ్‌కప్‌లో  ఆఖరాట అల్టిమేట్ వార్‌ను తలపించింది.!   నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తూ.. ఫ్యాన్స్‌ హార్ట్‌బీట్‌ను అమాంతం పెంచేస్తూ..  అంచనాలకు అందకుండా.. యాభై ఓవర్ల ఆటలో ఫలితం తేలలేదు. సూపర్‌ ఓవర్‌లోనూ  స్కోర్లు సమం. చివరికి బౌండ్రీ కౌంట్‌ ఆధారంగా విజేత ఎవరో తేలింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఎక్కువ బౌండ్రీలు కొట్టిన ఇంగ్లండ్‌నే విజయం వరించింది.  ఈ మ్యాచ్‌లో మోర్గాన్‌సేన  24  (22 ఫోర్లు, 2 సిక్సర్లు) బౌండ్రీలు కొట్టగా.. న్యూజిలాండ్‌ 16 (14 ఫోర్లు, 2 సిక్సర్లు) బౌండ్రీలు మాత్రమే కొట్టి ఓడిపోయింది.

లండన్‌: వన్డే క్రికెట్‌లో నూతన ఆధ్యాయం..!  ఇన్నాళ్లూ ఐదు జట్ల మధ్యే దోబూచులాడిన  విశ్వ కిరీటం కొత్త జట్టు ఒడిలో చేరింది..!  అద్భుత ఆటతో అదరగొట్టిన ఇంగ్లండ్‌  తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.  మెగా టోర్నీ చరిత్రలో తొలిసారి సూపర్‌ ఓవర్‌కు దారి తీసి అక్కడా ఫలితం తేలని ఫైనల్లో మ్యాచ్‌లో బౌండ్రీ కౌంట్‌ ఆధారంగా న్యూజిలాండ్‌ను ఓడించి క్రికెట్‌ ప్రపంచాన్ని జయించింది.  సూపర్‌ ఓవర్లో  తొలుత ఇంగ్లండ్‌ వికెట్‌ కోల్పోకుండా 15 రన్స్‌ చేసింది. ఛేజింగ్‌లో న్యూజిలాండ్‌ కూడా ఒక వికెట్‌ కోల్పోయి15 రన్సే చేసింది. దాంతో, విజేతను తేల్చేందుకు బౌండ్రీ కౌంట్‌ను ఆశ్రయించారు. అంతకుముందు  మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 241 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ హెన్రీ నికోల్స్‌ (77 బంతుల్లో 4 ఫోర్లతో 55) హాఫ్‌ సెంచరీతో సత్తా చాటగా, టామ్‌ లాథమ్‌ (56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47), కేన్‌ విలియమ్సన్‌ (30) రాణించారు.   ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో సరిగ్గా 241 రన్స్‌కు ఆలౌటైంది. బెన్‌ స్టోక్స్‌ (98 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 నాటౌట్‌), జోస్‌ బట్లర్‌ (60 బంతుల్లో 6 ఫోర్లతో 59) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.  బెన్‌ స్టోక్స్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద  మ్యాచ్‌’, విలియమ్సన్‌ను మ్యాన్‌ ఆఫ్‌ టోర్నీ అవార్డులు లభించాయి.

టాప్ తడబాటు.. బట్లర్, స్టోక్స్ తోడ్పాటు

చిన్న  టార్గెట్‌ ఛేజింగ్‌లో ఇంగ్లండ్‌ ఆరంభం నుంచే తడబడింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (17) , జో రూట్‌ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. మోర్గాన్‌ (9) కూడా సింగిల్‌ డిజిట్‌కే బ్యాటెత్తేయడంతో  హోమ్‌టీమ్‌కు దెబ్బమీద దెబ్బ పడింది.  బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఫస్ట్‌ బాల్‌కే  ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఔటవ్వాల్సింది. లైన్‌పై పిచ్‌ అయిన బాల్‌ లెంగ్‌ స్టంప్‌ను కొద్దిగా తాకినట్టు తేలినా డీఆర్‌ఎస్‌లో అంపైర్‌ కాల్‌ అని తేల్చడంతో రాయ్‌ బతికిపోయాడు. కానీ, ఈ లైఫ్‌ను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు బౌండ్రీలు కొట్టి ఊపు మీద కనిపించిన రాయ్‌.. ఆరో ఓవర్లో హెన్రీ ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వేసిన స్ట్రెయిట్‌ బాల్‌కు కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. 11వ ఓవర్లో తానిచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను గ్రాండ్‌హోమ్‌ డ్రాప్‌ చేయడంతో ఊపిరిపీల్చుకున్న బెయిర్‌స్టో  ఆపై జాగ్రత్తగా ఆడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రూట్‌ నింపాదిగా బ్యాటింగ్‌ చేశాడు. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బాల్స్‌తో ఈ ఇద్దరిపై ఒత్తడి పెంచారు. 30 బాల్స్‌లో 7 పరుగులే చేసిన రూట్‌ 17వ ఓవర్లో  గ్రాండ్‌హామ్‌ ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా వేసిన బాల్‌ను వెంటాడి వికెట్‌ ఇచ్చుకోవడంతో హోమ్‌టీమ్‌కు షాక్‌ తగిలింది. మూడు ఓవర్ల తర్వాత బెయిర్‌స్టోను బౌల్డ్‌ చేసిన ఫెర్గూసన్‌…  కొద్దిసేపటికే నీషమ్‌ బౌలింగ్‌లో ఇయాన్‌ మోర్గాన్‌ ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతమైన డైవ్‌ చేస్తూ అందుకున్నాడు. దాంతో, 24 ఓవర్లకు 89/4తో ఇంగ్లండ్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. మరో వికెట్‌ పడితే ఆ జట్టు ఆశలు కోల్పోయేది. ఈ దశలో బట్లర్‌, బెన్‌స్టోక్స్‌ బాధ్యత తీసుకున్నారు. స్వభావానికి విరుద్ధంగా స్టోక్స్‌ స్ట్రయిక్‌ రొటేట్‌ చేసే బాధ్యత తీసుకోగా.. అవతలి ఎండ్‌లో బట్లర్‌  స్వేచ్ఛగా షాట్లు కొడుతూ టార్గెట్‌ను కరిగించాడు. విలియమ్సన్‌ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా.. ఏమాత్రం కంగారు పడని స్టోక్స్‌, బట్లర్‌ ఐదో వికెట్‌కు సెంచరీ  పార్ట్‌నర్‌షిప్‌ సమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివరి ఆరు ఓవర్లలో ఇంగ్లండ్‌కు 53 రన్స్‌ అవసరమయ్యాయి. క్రీజులో కుదురుకున్న స్టోక్స్‌, బట్లర్‌ జోరు మీదుండడంతో  ఆ జట్టు విజయంపై ఎవరికీ అనుమానల్లేవు. పైగా, ఫెర్గూసన్‌ వేసిన 45 ఓవర్లో ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా బౌండ్రీ కొట్టిన బట్లర్‌ జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. ఈ దశలో మ్యాచ్‌ గెలవాలంటే కివీస్‌ ఏదైనా మాయ చేయాల్సిన పరిస్థితి. ఫెర్గూసన్‌ నిజంగానే మాయ చేసింది. ఆ ఓవర్‌ ఐదో బాల్‌కు బట్లర్‌ను ఔట్‌ చేసిన ఫెర్గూసన్‌ తన తర్వాతి ఓవర్‌ ఫస్ట్‌ బాల్‌కే  క్రిస్‌ వోక్స్‌ వికెట్‌ తీసి కివీస్‌ను రేసులోకి తెచ్చాడు.

చివరి రెండు ఓవర్లలో హైడ్రామా..

ఆ తర్వాత స్టోక్స్‌, ప్లంకెట్‌ (10) చెరో ఫోర్‌ రాబట్టడంతో 48 ఓవర్లో ఇంగ్లండ్‌ 218/6తో నిలిచింది. 12 బాల్స్‌లో 24 రన్స్‌ కావాలా జట్టుకు. తొలి రెండు బాల్స్‌లో రెండు సింగిల్స్‌ రాగా.. మూడో బాల్‌కు ప్లంకెట్‌  ఔటయ్యాడు. తర్వాతి బాల్‌కు స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండ్రీలైన్‌ వద్ద క్యాచ్‌ అందుకున్న బౌల్ట్‌  లైన్‌పై కాలు పెట్టడంతో అది సిక్సర్‌ అయింది. తర్వాత స్టోక్స్‌ సింగిల్‌ తీయగా.. లాస్ట్‌ బాల్‌కు ఆర్చర్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇక, ఆరు బాల్స్‌లో15 రన్స్‌ అవసరం.  బంతితో బౌల్ట్‌, బ్యాట్‌తో స్టోక్స్‌. తొలి రెండు బాల్స్‌లో పరుగు రాలేదు. మూడో బాల్‌కు మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ కొట్టిన బెన్‌ నెక్ట్స్‌ బాల్‌కు డబుల్‌ తీశాడు. అయితే, గప్టిల్‌ వేసిన త్రో స్టోక్స్‌ బ్యాట్‌ను తగిలి బౌండ్రీ చేరడంతో మరో నాలుగు రన్స్‌ వచ్చాయి.  ఇక, 2 బంతుల్లో 3 రన్స్‌ చేస్తే ఇంగ్లండ్‌దే గెలుపు. కానీ, ఐదో బాల్‌కు ఒకే పరుగు వచ్చి నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో రషీద్‌ (0) రనౌటయ్యాడు. చివరి బాల్‌కు రెండు రన్స్‌ కావాలి. బౌల్ట్‌ వేసిన ఫుల్‌టాస్‌ను లాంగాన్‌ మీదుగా ఆడిన స్టోక్స్‌ సింగిల్ తీసి డబుల్‌కు వచ్చాడు. కానీ అవతలి ఎండ్‌లో మార్క్‌ వుడ్‌ (0) రనౌట్‌ కావడంతో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది.

నికోల్స్‌–కేన్స్‌ నిలకడ..

పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై  పార్ట్‌నర్‌షిప్స్‌ను నిర్వించుకోవడంలో విఫలమై మోస్తరుకే పరిమితమైంది. ఈ సారి విలియమ్సన్‌, టేలర్‌ తక్కువ స్కో్ర్లకే వెనుదిరిగినా టాపార్డర్‌లో హెన్రీ నికోల్స్‌, మిడిలార్డర్‌లో టామ్‌ లాథమ్‌ ఆదుకోవడంతో గౌరవప్రద స్కోరు చేసింది. మరోవైపు క్రమం తప్పకుండా వికెట్లు తీసిన లియామ్‌ ప్లంకెట్‌, క్రిస్‌ వోక్స్‌ ప్రత్యర్థిని అద్భుతంగా నిలువరించారు. ఒక దశలో 93 బంతుల పాటు కివీస్‌ బౌండ్రీ కొట్టలేకపోయిందంటే హోమ్‌టీమ్‌ బౌలింగ్‌ ఎలా ఉందో చెప్పొచ్చు. తొలుత ఉదయం కురిసిన వర్షానికి మైదానం రెడీగా లేకపోవడంతో మ్యాచ్‌ 15 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది.  పిచ్‌పై గ్రాస్‌ కనిపిస్తున్నా, వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ  టాస్‌ నెగ్గిన కివీస్‌ కెప్టెన్‌  కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. కానీ, అతని నిర్ణయానికి ఓపెనర్లు సరైన న్యాయం చేయలేకపోయారు. టోర్నీలో పేలవంగా ఆడుతున్న మార్టిన్‌ గప్టిల్‌ (19) ఆఖరాటలోనూ నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్‌ ఐదో బాల్‌నే బౌండ్రీకి తరలించి.. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో  మంచి షాట్లతో 6, 4 కొట్టి ఊపుమీద కనిపించిన గప్టిల్‌ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఏడో ఓవర్లోనే క్రిస్‌ వోక్స్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీనికి డీఆర్‌ఎస్‌ కోరి రివ్యూ కూడా వేస్ట్‌ చేశాడు. మరోసారి ఆరంభంలోనే బ్యాటింగ్‌కు వచ్చిన కేన్‌ విలియమ్సన్‌ 12వ బాల్‌కు గాని ఖాతా తెరవలేకపోయాడు. ఇంకో ఓపెనర్‌ హెన్రీ నికోల్స్‌ కూడా తొలుత ఇబ్బంది పడడంతో పవర్‌ప్లేలో కివీస్‌ 33/1తో నిలిచింది.

దెబ్బకొట్టిన ప్లంకెట్‌.. లాథమ్‌ పోరాటం

కెప్టెన్‌ కేన్‌, నికోల్స్‌ ధాటిగా ఆడుతున్న తీరు చూస్తే కివీస్‌ 300 స్కోరు చేసేలా కనిపించింది.  కానీ, సాఫీగా సాగుతున్న ఆ జట్టును  ఇన్నింగ్స్‌ను లియామ్‌ ప్లంకెట్‌ దెబ్బకొట్టాడు.  క్రాస్‌ సీమ్‌ బాల్స్‌తో చెలరేగిన అతను క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను వెంటవెంటనే ఔట్‌ చేసి హోమ్‌టీమ్‌లో జోష్‌ నింపాడు.  తొలుత ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వేసిన గుడ్‌ లెంగ్త్‌ బాల్‌ను  డిఫెండ్‌ చేసే ప్రయత్నంలో కేన్‌  కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో రెండో వికెట్‌కు  74 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. 71 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న నికోల్స్‌ 27వ ఓవర్లో ప్లంకెట్‌ వేసిన క్రాస్‌ సీమ్‌ డెలివరీని కవర్స్‌ మీదుగా డ్రైవ్‌ చేసే ప్రయత్నంలో బౌల్డ్‌ అయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడడంతో  కివీస్‌ డిఫెన్స్‌లో పడింది. వెటరన్‌ ప్లేయర్‌ రాస్‌ టేలర్‌ (15), టామ్‌ లాథమ్‌ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.  కానీ, మంచి పార్ట్‌నర్‌షిప్‌ నమోదయ్యేలోపే హోమ్‌టీమ్‌ బౌలర్లు దాన్ని విడగొడుతూ న్యూజిలాండ్‌ను కోలుకోకుండా చేశారు. అదే టైమ్‌లో కొంత దురదృష్టం కూడా కివీస్‌ను వెంటాడింది. లాథమ్‌తో కలిసి క్రీజులో నిలదొక్కుకున్న టేలర్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. మార్క్‌ వుడ్‌ వేసిన 34వ ఓవర్లో అతను ఎల్బీ అయ్యాడు. బంతి వికెట్ల పై నుంచి వెళ్తున్నా.. రివ్యూ లేకపోవడంతో టేలర్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు.  రాస్‌ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జిమ్మీ నీషమ్‌  (19)తర్వాతి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టి జోరు చూపాడు. లాథమ్‌ కూడా వెంటవెంటనే రెండు బౌండ్రీలు కొట్టి ఊపులోకి వచ్చాడు. కానీ, అదే జోష్‌లో ప్లంకెట్‌ బౌలింగ్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో రూట్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో కివీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది.  అయితే,  ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ (16)తో కలిసి ఒక్కో పరుగు జతచేసిన లాథమ్‌ 44వ ఓవర్లో స్కోరు 200 దాటించాడు. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ కొట్టి వేగం పెంచాడు. వికెట్లు చేతిలో ఉండడంతో ధాటిగా ఆడితే కివీస్‌ 270 రన్స్‌ చేసే అవకాశం కనిపించింది. కానీ, క్రిస్‌ వోక్స్‌, ఆర్చర్‌ వారికి ఆ చాన్స్‌ ఇవ్వలేదు. వరుస ఓవర్లలో లాథమ్‌, గ్రాండ్‌హోమ్‌ను ఔట్‌ చేసిన వోక్స్‌ బ్లాక్‌క్యాప్స్‌ టీమ్‌ను కట్టడి చేశాడు. లాస్ట్‌ ఓవర్లో  హెన్రీ (4)ని బౌల్డ్‌ చేసిన ఆర్చర్‌ 3 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు.

స్కోర్‌బోర్డ్‌

న్యూజిలాండ్‌:  గప్టిల్‌ (ఎల్బీ) వోక్స్‌ 19, నికోల్స్‌ (బి) ప్లంకెట్‌ 55, విలియమ్సన్‌ (సి) బట్లర్‌ (బి) ప్లంకెట్‌30, టేలర్‌ (ఎల్బీ) మార్క్‌ వుడ్‌ 15, లాథమ్‌ (సి) సబ్‌/విన్స్‌ (బి) వోక్స్‌ 47, నీషమ్‌ (సి) రూట్‌ (బి) ప్లంకెట్ 19, గ్రాండ్‌హోమ్‌ (సి) సబ్‌/విన్స్‌ (బి) వోక్స్‌ 16, శాంట్నర్‌ (నాటౌట్‌) 5, హెన్రీ (బి) ఆర్చర్‌ 4, బౌల్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 30; మొత్తం: 50 ఓవర్లలో 241/8; వికెట్ల పతనం: 1–29, 2–103, 3–118, 4–141, 5–173, 6–219, 7–232, 8–240;  బౌలింగ్‌: క్రిస్‌ వోక్స్‌ 9–0–37–3, ఆర్చర్‌ 10–0–42–1, ప్లంకెట్‌ 10–0–42–3, మార్క్‌ వుడ్‌ 10–1–49–1, ఆదిల్‌ రషీద్‌ 8–0–39–0, స్టోక్స్‌ 3–0–20–0;

ఇంగ్లండ్‌: రాయ్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 17, బెయిర్‌స్టో (బి) ఫెర్గూసన్‌ 36, రూట్‌ (సి) లాథమ్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 7, మోర్గాన్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) నీషమ్‌ 9, స్టోక్స్‌ ( నాటౌట్ ) 84, బట్లర్‌ (సి) సబ్‌/సౌథీ (బి) ఫెర్గూసన్‌ 59, క్రిస్‌ వోక్స్‌ (సి) లాథమ్‌ (బి) ఫెర్గూసన్‌ 2, ప్లంకెట్‌ (సి) బౌల్ట్‌ (బి) నీషమ్‌ 10, ఆర్చర్‌ (బి) నీషమ్‌ 0, రషీద్‌ (రనౌట్‌) 0, మార్క్‌ వుడ్‌ (రనౌట్‌) 0;  ఎక్స్‌ట్రాలు: 17;  మొత్తం: 50 ఓవర్లలో 241 ఆలౌట్;  వికెట్ల పతనం: 1–28, 2–59, 3–71, 4–86, 5–196, 6–203, 7–220, 8–227, 9–240, 10–241;  బౌలింగ్‌:  బౌల్ట్‌ 10–0–67–0, హెన్రీ 10–2–40–1, గ్రాండ్‌హోమ్‌ 10–2–25–1, ఫెర్గూసన్‌ 10–0–50–3, నీషమ్‌  7–0–43–3, శాంట్నర్‌ 3–0–11–0.