ఫిఫా వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బోణి

ఫిఫా వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బోణి

ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఇంగ్లాండ్ బోణి కొట్టింది. ఏకపక్షంగా సాగిన మ్యాచులో ఇంగ్లాండ్ 6–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మొదటి భాగంలో మూడు గోల్స్ చేసిన ఇంగ్లాండ్ 3–0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో భాగంలో మరో మూడు గోల్స్ సాధించింది. అయితే..ఇరాన్ ఫస్ట్ హాఫ్ లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. సెకండాఫ్ లో మాత్రమే రెండు గోల్స్ చేసి ఓడిపోయింది. 

ఇంగ్లాండ్ జోరు..ఇరాన్ బేజారు..

మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. గోల్ పోస్టుపై ఇంగ్లాండ్ దాడి చేస్తూనే ఉంది.  కానీ, ఇంగ్లాండ్ గోల్స్ ను ఇరాన్ అడ్డుకుంది. అయితే 35వ నిమిషంలో ఇంగ్లండ్‌ ఫస్ట్ గోల్ కొట్టింది. జూడ్‌ బెల్లింగ్‌హామ్‌ గోల్‌ చేసి శుభారంభాన్నిచ్చాడు. ఆ తర్వాత మరో 8 నిమిషాలకు ఇంగ్లండ్‌ మరో గోల్‌ సాధించింది. పెనాల్టీ కార్నర్‌ను అద్భుతంగా ఉపయోగించుకుంటూ.. బుకాయో సాకా బంతిని గోల్ పోస్టులోకి పంపించాడు. మరో మూడు నిమిషాల వ్యవధిలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌ గోల్‌ చేసి..స్కోరును 3–0కు చేర్చాడు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి ఇంగ్లండ్‌ 3–0 ఆధిక్యంలో నిలిచింది. 

సెకండాఫ్ లోనూ ఇంగ్లాండ్ దూకుడు..

సెకండాఫ్‌లోనూ ఇంగ్లాండ్ జోరును కొనసాగించింది. 64వ నిమిషంలో సాకా మరో గోల్ చేశాడు. ఆ తర్వాత పుంజుకున్న ఇరాన్..తొలి గోల్‌ చేసింది. మెహదీ తరేమీ ఇరాన్‌కు గోల్‌ చేసి స్కోరును 1–4కు తగ్గించాడు. ఇక 71 నిమిషంలో ఇంగ్లాండ్ కు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మార్కస్‌ రాష్‌ఫోర్డ్‌..ఐదో గోల్‌ చేయడంతో ఇంగ్లాండ్ స్కోరు 5–1గా మారింది. 90వ నిమిషంలో జాక్ గ్రీలిష్ మరో గోల్ కొట్టడంతో ఇంగ్లండ్‌ ఆధిక్యం 6–1కి పెరిగింది.

రెండో గోల్ చేసినా ఫలితం లేదు..

ఇంజురీ టైమ్‌ చివరి నిమిషంలో పెనాల్టీ కిక్‌ అందుకున్న ఇరాన్‌ మరో గోల్ చేసింది. మరోసారి మెహదీ తరేమీయే ఇరాన్‌కు రెండో గోల్ అందించాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు ఫైనల్‌ విజిల్‌ మోగడంతో ఇంగ్లండ్‌ 6–2తో  విజయం సాధించింది.