
- దేవరకద్ర అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని గొలుసుకట్టు చెరువులు నింపాలని ప్రపోజల్
- పైపులైన్ ద్వారా మహబూబ్‌నగర్ మండలంలో చెరువులు నింపేందుకు మరో ప్రతిపాదన
- సర్వేలు చేసి సాధ్యసాధ్యాలపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందించనున్న ఆఫీసర్లు
మహబూబ్‌నగర్, వెలుగు: కోయిల్ సాగర్ ప్రాజెక్టు ద్వారా మరింత ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సోర్స్ ఆధారంగా ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి అదనంగా రెండున్నర టీఎంసీల మేర నీటిని వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటిన్నర టీఎంసీ కెపాపిటీతో మినీ రిర్వాయర్, మరో టీఎంసీ నీటిని ప్రత్యేక పైపులైన్ ద్వారా చెరువులు నింపేందుకు మహబూబ్‌నగర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి ప్రతిపాదనలు చేశారు. ఈ రెండు ప్రతిపాదనలకు సంబంధించి త్వరలో సర్వే చేయనున్నారు.
మన్యంకొండ వద్ద రిజర్వాయర్..
కోయిల్‌సాగర్ ఆధారంగా మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన మన్యంకొండ గుట్టల ప్రాంతంలో మినీ రిజర్వాయర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రతిపాదనలు చేశారు. చౌదరిపల్లి సమీపంలో లేదంటే మన్యంకొండ బ్యాక్ సైడ్‌లో ఈ రిజర్వాయర్‌ను నిర్మించే అవకాశం ఉంది. దాదాపు 1.5 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నారు. కెనాల్ లేదా పైప్‌లైన్ సిస్టమ్ ద్వారా ఈ రిజర్వాయర్‌ను నీటితో నింపేందుకు కసరత్తు జరుగుతోంది. దీనిపై పూర్తి ప్రతిపాదనలను ఎమ్మెల్యే జీఎంఆర్ ఇటీవల ఇరిగేషన్ శాఖకు అందించగా.. వారు సానుకూలంగా స్పందించారు. అన్ని కురిదితే త్వరలో ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన జీవోను విడుదల చేయనున్నారు.
ఈ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా అడ్డాకుల, మూసాపేట, దేవరకద్ర మండలాల్లోని గొలుసుకట్టు చెరువులను నింపనున్నారు. 12 గ్రామాలను కలుపుతూ ఈ చెరువులు ఉండడంతో దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది. దీంతో యాసంగి పంటలకు సాగునీటికి ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. దీనికితోడు గుట్టల మధ్యలో రిజర్వాయర్ నిర్మిస్తే పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలనుకుంటున్న ప్రాంతంలో దాదాపు 15 ఎకరాల నుంచి 20 ఎకరాల్లో ప్లెయిన్ ఏరియా ఉండడంతో టూరిజం డెవలప్మెంట్కు దోహపడనుంది.
పాలమూరు చెరువులు నింపేందుకు..
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో ప్రతి యాసంగి సీజన్లో రైతులు పంటలు కాపాడుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచే చెరువుల్లో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో గ్రౌండ్ వాటర్ కూడా పడిపోయింది. దీంతో ఈ యాసంగిలో మండలంలోని కొందరు రైతులు పంటలను పశువులకు వదిలేశారు. ఈ విషయంపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే వైఎస్ఆర్ కోయిల్‌సాగర్ ద్వారా పాలమూరు చెరువులను నింపేందుకు ఇరిగేషన్ శాఖకు ప్రతిపాదనలు పంపించారు.
20 చెరువులను కృష్ణా జలాలతో నింపాలని కోరారు. ఇందుకుగాను కోయిల్‌సాగర్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ తీసుకొచ్చి చెరువులను నింపే ప్రయత్నం చేయాలని ఇటీవల ఆ శాఖ ఉన్నతాధికారులకు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆఫీసర్లు త్వరలో సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. రానున్న వారం రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే చాన్స్ ఉంది.
ఇదీ కోయిల్‌సాగర్ పరిస్థితి..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు 2.27 టీఎంసీల కెపాసిటీతో 1966లో అందుబాటులోకి వచ్చింది. 12 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించేలా డిజైన్ చేశారు. అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం వైఎఎస్సార్ఈ లిఫ్ట్‌ను జలయజ్ఞం కిందకు చేర్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 50,250 ఎకరాలకు సాగునీటిని అందించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. రూ.360.18 కోట్లతో మెయిన్ కెనాల్స్, సబ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలను డెవలప్ చేసే పనులు చేపట్టారు.
2014 వరకు రూ.336.29 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం దీని కింద 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. జూరాల బ్యాక్ వాటర్ ఎడమ వైపు నుంచి కోయిల్‌సాగర్‌కు ప్రత్యేకంగా కెనాల్ ఉండగా.. ఈ కెనాల్ ఆధారంగా జూరాలకు వరదల సమయంలో పెద్ద మొత్తంలో కృష్ణా జలాలను కోయిల్‌సాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి కొత్తగా ప్రతిపాదించిన రిజర్వాయర్‌కు తరలించాలని ప్లాన్ చేస్తున్నారు.