
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి భారతదేశం. ఐటీ, రక్షణ, వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన వంటి అనేకరంగాలలో భారతీయులు తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ అభివృద్ధిలో మహిళల పాత్రను విస్మరించలేం. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు అన్నింటిలోనూ మహిళలు ముందంజలో నిలుస్తున్నారు. అయితే, ఈ సానుకూల పరిణామాల మధ్య ఒక ప్రశ్న ఇప్పటికీ మనల్ని వెంటాడుతోంది. మహిళలు నిజంగా సురక్షితంగా ఉన్నారా? అనే అంశంపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారతదేశంలో ప్రతిరోజు పత్రికలు, వార్తా ఛానెల్స్ చూస్తే మహిళలపై హింస, వేధింపులు, దాడులు గురించి కథనాలు తరచుగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, కేంద్ర ప్రభుత్వం మరియు పలు స్వచ్ఛంద సంస్థలు మహిళల భద్రతపై సమీక్షలు చేస్తుంటాయి. అందులో ముఖ్యమైనది నారీ రిపోర్ట్ (నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ) – 2025. ఈ నివేదిక ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం చట్టాలు లేదా గణాంకాల ఆధారంగా మాత్రమే కాకుండా మహిళల అనుభవాలు, అభిప్రాయాలను కూడా ప్రతిబింబిస్తుంది.
మహిళల భద్రతా సమస్య ఒక జాతీయ ప్రాధాన్యతా అంశం. ఒక దేశ అభివృద్ధి అంటే కేవలం ఆర్థికవృద్ధి కాదు. ఒక దేశంలో మహిళలు సురక్షితంగా ఉంటేనే ఆ దేశం అభివృద్ధిపథంలో కొనసాగుతుంది. నారీ 2025 నివేదిక ప్రకారం, భారతదేశం మొత్తం మీద భద్రతా సూచికలో 65%గా ఉంది. ఈ సంఖ్య చూడటానికి సగటు స్థాయిలో ఉన్నట్టే కనిపించినా, దీని వెనుక ఉన్న వాస్తవం ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే సుమారు 40% మహిళలు తమ నగరం సురక్షితం కాదని ఈ నివేదికలో చెప్పారు.
చట్టపరంగా రక్షణ ఉన్నప్పటికీ, మహిళలు తమ అనుభవాల ఆధారంగా భయంతో జీవిస్తున్నారు. సగటున ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒక సమయంలో వేధింపులకు గురవుతున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వేస్టేషన్లు వంటి ప్రదేశాల్లో మహిళలు తరచుగా అసభ్యకర వ్యాఖ్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో మహిళలకు భద్రతతో కూడిన రవాణా సౌకర్యాలు లేకపోవడం పెద్ద సమస్య. చాలామంది మహిళలు తమ ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని ఈ నివేదికలో తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది పోలీసుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది.
సురక్షిత నగరంగా కోహిమా
గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక ఒత్తిడి, బాల్యవివాహాలు, కుటుంబ హింస వంటి సమస్యలు కొనసాగుతున్నాయనే నిజాన్ని ఈ సూచిక బయటపెట్టింది. భారతదేశంలోని మహిళల భద్రతా స్థితి ప్రతి నగరంలో భిన్నంగా ఉంటుంది. ఒకవైపు కొన్ని నగరాలు మహిళలకు అనుకూలమైన వాతావరణం కల్పించగా, మరికొన్ని నగరాల్లో మహిళలు నిరంతర భయభ్రాంతులతో జీవిస్తున్నారు. నారీ శక్తి నివేదిక -2025 ఈ వ్యత్యాసాలను స్పష్టంగా బయటపెట్టింది.
నాగాలాండ్ రాజధాని కోహిమా నగరం దేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా నిలిచింది. ఇక్కడ మహిళలు రాత్రివేళల్లో కూడా స్వేచ్ఛగా తిరగగలరని నివేదికలో పేర్కొంది. ఇందుకు కారణం సమర్థవంతమైన పోలీస్ పెట్రోలింగ్, సీసీ కెమెరాల విస్తృత వినియోగం, మహిళలకు ప్రత్యేక హెల్ప్‌లైన్ సేవలు పౌర సమాజంలో లింగ సమానత్వంపై అవగాహన ప్రజలలో ఉండడం వల్ల సాధ్యమైందని తెలుస్తున్నది.
మహిళలపై హింస సామాజిక సమస్య
దేశ రాజధాని ఢిల్లీ చాలాకాలంగా మహిళల భద్రత సమస్యలతో వార్తల్లో నిలుస్తోంది. నిర్భయ కేసు (2012) తర్వాత చట్టాలు కఠినతరం అయినప్పటికీ పెద్ద మార్పు రాలేదు. దేశ రాజధాని నగరంలో మహిళల అణచివేతకు హింసకు సంబంధించిన కేసులు అధికంగా ఉంటున్నాయి అనే విషయం ఈ నివేదికలో స్పష్టంగా తెలిసింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాలు కూడా రాత్రి భద్రత, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలపై మరింత దృష్టి పెట్టాలి అనే విషయాన్ని ఈ నివేదికలో పరోక్షంగా చెప్పినట్లు భావించాలి.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై హింస తగ్గించడానికి సామాజిక అవగాహన, పోలీసు-–ప్రజా భాగస్వామ్యం పెంపొందించాలి. మహిళలపై వేధింపులు భారతదేశంలో ఇంకా ఒక ప్రధాన సామాజిక సమస్యగానే కొనసాగుతోంది. నారీ శక్తి నివేదిక 2025 ప్రకారం, వేధింపులు కేవలం శారీరకంగానే కాకుండా మానసిక, ఆర్థిక, డిజిటల్ రూపాల్లో కూడా జరుగుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం ఉద్యోగ రంగంలో ఉన్న మహిళలు పదోన్నతి కోసం లైంగిక ఒత్తిడి, అసభ్యకరమైన వ్యాఖ్యలు, గౌరవం తగ్గించే ప్రవర్తన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.
ఈ నివేదిక ప్రకారం ప్రతి నలుగురు ఉద్యోగినుల్లో ఒకరు కనీసం ఒకసారి వర్క్‌ప్లేస్ హరాస్మెంట్కు గురవుతున్నారని తెలుపుతోంది. ఉద్యోగం చేసే మహిళలకు భద్రత కల్పించే చట్టాలు ఉన్నప్పటికీ, చాలా సందర్భాల్లో మహిళలు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు.
మహిళలపై వేధింపులను అరికట్టాలి
గృహ హింస ఇప్పటికీ కొనసాగుతోంది. భార్యపై భర్త దాడి, మానసికంగా బాధించడం, ఆర్థికంగా నియంత్రించడంలాంటి ప్రధాన సమస్యలు ఇంకా సమాజంలో ఉన్నాయి. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, వివాహిత మహిళల్లో 35% మంది ఏదో ఒక రూపంలో గృహ హింసకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో నూతన రూపంలో సోషల్ మీడియా విస్తరించడంతో కొత్తరకం వేధింపులు పుట్టుకొచ్చాయి. ఆన్‌లైన్ బులీయింగ్, మార్ఫింగ్, ట్రోలింగ్, సైబర్ స్టాకింగ్ ప్రధాన సమస్యలు.
నారీ నివేదిక 37% మహిళలు కనీసం ఒకసారి డిజిటల్ వేధింపులకు గురయ్యారని పేర్కొంది. ఈ డిజిటల్ వేధింపులు సామాన్య మహిళలపై కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలను కూడా వదిలిపెట్టడం లేదు. నారీ రిపోర్టు 2025 తెలిపిన గణాంకాల ప్రకారం 65% మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్నారు. 48% మహిళలు ఉద్యోగ స్థలాల్లో వివక్ష లేదా హరాస్‌మెంట్ అనుభవించారు.
35% మహిళలు గృహహింసకు గురయ్యారు. 37% మహిళలు ఆన్‌లైన్ వేధింపులు ఎదుర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో డిజిటల్ వేధింపులు అధికంగా ఉన్నాయని నివేదిక చెబుతోంది. ఒక సమాజం సురక్షితంగా ఉండాలంటే, ఆ సమాజంలోని మహిళలు భయంలేకుండా జీవించగలగాలి. మహిళలపై వేధింపులను అరికట్టలేకపోతే మహిళా శక్తి పూర్తిస్థాయిలో వెలుగులోకి రాదు.
- డా. ఎ. శంకర్,
వీరనారి చాకలి ఐలమ్మ
మహిళా యూనివర్సిటీ