సూపర్ మామ్స్ ఫరా, తారా, బౌరమ్మ ! సంతానోత్పత్తిలో మూడు పులులు కీలకం

సూపర్ మామ్స్ ఫరా, తారా, బౌరమ్మ ! సంతానోత్పత్తిలో మూడు పులులు కీలకం
  • అమ్రాబాద్ అడవిలో 5 సార్లు పిల్లలను పెట్టిన ఫరా–6
  • 3 సార్లు ఆరు పులి కూనలకు జన్మనిచ్చిన ఫరా సంతతి బౌరమ్మ
  • మూడు పిల్లలను పెట్టిన తారా
  • 2018లో 7 పులులు.. ఇప్పుడు 36

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నది ఒడ్డున విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో పులులు గర్జిస్తున్నాయి. ఈ రిజర్వ్ ఫారెస్ట్ పులుల సంతానోత్పత్తకి కేంద్రంగా మారింది. అభయారణ్యంలో 2018లో కేవలం 7 పులులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాటిసంఖ్య 36కు చేరుకున్నది. ఇందులో 13 మగ పులులు, 20 ఆడ పులులు (బ్రీడింగ్ ఫీమేల్స్), 2 కూనలు ఉన్నాయి. ఒక పులి లింగ నిర్ధారణ కాలేదు. ఏటీఆర్లో ఆడ పులుల సంఖ్య 15 నుంచి 20కి పెరగడంతో రానున్న రోజుల్లో పులుల సంఖ్య రెట్టింపు అయ్యే చాన్స్ ఉందని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల సంఖ్య పెరగడానికి మూడు ఆడ పులులే కారణం. స్థానికులు వాటిని సూపర్ మామ్స్​గా పిలుస్తారు. ఫరా (ఎఫ్–6), తారా (ఎఫ్–7), బౌరమ్మ (ఎఫ్–18) మేటింగ్ సీజన్​లో మగ పులులతో కలిసి కూనలకు జన్మనిస్తుండటంతో వాటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ పులుల సంతానం రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్​లో 50శాతంపైగా ఉంది.

ఫరా (ఎఫ్–6): ఫరాను అమ్రాబాద్‌‌‌‌ రిజర్వ్ మదర్​గా భావిస్తారు. 2019లో 2 కూనలతో మొదలైన.. ఈ పులి ప్రస్తానం.. 5కి పైగా కూనలకు జన్మనిచ్చింది. ఫరా జెన్యు వైవిధ్యం రిజర్వ్ జనాభాలో సగభాగం ఆక్రమించింది. చెంచు గిరిజనులు ఆమెను ప్రేమగా ‘సూపర్‌‌‌‌ మమ్మా’ అని పిలుస్తారు.

తారా (ఎఫ్–7): అమ్రాబాద్‌‌‌‌ ఫారెస్ట్​లో పులుల సంతతి పెరగడంలో తారా కీలక పాత్ర పోషించింది. తారా పులికి ఫరాతో సంబంధం లేకపోయినా.. ఇది 3 సార్లు పిల్లల్ని కనింది. తారా పులి కూనల్లో 2 పెరిగి పెద్దయ్యాయి. మరోసారి తారా పులి 4 కూనలకు జన్మనిచ్చింది.

బౌరమ్మ (ఎఫ్–18): ఫరా కూనల్లో ఒకటైన బౌరమ్మ.. 3 సార్లు కూనలను కన్నది. 2022లో 4 కూనలు, మరో సారి 2 కూనలకు జన్మనిచ్చింది. ఫరా పులి పిల్ల అయిన బౌరమ్మ సంతానోత్పత్తి కారణంగా పులుల వారసత్వం పెరిగింది. స్థానిక గిరిజనులు, చెంచులు బౌరమ్మ ఆలయం సమీపంలో ఈ పులిని చూశారు. దీంతో దానికి బౌరమ్మ అని అటవీశాఖ అధికారులు పేరు పెట్టారు.

ఎం–22 మగ పులి: అమ్రాబాద్​ అభయారణ్యంలో పులుల సంతానోత్పత్తిలో మగ పులుల పాత్ర కీలకం. ఎం–22, ఆల్ఫా, మేల్–23 మగ పులులు కొల్హాపూర్, లింగాల, అత్కాంపేట్, మన్ననూర్, మద్దిమడుగుతో పాటు పలు ప్రాంతాల్లో విస్తృతంగా తిరుగుతూ మేటింగ్ సీజన్​లో ఆడ పులులతో కలిశాయి. నాగార్జునసాగర్, గుండ్ల బ్రహ్మేశ్వరం వంటి రిజర్వ్‌‌‌‌ల నుంచి మగ పులులు మేటింగ్ సీజన్​లో వలసలు వస్తుండటం విశేషం.

మేటింగ్ సీజన్ మూడు నెలలు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​ 2,611 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2014లో ప్రాజెక్ట్ టైగర్ కింద టైగర్ రిజర్వ్‌‌‌‌గా ప్రకటించారు. జులై నుంచి సెప్టెంబర్ దాకా పులులకు మేటింగ్ సీజన్ తర్వాత పులులు గర్భందాల్చిన 3 నెలల్లోనే పులి కూనలకు జన్మనిస్తాయి. ఎందుకంటే ఈ కాలంలో ఆహారం సమృద్ధిగా లభించడంతో పాటు వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. గర్భధారణ కాలం 3 నెలలు (93 నుంచి 112 రోజులు). ఒక్కో పులి మేట (తిగ్రెస్) సగటున 2 నుంచి 4 కూనలకు జన్మిస్తుంది. అరుదుగా 5 నుంచి 6 కూనలకు జన్మనిచ్చే అవకాశం ఉంది. కూనలు కండ్లు తెరవడానికి 10 నుంచి14 రోజులు పడుతుంది. మూడేండ్ల వరకు తల్లి సంరక్షణలో ఉంటాయి. ఈ కాలంలో తల్లి పులి వాటిని రక్షించడానికి దూరంగా ఉంచుతుంది.

సంరక్షణపై స్పెషల్​ ఫోకస్​
అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల సంరక్షణపై అటవీశాఖ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాటికి కావాల్సిన ఆహారం, నీరు కొరత లేకుండా చూస్తున్నారు. వేటగాళ్ల బారినపడకుండా ప్రత్యేక టీమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ట్రాకింగ్ కెమెరాలతో వాటి కదలికలపై దృష్టి పెడ్తున్నారు. పులులు వేటాడేందుకు అడవిలో 4 వేలకు పైగా జింకలు, దుప్పులు, మనుబోతులు ఉన్నాయి. ఒక పులి వారానికి ఒక జింకను వేటాడుతున్నది. అంటే ఏడాది కాలంలో 52 జింకలను వేటాడి తింటున్నది. పులుల పచ్చిక మైదానాలు, ఎలాంటి డిస్ట్రబెన్స్ లేని ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. కాబట్టి వాటికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు కోర్ ఏరియాలో నివసిస్తున్నవారిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అటవీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. మాన్సూన్ (జులై నుంచి సెప్టెంబర్) బ్రీడింగ్‌‌‌‌కు అనుకూలం కావడంతో రిజర్వ్ ఫారెస్ట్​ను మూసివేస్తున్నారు.

పులులకు ప్రత్యేక ఐడీ 
అమ్రాబాద్ ప్రాజెక్ట్ టైగర్ కింద ఎన్టీసీఏ నియమాల ప్రకారం పులుల మానిటరింగ్ చేస్తారు. 2024 – 25 ఫేజ్ 4 మానిటరింగ్ ప్రకారం.. 2024, డిసెంబర్ నుంచి 2025, మే వరకు 1,594 కెమెరా ట్రాప్‌‌‌‌లతో పులుల పాద ముద్రలను పరిశీలించారు. 797 లొకేషన్లలో 2 కిలో మీటర్లకు కెమెరా రికార్డు ట్రాప్ చేసి పులుల డేటా విశ్లేషించారు. 4 నెలల్లో పులుల అడుగులు, విసర్జనలు, స్ర్కాప్, లేక్ మార్కులు వంటి ఆధారాలతో నమోదు చేస్తారు. పెద్ద పులులను ఇప్పటికి అందుబాటులో ఉన్న ఫొటో గ్రాఫ్ డేటాబేస్​తో పాటు పులుల చారల ఆధారంగా మ్యాచ్ చేస్తారు. మగ, ఆడ పులులను వాటి శరీర భాగాలను బట్టి గుర్తిస్తారు. ఏ రెండు పులుల చారలు ఒకేలా ఉండవు. పులులను గుర్తించాక వాటికి ప్రత్యేక ఐడీ కేటాయిస్తారు.