పార్లమెంట్​లోకి ఎంట్రీ అంత ఈజీకాదు

పార్లమెంట్​లోకి ఎంట్రీ అంత ఈజీకాదు
  • అడుగడుగునా చెకింగ్, డేగ కళ్లలా కాపుకాసే కెమెరాలు
  • 6 చోట్ల చెకింగ్.. మెటల్ డిటెక్టర్లతో బాడీ స్కాన్

న్యూఢిల్లీ, వెలుగు: ఆరంచెల భద్రత, అడుగడుగునా చెకింగ్, మెటల్ డిటెక్టర్లతో బాడీ స్కాన్, నిర్ణయించిన రూట్​లోనే ఎంట్రీ, ఇతరులకు కనెక్ట్ కాకుండా అన్ని ద్వారాలు బంద్.. ఒకవేళ ఇవన్నీ దాటి ముందుకు వెళ్లినా, అనుమానం వస్తే అక్కడే అడ్డుకునే కమాండోలు.. పార్లమెంట్​లో ఉండే అత్యంత పటిష్టమైన భద్రత ఇది. నిజానికి విజిటర్లు పార్లమెంట్​లోకి ఎంట్రీ అంత తేలికేమీ కాదు. విజిటర్స్ గ్యాలరీ వరకూ చేరాలంటే చాలా తతంగమే ఉంటుంది.

ఆరు చెక్ పాయింట్లు  

కొత్త పార్లమెంట్​ను విజిట్ చేయాలంటే ఆరు చెక్ పాయింట్లు దాటాల్సి ఉంటుంది. విజిటర్స్ ను రైసినా హిల్స్ రోడ్​లోని పాత రిసెప్షన్ గుండా మాత్రమే అనుమతిస్తారు. రైసినా హిల్స్ ఎంట్రీ(రైల్వే భవన్ మెయిన్ గేట్ ముందు) వద్ద పాస్, టైం చూసి పార్లమెంట్ రిసెప్షన్ వైపు వెళ్లనిస్తారు. విజిటర్లు ఇక్కడికి చేరుకోగానే మొబైల్స్, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్, పెన్నులు, కాయిన్స్, కాగితాలు, పర్స్ ఇలా అన్నింటినీ కౌంటర్​లో అప్పగించాలి. తర్వాత సెకండ్ గేట్ వద్ద ఫస్ట్ మెటల్ డిటెక్టర్ ఉంటుంది. బయటకు రాగానే మరోసారి బాడీ స్కాన్ చేస్తారు. అనంతరం థర్డ్ గేట్ వద్ద పెద్ద హాల్​లోకి వెళ్లాలి. విజిటింగ్ టైంకు 5 నిమిషాల ముందు మాత్రమే ఇక్కడి కాంప్లెక్స్​లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఫోర్త్ గేట్ దగ్గర పాస్, ఐడీ ప్రూఫ్ చెక్ చేస్తారు. ఈ గేట్​లోకి ప్రవేశించామంటే పార్లమెంట్ ప్రాంగణంలోకి వచ్చేసినట్లే. ఇక్కడి నుంచి ప్రతి అడుగు భద్రతా సిబ్బంది కనుసన్నల్లోనే కొనసాగుతుంది. విజిటర్స్​ను కేవలం గరుడ ద్వారం నుంచి మాత్రమే అనుమతిస్తారు. అక్కడ ఐదో గేట్ ఉంటుంది. ఇదే విజిటర్స్​కు ఇదే పార్లమెంట్​లోకి మెయిన్ ఎంట్రీ. ఇక్కడ చెకింగ్ పూర్తి కాగానే, మెట్లు ఎక్కి ముందుకు నడిస్తే లోక్ సభ పబ్లిక్ గ్యాలరీకి చేరుకుంటాం. లోపలికి వెళ్లే ముందు ఆరో గేట్ వద్ద మరోసారి చెక్ చేస్తారు. గ్యాలరీలో నలుగురు భద్రతా సిబ్బంది ఉండి విజిటర్స్​ను గమనిస్తూ ఉంటారు. ఇంత టైట్ సెక్యూరిటీని దాటుకుని దుండగులు రచ్చ చేశారంటే.. ఇంతకుమందు రెక్కీ నిర్వహించారా? అన్న అనుమానాలు వస్తున్నాయి.