
- భూ గ్రహం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిద్దాం: మోదీ
న్యూ ఢిల్లీ: కలిసికట్టుగా కృషిచేసి పుడమిని పరిరక్షించుకుందామని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భూగ్రహం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిద్దామని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ఉద్యమాన్ని విస్తరించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో గురువారం ఓ మొక్కను నాటారు.
ఆరావళి శ్రేణిని తిరిగి అడవులుగా మార్చే ‘ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు’కు శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమం ద్వారా 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతోపాటు పచ్చదనాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ అని, ఐదేండ్లుగా ఇందుకోసం భారత్ కృషి చేస్తోందన్నారు.
సిందూర మొక్కను నాటిన మోదీ
పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సిందూర మొక్కను నాటారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్‌తో భారత్ చేసిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన మహిళా బృందం ఈ మొక్కను మోదీకి బహూకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్’ లో మోదీ పోస్ట్ చేశారు.
‘‘నేను ఇటీవల గుజరాత్లోని కచ్ను సందర్శించినప్పుడు ఆ మహిళ బృందం ఈ మొక్కను నాకు ఇచ్చింది. దీన్ని పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం” అని పేర్కొన్నారు.