హైదరాబాద్​లో గంటకో చోట భారీ వర్షం ముప్పుకు సంకేతం 

హైదరాబాద్​లో గంటకో చోట భారీ వర్షం ముప్పుకు సంకేతం 
  • అర్బన్, క్లైమెట్ పాలసీల్లేకుంటే విపత్తులు తప్పవు  
  • ల్యాండ్ యూజ్ రూల్స్ ఉల్లంఘనతోనే పర్యావరణ మార్పులు 

హైదరాబాద్, వెలుగు: దేశంలో పట్టణాలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని, తక్షణం మేల్కొనకపోతే విపత్తులు తప్పవని ప్రముఖ పర్యావరణవేత్త బీవీ సుబ్బారావు హెచ్చరించారు. కొన్నేళ్లుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని, వీటిని పసిగట్టి ప్రభుత్వాలు, సైంటిస్టులు, యూనివర్సిటీలు, మేధావులు, పౌర సంఘాలు సరైన పాలసీలు రూపొందించి అమలు చేయకపోతే ఏ క్షణమైనా ఎపిడమిక్స్ (అంటురోగాలు), విపత్తుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. గురువారం ‘వీ6’ టీవీ చానల్ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో వస్తున్న అనూహ్యమైన మార్పులు, అకాల వర్షాలు, కుండపోత వానలకు దారి తీస్తున్న పరిస్థితులను విశ్లేషించారు. హైదరాబాద్​లో అనుకోకుండా పడుతున్న వర్షాలకు భూ వినియోగ(ల్యాండ్ యూజ్) నిబంధనల ఉల్లంఘనే ప్రధాన కారణమన్నారు.

బుధవారం పడిన వర్షమే దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పారు. ‘‘జూబ్లీహిల్స్ పచ్చని ప్రకృతితో ఉన్న కొండ ప్రాంతం. ఇక్కడ నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు వెయ్యి గజాల్లో ఒక నిర్మాణం ఉండాలని, అందులో 30 శాతం పచ్చదనం కోసం కేటాయించాలని అనుకున్నారు. దాంతో చల్లదనం ఉండి, టెంపరేచర్లు కంట్రోల్​లో ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా నిర్మాణాలే. దీని వల్ల ఉష్టోగ్రతల్లో మార్పులు వచ్చి అనూహ్యమైన రీతిలో ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తోంది’’ అని ఆయన వివరించారు. చల్లటి ప్రదేశంలో టెంపరేచర్లు పెరిగితే పర్యావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయన్నారు. 

అక్టోబర్​లో వానలు డేంజర్​

సాధారణంగా అక్టోబర్​లో టెంపరేచర్లు పెరగాలి. కానీ ఇప్పుడు అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయని బీవీ సుబ్బారావు అన్నారు. అపుడే ఎండా, అపుడే చల్లదనం ఉంటున్నాయని, వర్షాలు పడుతున్నా ఉక్క పోస్తోందన్నారు. ఈ విషయం సామాన్యుడు కూడా గుర్తిస్తున్నాడు కానీ మన పాలసీ మేకర్లు గుర్తించడం లేదన్నారు. ‘‘1990 నుంచే క్లౌడ్ బరస్ట్ అవుతున్న పరిస్థితిపై నా దగ్గర రికార్డులున్నాయి. 2017 నుంచి మరింత తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబర్​లో వర్షాలు, టెంపరేచర్​లో అనూహ్యమైన తేడాలు మంచిది కాదు. మనిషి టెంపరేచర్ మారితే ఎట్లా ఆరోగ్య సమస్యలు వస్తాయో పర్యావరణం విషయంలో కూడా అంతే. సమయానికి పసిగట్టకపోతే, అహంకారంతో దాన్ని గుర్తించినా రిపేర్ మొదలుపెట్టకపోతే చాలా ప్రమాదంలో పడతాం’’ అని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో హెల్త్ మీద బాగా ప్రభావం పడుతుందన్నారు. ఈ సమయంలో హెల్త్ సర్వేలు జరగాల్సిన అవసరం ఉన్నా, ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు.

హీట్ ప్యాకెట్లపై స్టడీ చెయ్యాలె 

‘‘సిటీలోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల్లోని అర్బన్ విభాగాలు హీట్ ప్యాకెట్లపై స్టడీలు చేయాలి. ల్యాండ్ యూజ్ ప్యాట్రన్​ను గమనించాలి. కానీ ఇలాంటివేమీ జరగడం లేదు” అని సుబ్బారావు చెప్పారు. ఈ స్టడీలు చేయకపోతే పాలసీలు రూపొందవని, పాలసీలు తయారు చేసినా వాటిని యంత్రాంగం ఇంప్లిమెంట్ చేయలేదన్నారు. ‘‘ఎప్పుడైతే మనం పరిస్థితి డేంజరస్ స్థాయికి వెళ్లిందని గ్రహిస్తామో, అప్పుడు మన అహంకారాలను పక్కన పెట్టి సొల్యూషన్​ కోసం ప్రయత్నం చేయాలి. పర్యావరణ అంశాలు బహుముఖమైనవి. పరిష్కారాల కోసం కూడా బహుముఖ ప్రయత్నాలు జరగాలి. అప్పుడే ప్రమాదాన్ని నివారించగలుగుతాం’’ అని సుబ్బారావు అన్నారు. పట్టణ ప్రాంతాలు ఆర్థిక పరిపుష్టికి పట్టుగొమ్మలని, అక్కడ ఏ సమస్యా తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కానీ పబ్లిక్ హెల్త్, పాలసీల గురించి పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నామని, ఇది చాలా దౌర్భాగ్య స్థితి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాకాల సన్నద్ధత ఏదీ?

వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ విభాగాలు మాన్సూన్ ప్రిపేర్డ్ నెస్ మ్యాప్ తయారుచేసుకోవాలి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితే కనిపించడం లేదని సుబ్బారావు అన్నారు. రుతువుల్లోని మార్పులకు అనుగుణంగా జీవన సరళిలో మార్పులు చేసుకోవాలని, దీనిపై జనానికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత పాలసీ మేకర్లదేనన్నారు. కొద్దిసేపు జూబ్లీహిల్స్, తర్వాత రెండూ మూడు గంటలకు ఆర్ సీ పురంలో భారీ వర్షం పడడం మంచిది కాదన్నారు. ఇంత అనూహ్యమైన పరిస్థితులు ఉండడానికి మల్టీపుల్ డిసిప్లేన్​అప్రోచ్ లేకపోవడమేని అన్నారు. ‘‘2012లో అర్బన్ ఫ్లడింగ్ గురించి ఒక రిపోర్ట్ తయారుచేశాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. దాన్ని అమలు చేస్తే 70 శాతం సమస్యలు తీరుతాయి’’ అని ఆయన చెప్పారు. పబ్లిక్ పాలసీల తయారీ, ఇంప్లిమెంటేషన్ మీద చిత్తశుద్ధి లేకపోతే మున్ముందు ఇలాంటి ఉత్పాతాలు ఎన్నో వస్తాయని చెప్పారు. 50 ఏండ్లుగా కరువులో ఉన్న అనంతపురంలో ఇప్పుడు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ పరిస్థితికి కారణమైన వాతావరణ, పర్యావరణ మార్పులను గుర్తించకపోతే ప్రమాదాలు తప్పవన్నారు.